కోర్టు వివాదం పై అమరన్ టీం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది.. కొంచెం జాగ్రత్త పడాల్సిందంటున్న నెటిజన్స్!

మేజర్ ముకుంద రాజన్ నిజ జీవిత కథ ఆధారంగా శివ కార్తికేయన్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా అమరన్. రాజకుమార్ పెరియ సామి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. శివ కార్తికేయన్, సాయి పల్లవిల కెరియర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.

ముఖ్యంగా ఈ సినిమాలో సాయి పల్లవి, శివ కార్తికేయనుల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎమోషనల్ సన్నివేశాల్లో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం అందటం గమనార్హం. అయితే అనుకోని విధంగా ఈ సినిమా ఒక వివాదంలో చిక్కుకుంది. సినిమాలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా కోర్టు కేసులో ఇరుక్కోవలసి వచ్చింది. కోటి రూపాయలు నష్టపరిహారం కట్టమంటూ సదరు వ్యక్తికి కోర్టు ఎక్కటంతో ఈ వివాదం అమరన్ టీం కి సమస్యగా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే ఒక సీన్ లో హీరోయిన్ సాయి పల్లవి తన ఫోన్ నెంబర్ ఒక కాగితం మీద రాసి ఫోన్ చేయమని శివ కార్తికేయన్ పైకి విసురుతుంది. అయితే మూవీ టీం వాడిన ఆ నెంబరు చెన్నైలోని విగ్నేషన్ అనే ఒక ఇంజనీరింగ్ కుర్రాడుదట. సినిమా అనంతరం ఆ నెంబర్ సాయిపల్లవిదే అనుకొని చాలామంది ఆకతాయిలు తన ఫోన్ కి కాల్ చేస్తున్నారని నిరంతరం వస్తున్న ఫోన్ కాల్స్ వల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని..

తన అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ వాడుకున్నందుకు తనకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నాడు. అయితే తలనొప్పిగా మారిన ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా సినిమాలలో ఇలాంటి ఫోన్ నెంబర్లు సీన్స్ వచ్చేటప్పుడు నెంబర్ ని బ్లర్ చేస్తారు కానీ ఈ సీన్ లో నెంబర్ క్లియర్ గా కనిపించడంతో సమస్య మొదలైంది. ఏమైనా యూనిట్ నెంబర్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సింది అంటున్నారు నెటిజన్స్.