శబరిమల భక్తులకు కొత్త మార్గదర్శకాలు !

కార్తీకం వచ్చిందంటే దక్షిణాదిన మాలాధారులు కోలాహలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి కోవిడ్‌తో కొన్ని నిబంధనలతో కేరళ ప్రభుత్వం శబరిమల యాత్రకు భక్తులను అనుమతిస్తుంది. ఆ కొత్త మార్గదర్శకాలు తెలుసుకుందాం…
శబరిమలలో శ్రీఅయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. 62 రోజుల పాటు కొనసాగే మండల పూజలు, మకరవిళక్కు సీజన్ కోసం నవంబర్ 15, ఆదివారం సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప సన్నిధానం తలుపులు తెరిచారు. సోమవారం (నవంబర్ 16) నుంచి మండలిపూజ నిర్వహించారు.


ప్రతిరోజూ వెయ్యి మందిని అనుమతించనున్నారు. ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది ట్రావెన్కోర్ బోర్డు. నవంబర్ 16 నుంచి ప్రారంభమై డిసెంబర్ 26 వరకు జరిగే మండల పూజలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ నియమాలను ప్రతి భక్తుడు తప్పకుండా పాటాల్సిందిగా బోర్డు కోరింది.. భక్తులు వర్చువల్ క్యూలో రిజిస్టర్ చేసుకుంటేనే ఆలయంలోకి అనుమతించనున్నారు. కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. వారంలో ఐదు రోజులు.. రోజూ వెయ్యి మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారు. శనివారం, ఆదివారం మాత్రం రెండు వేల చొప్పున భక్తుల్ని అనుమతించనున్నారు. ఇక అతి ముఖ్యమైనది భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్-19 నెగిటీవ్ సర్టిఫికెట్ తీసుకొని రావడం. అది కూడా గత 24గంటల్లో తీసుకున్న సర్టిఫికెట్ అయి ఉండాలి. మెడికల్ ఇన్స్యూరెన్స్ కార్డును కూడా తప్పనిసరి చేశారు. భక్తులదంరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ఇక ఈసారి పంబ నదిలో స్నానాలకు మాత్రం అనుమతించలేదు. భక్తులకు స్నానాల కోసం ట్రావెన్కోర్ బోర్డు పంబలో ప్రత్యేకంగా షవర్లను ఏర్పాటు చేస్తోంది. పంబలో లేదా సన్నిధానంలో భక్తులు బస చేసేందుకు అనుమతి లేదు.
నీలక్కల్ దగ్గర పరిమితంగా బస ఏర్పాట్లు ఉంటాయి. స్వామి అయ్యప్పన్ రోడ్డు ద్వారానే ట్రెక్కింగ్కు అనుమతి ఉంది. సన్నిధానం దగ్గర నెయ్యాభిషేకం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. ఇక మండల-మకరవిలక్కు పూజ సందర్భాల్లో దర్శనానికి 5 వేల మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారు.
ఇప్పటికే డిసెంబర్ వరకు క్యూ స్లాట్స్ బుక్ అయ్యాయి. నవంబర్, జనవరిలో కొన్ని స్లాట్స్ మిగిలి ఉన్నాయి. 2020 నవంబర్ 16 నుంచి 2020 డిసెంబర్ 26 వరకు మండల పూజ, 2020 డిసెంబర్ 30 నుంచి 2021 జనవరి 20 వరకు మకరవిలక్కు పూజ, 2021 జనవరి 14న మకరవిలక్కు జరుపుకొంటారు.