శబరిమల అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల వేసి నిత్యం అయ్యప్పను ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కార్తీక మాసంలో శివుని మాల తో పాటు అయ్యప్ప మాల వేసి మకరసంక్రంతి వరకూ దీక్షలో ఉంటారు. మకర సంక్రాంతి రోజున శబరిమల కొండపై వెలిగే దీపాన్ని చూసి మాల తొలగిస్తారు. అయితే అయ్యప్ప స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది..? శబరిమల కొండపై అయ్యప్ప కొలువై ఉండటానికి గల చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శివుడు, మోహిని అయ్యప్పని పంబ నది ఒడ్డున వదిలేసి వెళ్లిన తర్వాత పందల రాజు రాజశేఖరుడు ఈ బిడ్డను చూసి పిల్లలు లేని తనకు ఈ బిడ్డను శివుడి అనుగ్రహం గా భావించి తన అంతఃపురానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ బిడ్డను చూసి రాణీ కూడా ఎంతో సంతోషించింది. ఆ బిడ్డ అంతఃపురానికి వచ్చిన వేళా విశేషం వారికి పండంటి మగ బిడ్డ కూడా జన్మిస్తాడు. ఇక ఆ బాలుడిలో ఉన్న మంచి గుణాలను చూసి కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని పిలుస్తూ ఉండేవారు. ఇలా ఈ రెండు పేర్లను కలిపి అయ్యప్ప అని పిలవడం మొదలుపెట్టారు. అలా ఆ బాలుడికి అయ్యప్ప అని పేరు వచ్చింది.
రాజశేఖరుడు తన రాజ్యానికి అయ్యప్పను రాజుగా పట్టాభిషేకం చేయాలని ప్రకటిస్తాడు. తన సొంత కుమారుడికి కాకుండా అయ్యప్పకు పట్టాభిషేకం చేయటం ఇష్టం లేని రాణి..తనకి ఉన్న విపరీతమైన తలనొప్పి తగ్గాలంటే పులిపాలు కావాలని వైద్యులతో చెప్పించి అయ్యప్పాను అడవికి పంపటానికి ప్రయత్నం చేసింది. అయితే రాజశేఖరుడు అయ్యప్ప అడవికి వెళ్ళటానికి నిరాకరించడంతో…తనకు రాజ్యం మీద మక్కువ లేదని కేవలం తనకు ఒక ఆయలం నిర్మించాలని తండ్రిని కోరాడు. అయితే తాను అక్కడ నిలబడి ఒక బాణాన్ని సందిస్తే అది పడిన ప్రదేశంలో తనకు ఆలయం నిర్మించమని తండ్రిని కోరాడు. అలా అయ్యప్ప వదిలిన బాణం శబరిమల కొండపై పడితే ఆ బాణం పడిన ప్రదేశంలో ఆలయం నిర్మించారని పండితులు వివరించారు.