Mani Ratnam: ఆ సినిమాను ఎప్పుడూ అలా ఊహించుకోలేదు: మణిరత్నం

Mani Ratnam: ప్రముఖ దర్శకుడు మణిరత్నం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు మణిరత్నం. ఇది ఇలా ఉంటే తాజాగా గోవా వేదికగా జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలకు మణిరత్నం హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ నిర్వహించిన చిట్ చాట్ లో పోస్ట్ అడిగినా ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ మేరకు ఆయన దర్శకత్వం వహించిన పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి.. పొన్నియిన్‌ సెల్వన్‌ కథను సినిమాగా కాకుండా వెబ్‌ సిరీస్‌ లాగా చేసి ఉంటే ఆయా పాత్రల గురించి లోతుగా వివరించే అవకాశం ఉండేది కదా అని ప్రస్తావించగా.. మణిరత్నం స్పందిస్తూ హాలీవుడ్‌ లో భారీ బడ్జెట్‌తో వెబ్‌ సిరీస్‌ లను రూపొందిస్తున్నట్టే ఇక్కడా భవిష్యత్తులో ఆ స్థాయిలో చేయొచ్చేమో, కానీ పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాను నేను ఎప్పుడు టెలివిజన్‌ షోలా ఊహించుకోలేదు.

ఒకవేళ అది సిరీస్‌ లా వచ్చుంటే, మనం దాన్ని చూస్తుండగా ఎవరైనా ఫోన్‌ చేస్తే మధ్యలోనే ఆపేసి మళ్లీ ఎప్పుడో ప్లే చేసుకొని చూస్తాము. అప్పుడూ ఎవరైనా కాల్‌ చేసినా మెసేజ్‌ చేసినా మన దృష్టి కథపై ఉండదు. అదే కథను థియేటర్‌ లో చాలామంది ప్రేక్షకులతో కలిసి చూస్తుంటే ఆ అనుభూతే వేరు అని చెప్పుకొచ్చారు మణిరత్నం. కాగా పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యా రాయ్‌, త్రిష తదితరులు నటించారు.