మహా కళాకారుడు , మానవతావాది అమితాబ్

భారతీయ సినిమాకే గౌరవం తీసుకొచ్చిన మహా నటుడు అమితాబ్ బచ్చన్. అమితాబ్ పండిత కుటుంబం నుంచి వచ్చిన కళాకారుడు. తండ్రి హరి వంశ్ రాయ్ బచ్చన్, ప్రఖ్యాత కవి, తల్లి తేజి బచ్చన్. అమితాబ్ సన్నగా రివటలా ఉండేవాడు. హిందీ సినిమాల్లో నటించాలని 1968వ సంవత్సరంలో బొంబాయి మహానగరంలో అడుగు పెట్టాడు. అతని ఎత్తు, రూపం చూసి చాలామంది నిరుత్సాహ పరిచారు. అయినా పట్టువదలని విక్రమార్కుడులా ప్రతి సినిమా కార్యాలయం తిరిగాడు. అతని కష్టం ఫలించింది. 1969లో “సాత్ హిందుస్తాన్” అన్ని చిత్రంలో అవకాశం వచ్చింది.

ఆతరువాత నటుడుగా రాణించడానికి కష్ట పడుతూనే వున్నాడు. 1973లో జంజీర్ అనే చిత్రంలో తన  జయ భాదురి నటించింది. ఆతరువాత వారి  పరిచయం పెళ్ళికి దారి తీసింది. వివాహం తరువాత  అమితాబ్ వెనక్కు తిరిగి చూసుకోలేదు. మొదట ఎవరైతే  పొడుగ్గా ఉన్నావని  ఎగతాళి చేశారో
వారే ఆయన్ని కీర్తించారు.


అమితాబ్ సాధించనిది  ఏమిలేదు. చక్కటి సంతానం, సంతృప్తినిచ్చే సంసారం, ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు. ఇవ్వాళ అమితాబ్ 76వ పుట్టిన రోజు పండుగను. అయన కుటుంబ సభ్యులే కాకుండా అన్ని దేశాల్లో వున్న అభిమానులు జరుపుకుంటున్నారు.

 
అమితాబ్ వ్యక్తిత్వాన్ని తెలియజేసె రెండు సంఘటనలు  ఈ సందర్భంగా చెపుతాను. 1983 వ సంవత్సరంలో అమితాబ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ హిందీ చిత్రం షూటింగ్లో వున్నారని తెలిసింది . నేనప్పుడు ఆంధ్ర జ్యోతి సంస్థ ప్రచురించే జ్యోతి చిత్ర పత్రిక లో పనిచేస్తున్నా. నాతో పాటు ఫోటోగ్రాఫర్ ఎప్పుడు ఉంటాడు. మేము ఇద్దరం అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళాం. అప్పుడు ఉదయం 11. 30 గంటల సమయం . నాల్గవ ఫ్లోర్ లో షూటింగ్ జరుగుతుందని చెప్పారు. అక్కడకు వెళ్ళగానే ఫ్లోర్ తలుపు మూసి వుంది.  ఆ తలుపుకు “నో అడ్మిషన్ ఫర్ ప్రెస్  అండ్ విజిటర్స్ ” అని వుంది. అయినా ఫ్లోర్ తలుపు దగ్గర ఉండేది అన్నపూర్ణ స్టూడియో స్టాపే కాబట్టి  నేను దగ్గరకు వెళ్ళగానే నమస్కారం పెట్టి తలుపు తీశాడు. ఫోటోగ్రాఫర్ ను మాత్రం బయటే ఉండమన్నా. ఆ సినిమా పేరు మహాన్, ఎస్. రామనాథ్ నిర్మాత దర్శకుడు. ఆ చిత్ర అసోసియేట్ తో  పరిచయం చేసుకున్నా, ఆయన రామనాథ్ దగ్గరకు తీసుకెళ్లాడు.  ప్రెస్ అనే మాట వినగానే “మీరు ఎలా లోపలకు వచ్చారు, బయట బోర్డు చూడలేదా?” అని అడిగారు.


పక్కనే వున్న అసోసియేట్ కలుగజేసుకొని ” ఆయన నాగేశ్వర రావు గారికి బాగా సన్నిహిత జర్నలిస్ట్. ఆయన్ని ఎవరు ఆపరు ” అని చెప్పాడు.
ఆ మాటతో రాంనాథ్ కొంచం మెత్తపడ్డారు . “మీరు వస్తే నాకు ఏమి ఇబ్బంది లేదు. అమితాబ్ సర్ మూడ్ పాడవుతుంది. ఆయనకు జర్నలిస్టులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. అందుకే బయట బోర్డు పెట్టాము “అని చెప్పాడు. ఆమాటతో బాగా నిరుత్సాహం అనిపించింది . అయితే అమితాబ్ తో మాట్లాడే అవకాశం రాదు అనుకున్నా. రామనాథ్  నా వైపు చూసి ” మీరు ఏ పత్రిక ” అని అడిగారు. “ఎంపీ కె ఎల్ .ఎన్  ప్రసాదుగారి ఆంధ్ర జ్యోతి “అని చెప్పాను.  ఆమాట విని రామానాథ్ చాలా సంతోషపడి షైక్ హ్యాండ్ ఇచ్చారు.

