అభివృద్దే ఊపిరిగా ఆరు వసంతాల తెలంగాణ 

6 Years of Telangana formation Day
ఈరోజుతో తెలంగాణ రాష్ట్రం అవతరించి ఆరేళ్లు పూర్తైంది.  ఈ ఆరేళ్లలో ఆ రాష్ట్రం సాధించిన అభివృద్ది సామాన్యమైంది కాదు.  ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రగతి ఎలా సాధ్యమని దేశం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.  ఈ ప్రగతి అంత సులభంగా దక్కింది కాదు.  దాని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ పనితనం, సాహసోపేత నిర్ణయాలు, రాజీ లేని రాజకీయం, మొక్కవోని పట్టుదల ఉన్నాయు.  నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాలను ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ముందుకు నడిచింది తెలంగాణ.  ఈ నడకలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, రైతు బంధు, హరిత హారం, కళ్యాణ లక్ష్మి ఇలా అనేక మెట్లు నిర్మించుకుంటూ ఎదిగిన తెలంగాణ స్వరూపాన్ని ఒక్కసారి చూస్తే.. 
 
కోటి ఎకరాలను తడిపే కన్నీటి కల:
గోదావరి నిండా నీరున్నా వాడుకోవడానికి వీలు ఇవ్వని భౌగోళిక పరిస్థితుల మూలంగా తెలంగాణలోని ఎన్నో లక్షల ఎకరాలు బీడు భూములుగా మారిన నేపథ్యంలో కేసీఆర్ భగీరథ ప్రయత్నం మొదలుపెట్టారు.  ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి కాళేశ్వరంగా మార్చారు.  కేవలం మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేసి సముద్రమట్టానికి దాదాపు అరకిలోమీటరు ఎత్తుకు గోదావరి జలాలను తీసుకెళ్ళి కోటి ఎకరాలను తడపాలన్న కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.  ఇదే కాదు సీతారామ, దేవాదుల, డిండి, పాలమూరు ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారు.  కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 
 
2 లక్షల కోట్ల పెట్టుబడులు:
గత ఐదేళ్లలో తెలంగాణ సాధించిన పెట్టుబడుల విలువ అక్షరాలా 2.04 లక్షల కోట్లు.  మైక్రోసాఫ్ట్, గూగుల్, జాన్సన్ అండ జాన్సన్, కొకకోలా, ఫేస్ బుక్, అమెజాన్, సేల్స్ ఫోర్స్ లాంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి.  ఐటీ రంగంలో కొత్తగా 2.10 లక్షల మందికి ఉద్యోగాలు దొరికాయి.  కొత్తగా వచ్చిన 12,400 పరిశ్రమల ద్వారా 14 లక్షల మందికి ఉపాధి లభించింది.  కరోనా కారణంగా 2020లో ఎగుమతుల్లో జాతీయ సగటు 8.09% ఉంటే తెలంగాణ మాత్రం 18% వృద్ధిని నమోదు చేసింది.
 
విద్యుత్ కోతల్లేని రాష్ట్రం:
కొత్త రాష్ట్రం ఏర్పడేనాటికి 2,700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండగా కేవలం ఆరు నెలల్లో దాన్ని అడిగమించి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా మారింది.  2018 నుండి 24 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు నిరంతరంగా విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.  28 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.  
 
పండుగలా వ్యవసాయం :
కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయ రంగానికి పెద్ద పీఠ వేశారు. రైతు బంధు ద్వారా  రైతులకు ఎకరానికి 10 వేల పెట్టుబడి సాయం ప్రతి యేటా అందిస్తున్నారు.  18 నుండి 59 ఏళ్ల లోపు వయసున్న రైతులు మరణిస్తే తక్షణ సాయంగా 5 లక్షలు అందిస్తున్నారు.  వ్యవసాయం అంటే వ్యధ కాదు అదొక పండుగ అనేలా చేయాలనేది కేసీఆర్ లక్ష్యం.  ఎన్నడూ లేనంతగా గత రబీ సీజన్లో కోటి టన్నుల వరి దిగుబడి సాధించి రికార్డ్ నెలకొల్పారు.  
 
రాష్ట్రానికి హరితహారం :
రాష్ట్రంలో అడుగడుగునా పచ్చదనం విరియాలనే  లక్ష్యంతో 182.74 మొక్కలను నాటారు.  2015 జూలై 3న ప్రారంభమైన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో  కోట్లాది మొక్కలు నాటారు.  11,941 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి నిరంతరం మొక్కల సరఫరా చేస్తూ రాష్ట్రాన్ని పచ్చగా మార్చారు. 
 
ఇవే కాకుండా ప్రజా ఆరోగ్యానికి, మౌలిక వసతులకు పెద్ద పీఠ వేశారు.  సుమారు ఒకటిన్నర కోటి మందికి నేత్ర పరీక్షలు చేశారు.  డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు, గర్భిణుల కోసం 25 జిల్లా, ఏరియా ఆసుపత్రులలో 20 ఐసీయూలను ఏర్పాటు చేశారు.  కొత్తగా 3,150 కి.మీ జాతీయ రహదారులను మంజూరు చేశారు.  మిషన్ భరీరథతో 43,791 కోట్లతో ప్రతి ఇంటికీ సురక్షిత మంచి నీటిని అందించే ప్రయత్నం దాదాపు పూర్తయ్యే దశలో ఉంది.  కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద ఇప్పటివరకు 6 లక్షల మంది పేదింటి ఆడ పిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం అందించింది సర్కార్.  మొత్తం మీద ఈ ఆరేళ్లలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్దే ఊపిరిగా సాగిపోతోంది.