భోగిప‌ళ్ళంటే ఏమిటో తెలుసా?

తెలుగు ప్రజలకు అతి ముఖ్యమైన పండగలలో సంక్రాంతి సంక్రాంతి చాలా పెద్ద పండగ‌. నాలుగు రోజులపాటు జరుపుకునే విశిష్టమైన పండగ. రైతులు చేతికొచ్చిన పంట సమృద్ధిగా వస్తే ధనం సమృద్ధిగా వస్తుందని నమ్మకం. పండగంటే కొత్తబట్టలు, పిండివంటలొక్కటే కాదు జానపదకళలకు ప్రాధాన్యతనిచ్చే పర్వదినం. భోగి రోజున కొత్తబట్టలు కట్టుకుని, విందుభోజనాలు చేస్తారు. భోగాలు జరుపుకుంటారు. కావున భోగి అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు చెరకు ముక్కలు, కొత్తనాణెలు, రేగు పళ్లు నెత్తిమీద నుంచి ముతైదువులు పోస్తారు. భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు.

సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగుపళ్లు, చిల్లర డబ్బులు, బంతిపూలరెక్కలు, చెరుకు ముక్కలని తీసుకుని…. మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. భోగినాడు రేగుపళ్లని ఇంతగా తల్చుకోవడానికి చాలా కారణాలే కనిపిస్తాయి.భోగిరోజున దిష్టి తీసిన పళ్లను తినకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ, పిల్లలు తినేందుకు కావల్సినన్ని రేగుపళ్లు ఈ రోజు అందుబాటులో ఉంటాయి. ఈ భోగి పళ్లను ఐదేళ్లలోపు పిల్లలకి పోస్తారు. ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి. రేగుపళ్లు నిజంగా వీరిపాలిట అమృతంలా పనిచేస్తాయి. ఎందుకంటే రేగుపళ్లలో ‘సి’విటమిన్‌ చాలా ఎక్కువగా ఉండి రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ రోజుల్లో భోగి ప‌ళ్లంటేనే సిటీలో ఉన్న చాలా మందికి తెలియ‌డంలేదు. భోగిప‌ళ్లు అంటే… రేగిప‌ళ్ళ‌ను భోగి ప‌ళ్లు అంటార‌ని కూడా తెలియ‌నివాళ్ళున్నారు. అలాగే అప్ప‌టి ఆచారాల్ని పాటించేవాళ్ళు కూడా చాలా త‌క్కువ‌చే చెప్పాలి. భోగిరోజున భోగిప‌ళ్ళు పోయ‌డ‌మేకాక ఆ పిల్ల‌ల‌ను మేన‌త్త‌లు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. అలాగే చుట్టూ ముత్తైదువులు మంచి పాట పాడుతూ భోగిప‌ళ్ళు పోసేవారు.