కూతురిని చూడటానికి వెళ్లి… కానరాని లోకాలకు వెళ్లిన తండ్రీ!

దేశంలో ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న కూడా వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ప్రతిరోజు వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి విషాద ఘటన వైరా టౌన్ లో చోటు చేసుకుంది. హాస్టల్లో ఉంటున్న కూతురి యోగక్షేమాలు తెలుసుకోవడానికి బయలుదేరిన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఘటన విషాదం మిగిల్చింది.

వివరాలలోకి వెళితే…తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు గ్రామానికి చెందిన మూల నాగరాజు (35) అతని భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే నాగరాజు కుమార్తె పాల్వంచ గురుకుల పాఠశాలలో చదువుతోంది. శనివారం సెలవు కావడంతో కుమార్తెను చూడటానికి నాగరాజు బయలుదేరాడు. ఈ క్రమంలో బీరోలు నుంచి పాల్వంచ వెళ్తుండగా వైరాలోని స్థానిక అయ్యప్ప దేవాలయం సమీపంలోకి వెళ్ళగానే వెనుక నుండి వేగంగా వస్తున్న లారీ నాగరాజు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో నాగరాజు తీవ్ర గాయాల పాలవటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నాగరాజు మరణ వార్తను అతని కుటుంబ సభ్యులకు తెలియజేసి అతడి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నాగరాజు మరణ వార్త అందుకున్న కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. కూతురిని చూడటానికి వెళ్లి ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయాడంటూ భార్య పిల్లలు రోదిస్తున్నారు. నాగరాజు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.