నిద్రలోనే షాక్.. 10వ ఫ్లోర్ నుంచి జారిన వ్యక్తి.. ఆ తర్వాత..!

ఒక్క క్షణం.. అజాగ్రత్త తిరిగినంత మాత్రాన ప్రాణాలే పోయే ప్రమాదం ఎదురైంది. కానీ విధి అతడిని కాపాడింది. గుజరాత్‌లోని సూరత్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సూరత్ జహంగీరపురా ప్రాంతంలోని టైమ్స్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 57 ఏళ్ల నితిన్‌భాయ్ ఆదియా బుధవారం ఉదయం తన ఇంట్లో కిటికీ పక్కన నిద్రలో ఉన్నాడు. నిద్రలోనే పక్కకు తిరిగిన సమయంలో అదుపుతప్పి కిటికీ నుంచి నేరుగా కిందకు జారిపోయాడు. పదో అంతస్తు నుంచి కిందపడుతున్న సమయంలో విధి అతడికి అనూహ్యంగా చేయి అందించింది.

ఆదియా ఫ్లాట్‌కు రెండు అంతస్తుల దిగువన ఉన్న ఎనిమిదో అంతస్తు కిటికీకి అమర్చిన ఇనుప గ్రిల్‌లో అతడి కాలు ఇరుక్కుపోయింది. దీంతో అతడు పూర్తిగా కిందపడకుండా తలకిందులుగా వేలాడుతూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యం చూసిన అపార్ట్‌మెంట్ వాసులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. జహంగీరపురా, పలన్‌పూర్, అదాజన్ ఫైర్ స్టేషన్ల నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. పై అంతస్తు నుంచి తాళ్లు, సేఫ్టీ బెల్టులు ఉపయోగించి గంటకు పైగా శ్రమించి ఆదియాను సురక్షితంగా పైకి లాగారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తలకిందులుగా వేలాడుతూ, ఒకే కాలుతో గ్రిల్‌లో చిక్కుకున్న ఆదియా దృశ్యం చూసిన నెటిజన్లు ఉలిక్కిపడుతున్నారు. అదృష్టవశాత్తూ అతడికి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.