సీమలో పవన్ పరువు నిలబెట్టుకుంటారా

 

సీమలో పవన్ పరువు నిలబెట్టుకుంటారా 

 
రాజకీయాల్లో ఏ అంశం ఎవరి మెడకు ఎలా చుట్టుకుంటుందో చెప్పడం కష్టం.  సంబంధం లేవనుకునే విషయాలే ఒక్కోసారి పూర్తి బాధ్యుల్ని చేస్తుంటాయి.  స్నేహాలు, పొత్తులు తెలీకుండాంనే ఇరుకున పడేస్తుంటాయి.  ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే పరిస్థితుల్లో ఉన్నారు.  గత ఎన్నికల తర్వాత పొత్తుల జోలికి వెళ్ళని ఆయన ఈమధ్యే బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు.  ఏపీలో కలిసి పనిచేయాలని కేంద్ర స్థాయిలో నిర్ణయం జరిగింది.  ప్రత్యేక హోదా ఇవ్వని భాజాపాతో పవన్ ఎలా కలుస్తారనే విమర్శలు వెల్లువెత్తాయి. 
 
తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పవ‌న్‌తో భేటీ అయ్యారు.  ఇకపై తెలంగాణ కోసం రెండు పార్టీలు కలిసి పోరాడతాయి అంటూ సంజయ్ ప్రకటించారు.  ఇక్కడే అసలు చిక్కు మొదలైంది.  ప్రజెంట్ ఇరు రాష్ట్రాల నడుమ పోతిరెడ్డిపాడు వివాదం జోరుగా నడుస్తోంది.  ప్రాజెక్ట్ కట్టి తీరుతామని జగన్ సర్కార్ అంటే కట్టనివ్వమని కేసీఆర్ అంటున్నారు.  ఈ వివాదం మూలంగా ఇరు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు ఏదో ఒక్క రాష్ట్రాన్ని మాత్రమే సపోర్ట్ చేస్తూ తమ ఉద్దేశ్యాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిన సిట్యుయేషన్ వచ్చింది.  నిజానికి వైసీపీ ఆ పరిస్థితి తీసుకొచ్చింది.  
 
ఏపీ విషయానికి వస్తే రాయలసీమకు నీళ్లు తెచ్చే ప్రాజెక్ట్ కాబట్టి కాదని ఏ ప్రాంతీయ పార్టీ అనడానికి లేదు.  ఇక ఏపీ భాజాపా ప్రాజెక్ట్ కట్టాల్సిందేనని అంటుంటే తెలంగాణ భాజాపా మాత్రం ఏపీ సర్కార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కేసీఆర్ మీద విరుచుకుపడాలని చూస్తోంది.  ఇలా రెండు రాష్ట్రాల్లో రెండు స్టాండ్స్ తీసుకున్న పార్టీతో పవన్ ఏపీలోనే కాదు తెలంగాణలో కలిసి పనిచేయడానికి అంగీకరించారు.  మరిప్పుడు ఆయన రాయలసీమకు ప్రయోజనకరం కాబట్టి పోతిరెడ్డిపాడును సపోర్ట్ చేస్తే తెలంగాణలో భాజాపాతో పొత్తులో ఉన్నారు కాబట్టి వారికి అనుకూలంగా ప్రాజెక్టును వ్యతిరేకిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.  
 
పవ‌న్‌కు రాజకీయంగా ఏపీ ప్రధానమైంది.  పైగా మొదటి నుండి రాయలసీమ ప్రయోజనాల కోసం, ఆ ప్రాంత బాగు కోసం తాను శ్రమిస్తానని, అందరి కంటే సీమ మీద తనకే ఎక్కువ శ్రద్ద, ప్రేమ ఉన్నాయని చెబుతూ వస్తున్నారు.  అలాంటి ఆయన ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న తెలంగాణ భాజాపాతో దోస్తీ చేయడం అంటే సీమకు వ్యతిరేకమేనని, ఒకవేళ ప్రాజెక్టును వ్యతిరేకిస్తే పవన్ సీమ ద్రోహి అవుతారని ఇప్పటి నుండే విమర్శలు వస్తున్నాయి.  మరి పవన్ ఈ ఇరకాటంలో చాకచక్యంగా నిర్ణయం తీసుకుని రాజకీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే సీమలో పరువును నిలబెట్టుకోవాలి.