స్ఫటికలింగ సాధన ఎలా చేయాలి ?

శివం.. అంటే సకల శుభాలు. ఐశ్వర్యప్రదాత, ఆరోగ్య విధాత శివుడు. ఆ స్వామిని ఆరాధిస్తే సర్వసౌభాగ్యదాయకం. అయితే ఆయన అర్చన అనేక రకాలు. వాటిలో స్పటిక లింగార్చన ఒకటి. నిర్మలమైన మనస్సుకు ప్రతిరూపం. ఆయన శుద్ధత్వానికి చైతన్యానికి స్పటికం ప్రతీక. ఆ విధివిధానాలు తెలుసుకుందాం…..

how to do spatika linga sadhana

‘‘స్ఫటిక లింగం ప్రతిష్ఠాప్య యాజాతి యో పుమాన్ !
రోగం శోకం చ దారిద్ర్యం సర్వ నశ్చతి తద్ గృహాత్ !!’’ అంటుంది శాస్త్రం. అంటే.. ఎవరైతే ఇంట్లోని పూజగదిలో స్ఫటిక లింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేసి నిత్య పూజ చేస్తారో, ఆ ఇంటినుండి రోగం, శోకం, దారిద్ర్యం సమసిపోయి, శ్రీలక్ష్మీదేవి స్థిరనివాసం చేస్తుంది.

‘‘పూజనాదస్య లింగస్య అభ్యర్చనాత్ సశ్రద్ధయా !
సర్వపాప వినిర్ముక్తః శివ సాయుజ్యమాప్నుయాత్ !!’’
సాధకుడు శ్రద్ధగా ప్రతిరోజూ శివలింగానికి అర్చన, పూజ చేస్తాడో వారు అన్ని పాపాలనుండి విముక్తి పొంది శివ సాన్నిధ్యాన్ని పొందుతారు.

స్ఫటికలింగ సాధనను మాసశివరాత్రి లేదా శివరాత్రి రోజున చేయాలి లేకపోతే ఏదైనా సోమవారం రోజైనా చేయవచ్చు.
శుభ ముహూర్తంలో దక్షిణ దిశవైపు ముఖంపెట్టి, ప్రశాంతంగా గదిలో లేకపోతే గుడిలో కూర్చోవచ్చు. సాధకుడు తన ఎదుట ఒక పీట వేసుకుని దానిపైన తెల్లని వస్త్రం పరచాలి. దానిపై ఒక పళ్ళెం లేదా పాత్ర పెట్టాలి. పళ్ళెంలో కుంకుమ లేదా కేసరి కలిపిన బియ్యం రాశిగా పోయాలి. బియ్యపు రాశిపై ప్రాణప్రతిష్ఠత చేతనాయుక్తమైన … మంచి ముహూర్తంలో శుద్ధిపరిచిన స్ఫటికలింగం స్థాపించాలి. తరువాత శివలింగాన్ని పంచామృతంతో స్నానం చేయించి పాలు కలిపిన నీళ్ళతో స్ఫటిక లింగానికి అభిషేకం చేయాలి. ‘ఓం శం శంకరాయ స్ఫటిక ప్రభాయ ఓం నమః’ అంటూ 108 సార్లు జపం చేయాలి. అభిషేకం చేసిన నీళ్ళను ప్రసాదంగా స్వీకరించాలి. పూజ పూర్తయిన తరువాత తమ కుటుంబ సభ్యులు అందరూ సంపూర్ణ ఆరోగ్యం, సుఖం, ఐశ్వర్యం ప్రసాదించమని శివున్ని ప్రార్థించాలి. నియమిత రూపంతో, నియమిత కాలంలో సాధనను ఏడు రోజులు ఆచరించాలి. పూజ అనంతరం స్ఫటిక శివలింగాన్ని పూజామందిరంలో పెట్టాలి. మిగిలిన పూజా సామాగ్రిని మూటకట్టి పారే నీటిలో విడిచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల సర్వసౌభాగ్యాలు, ఆరోగ్యం, ధనధాన్యాలు, ప్రతిష్ట పెరుగుతాయని శాస్త్రవచనం. భక్తితో చిత్తం శివుడిపై ఉంచి స్పటికారాధన చేస్తే భోళాశంకరుడు శ్రీఘ్రంగా అనుగ్రహిస్తాడు.