మకరజ్యోతి దర్శనం అనంతరం ప్రశాంతంగా ముగుస్తుందనుకున్న దశలో శబరిమల మరోసారి భగ్గుమంది. అయ్యప్పస్వామిని దర్శించడానికి ఇద్దరు మహిళలు శబరిమల చేరుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. కేరళకే చెందిన రేష్మా నిషాంత్, షానిలా అనే ఇద్దరు నడి వయస్సున్న మహిళలు అయ్యప్ప మాలను ధరించి, ఇరుముడితో శబరిమల బయలుదేరారు.
బుధవారం తెల్లవారు జామున వారిని భక్తులు నీలిమల వద్ద గుర్తించారు. అక్కడే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, అయ్యప్ప భక్తుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. తాము సంప్రదాయం ప్రకారం మాల ధరించామని, కఠిన నియమాలను పాటించామని రేష్మా, షానిలా చెబుతున్నారు. అయ్యప్పను దర్శించనిదే తాము వెనుతిరగబోమని భీష్మించారు. భక్తులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారిద్దరూ వెనక్కి వెళ్లారు. పోలీసులు వారిని పంబకు తీసుకెళ్లారు.