వినాయకుడి.. వింతైన దేవుడు. విఘ్ననాయకుడు. సకల గణాలకు నాయకుడు కాబట్టి ఆయన్ను గణాధిపా అని కూడా పిలుస్తాం. ఆయన స్వరూపం మనకు అనేక విశేషాలను తెలుపుతుంది. ఆ విషయాలు తెలుసుకుందాం..
మొదట పూజించేది గణేశుడినే.
పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి ఆ కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిశిత పరిశీలనకు, మేథస్సుకు సంకేతాలు. ఆ వక్రతుండము, ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే’ఆత్మ’ లోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి వుండే నాగపాము శక్తికి సంకేతం. జగత్తునంతా ఆవరించి వున్న మాయాశక్తే ఈ నాగు.
నాల్గుచేతులు మానవాతీత సామర్థ్యాలుకు,తత్త్వానికి సంకేతం. చేతిలో వున్న పాశ, అంకుశములు బుద్ధి, మనస్సులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే. వ్యాస భగవానుడు మహాభారతం రాయసంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానం కోసం చేయవలసిన కృషికి. త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి మతం ప్రకారం అది కపిత్థం (వెలక్కాయ) ఏదిఏమైనా పైనచూస్తే గట్టిదనం లోపల తియ్యదనం ఉండేదనడానికి సంకేతం. గణేశునికి మూడు కళ్ళు, మూడవ కన్ను జ్ఞాననేత్రం. చేటలంత చెవులు మొరలాలించే ఆ దేవుడి ప్రత్యేకతను సూచిస్తాయి.
అంతఃసౌందర్యానికి ప్రతీక
గణేశమూర్తి వినోదకరమేమోగాని సుందరం కాదు. అదికూడా ఒక సంకేతమే. బాహ్యసౌందర్యానికి అంతర్గత మహోన్నతికి సంబంధం లేదని ఆ రూపం సూచిస్తుంది. వినాయకునికి సంబంధించి ఇంకో ప్రత్యేకతను ఇక్కడ చెప్పుకోవాలి. భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉంది కానీ, వినాయకుని ఎదుట అంత మాత్రం చాలదు. చేసిన తప్పులకు మనకు మనం శిక్ష విధించుకుంటున్నట్లుగా గుంజీలు తీయడం ఆయనంటే మనకున్న భయభక్తులకు గుర్తు.
ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు. ఈ స్వామికి అనేక రూపాలు. హేరంబ గణపతి, అర్కగణపతి, వక్రతుండ గణపతి ఇలా సుమారు 32 రకాల గణపతుల ఆరాధన మన శాస్త్రాలలో చెప్పబడింది. ఇక మహారాష్ట్రలో గాణపత్యులు అనేకమంది విశేషంగా స్వామిని ఆరాధిస్తారు.శంకరాచార్యులు ప్రతిష్టించిన షణ్ముఖ శాఖలలో గాణపత్యం ఒకటి. అంటే గణపతి ఆరాధన ఒకటి.