Droupadi Murmu: శబరిమల అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము..!

కేరళ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఉదయం పవిత్ర క్షేత్రమైన.. శబరిమలకు చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున హెలికాఫ్టర్‌లో పతనంతిట్ట చేరుకున్న రాష్ట్రపతి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పంపాకు వెళ్లారు. అక్కడ సాంప్రదాయానికి అనుగుణంగా పవిత్ర స్నాన విధిని నిర్వహించారు. గణపతి ఆలయంలో ఇరుముడిని సిద్ధం చేసుకుని భక్తి భావంతో సన్నిధానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. సాంప్రదాయ ప్రకారమే 18 పవిత్ర మెట్లు ఎక్కిన ఆమె అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దేవస్వం అతిథి గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు.

అయితే ఆమె శబరిమల యాత్రలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పతనంతిట్ట సమీపంలోని రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో అప్రత్యక్షంగా డ్రామా చోటుచేసుకుంది. ఉదయం 9.05 గంటల సమయంలో కొత్తగా సిద్ధం చేసిన హెలిప్యాడ్‌పై హెలికాఫ్టర్ సురక్షితంగా దిగినా, వెంటనే టైర్లు కాంక్రీట్ ఉపరితలంలో కొద్దిగా కుంగిపోయాయి. వెంటనే భద్రతా సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది చురుకుగా వ్యవహరించి హెలికాఫ్టర్‌ను స్థిరంగా నిలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వందలాది మంది భక్తులు రాష్ట్రపతిని చూడటానికి ఆలయానికి చేరుకున్నారు. అయ్యప్ప దర్శనం అనంతరం రాష్ట్రపతి సాంప్రదాయ పద్ధతిలో యాత్రను పూర్తిచేసి తిరువనంతపురం బయలుదేరారు. ఈ పర్యటనతో శబరిమల ఆలయానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చేకూరింది. భక్తుల మధ్య ఆనందం నెలకొంది. స్థానిక అధికారులు కూడా ఈ పర్యటనను సాఫీగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.