” అక్కడ కూర్చుందాం రా ” అని ఓ సోఫా వైపు దారి తీశాడు. నేను వెళ్లిన సమయానికి లైటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే  రామనాథ్ నాతో మాట్లాడటానికి  అవకావం దొరికింది. సోఫాలో కూర్చున్నతరువాత బాయ్ ని పిలిచి టి తీసుకురమ్మన్నాడు. ఆయనలో వచ్చిన మార్పు నాకు అర్ధం కాలేదు. “మీరు మా కె ఎల్ .ఎన్  ప్రసాదుగారి పత్రికలో పనిచేస్తారా ? ప్రసాద్ గారు నేను చాలా మంచి ఫ్రెండ్సమి. ఢిల్లీలో తరచుగా కలుస్తుంటాం ” అని చెప్పాడు. అమితాబ్  దగ్గరకు తీసుకెళ్లి నన్ను  వారికి పరిచయం చేశాడు. ఆయన పరిచయంతో అమితాబ్ నాకు మర్యాద ఇవ్వడం మొదలై పెట్టాడు.

“నాకు జర్నలిస్టులంటే ప్రత్యేకించి కోపం లేదు. కానీ మా బొంబాయి జర్నలిస్టులు వాళ్ళ ఇష్టం వచ్చి నట్టు రాస్తారు. వారికి నేను ఇంటర్వ్యూలు ఇవ్వను ” అన్నాడు అమితాబ్. మేము మీ వ్యక్తిగత జీవితాలపై వున్నవి  లేనివి వ్రాయం. ఇక్కడ ఆరోగ్యకరమైన జర్నలిజం వుంది ” అని చేప్పాను.

ఆయనకు సంతృప్తి కలిగింది. “నేను మా ఫోటోగ్రాఫర్ ను పిలుస్తాను ” అనగానే తప్పకుండా అన్నాడు. ఫోటోగ్రాఫర్ లోపలకు  వచ్చి ఫోటోలు తీసుకోవడం మొదలు పెట్టాడు. అప్పటికే షాట్ రెడీ అయ్యింది. అమితాబ్ “మళ్ళీ మాట్లాడదాం ” అని చెప్పి వెళ్లి పోయాడు. ఆ షాట్  అయిపోయిన తరువాత ఆయన నా దగ్గరకు వచ్చాడు. ఆయనతో చాలాసేపు మాట్లాడాను .. పేపర్ మీద రాసుకోకుండా ఇంటర్వ్యూ  చేయడం  నా  అలవాటు. దాదాపు 15 నిమిషాలపాటు ఆయనతో మాట్లాడాను. ఆయన మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకొని “జీ ..జీ ” అనడం  చూసి చాలా ఆశ్చర్య పోయాను. అమితాబ్ తో నేను చేసిన ఇంటర్ వ్యూ  నాకు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇక రెండవ ఘటన. 1999లో అప్పుడు నేను ఆంధ్ర ప్రభలో పనిచేస్తున్నా. అమితాబ్ సూర్యవంశం చిత్రం కోసం హైదరాబాద్ వచ్చాడు.


 సూర్యవంశం హిందీ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పద్మాలయ స్టూడియోలో  జరుగుతున్నప్పుడు, నేను  సీవీ సుబ్బారావు ఇద్దరం అక్కడకు వెళ్ళాము. ఆ సినిమాను  పద్మాలయ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. మేము వెళ్ళేటప్పటికి నిర్మాత హనుమంతరావు బయటే వున్నాడు. మేము వచ్చిన పని చెప్పాము. “రండి అమితాబ్ కు పరిచయం చేస్తా “అన్నాడు. మా ఇద్దరినీ అమితాబ్ పరిచయం చేశాడు. నేను అప్పుడు అన్నపూర్ణలో కలిసిన సంగతి గుర్తు చేశాను  “ఐ సీ ” అన్నాడు షైక్  హ్యాండ్ ఇచ్చి. చెన్నై లో జరిగే  సినిమా ఎక్సప్రెస్ అవార్డుల కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా ఆహ్వానించడానికి  వచ్చామని, చైర్మన్  మనోజ్ కుమార్ సంతాలియా పంపించాడని ఆయనకు
చెప్పాను. మా గురించి హనుమంత రావు అమితాబ్ కు బాగా చెప్పాడు. “తప్పకుండా , రెండు రోజుల తరువాత కలవండి, ఈ లోపు నేను బొంబాయి లోని నా సెక్రటరీ తో మాట్లాడతాను” అన్నాడు “సరే సర్ “అని చెప్పాను . ఆ సంవత్సరం జరిగిన సినిమా అవార్డుల కార్యక్రమానికి
అమితాబ్ హాజరయ్యారు. అమితాబ్ ఒక సూపర్ స్టార్ లా కాకుండా ఆత్మీయుడుగా మాట్లాడటం మాకెంతో ఆనందాన్ని కలిగించింది.

అప్పుడు కూడా చేతులు కట్టుకొని “జీ … జీ ” అనడం ఆయన సంస్కారానికి నిదర్శనం. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి వుండే తత్త్వం  ఆయన నిరాడంబరత చాటుతుంది. నిజంగానే అమితాబ్ ది  నింగి నంటే వ్యక్తిత్వం. అమితాబ్ ఇప్పుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న “సైరా నరసింహా రెడ్డి ” తెలుగు సినిమాలో చిరంజీవి గురువుగా నటిస్తున్నారు. పద్మ విభూషణ్ అమితాబ్ భారతీయ సినిమా గర్వించతగ్గ మహా నటుడు.


-భగీరథ