(సయ్యద్ సలీమ్ బాష)
కర్నూల్ బి క్యాంపు ఎలిమెంటరీ స్కూలు గురించి తెలియనివారెవ్వరూ ఉండరు. అప్పట్లో అదొకటే స్కూలు. కాలనీలోని ఏ పిల్లవాడు అయినా సరే అదే స్కూల్లో చదవాల్సిందే. ఇంకా ప్రైవేటు స్కూల్స్ పెద్దగా లేని కాలమది. అందువల్ల కాలనీలో చిన్నపిల్లలందరికి అదే ఏకైక స్కూల్.
నేనూ అక్కడే చదూకున్నా, ఒకటి నుంచి ఐదు దాకా నా క్లాసు లో నా పక్కనే గచ్చు మీద కూర్చునే వాళ్లలో శర్మ గాడంటే నాకు ఫాసినేషన్ రెవరెన్స్ రెండూ ఉండేవి. శర్మ గాడి తో పాటు నాకు లెఫ్ట్ సైడ్ కూర్చునేది లొడ్డా( ఎడమచేతి వాటం అన్నమాట) వెంకటేష్ గాడు. శర్మ గాడేమో సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వాడు నేనేమో సాయిబు కాని సాయిబును. నాకు అప్పట్లో మతం గురించి పెద్దగా తెలీదు తెలియదు. ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా తెలీదు అది వేరే విషయం! చిత్రమేమిటంటే నాకు దగ్గరగా ఉన్న ఇద్దరూ సనాతన బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చిన వారే!
మా శర్మ గాడి దగ్గర చాలా టాలెంట్లు ఉండేవి. చదువులో వాడు ఫస్టు. అప్పట్లోనే వాడి దగ్గర నాయకత్వ లక్షణాలు పుష్కలం, కానీ తెలుగు పద్యాల్లో నేనే ఫస్ట్! (మా తాతగారు తెలుగులో నిష్ణాతులు కదా) అదొక్కటి వాడి కొంచెం బాధగా ఉండేది అనుకుంటా. బహుశా దాని వల్లనే నేనంటే వాడికి కొంత గౌరవం ఉండి ఉండవచ్చు. వాడికున్నటాలెంట్ లలో అతి ముఖ్యమైన టాలెంట్ ఒకటి ఉంది. పకడ్బందీగా ప్యాక్ చేసిన దోశ పార్సిల్ లోంచి చాకచక్యంగా కూర, చట్నీ దొంగిలించడం. మళ్ళీ యాజ్ ఇటీజ్ గా పార్సెల్ చేయటం. దోశ చట్నీ చౌర్యం అప్పట్లో ఒక రహస్యం గా ఉండిపోయింది నా దగ్గర. అదో పెద్ద హకల్ బెరీ ఫిన్ స్టోరీ లాంటిది అంటే అడ్వంచరస్ మిస్టరీ అన్నమాట ! మా టీచర్ ఒక ఆమెకి దోశ అంటే బాగా ఇష్టం. అది మా స్వామి హోటల్లో ఘుమఘుమలాడే ఆలు కూర, చెట్నీ తోనే ఉండాలి. ఆ రోజుల్లో స్వామి హోటల్ అంటే ఫేమస్. ఇప్పుడున్న సిల్వర్ జూబిలీ హాస్టల్ పక్కనే ఉండేది. పొడవైన కొట్టంలో సిమెంట్ చప్టాలు, చెక్క కుర్చీలు, కౌంటరు మీద రేడియో, ఇది హోటల్ లోపలి దృశ్యం. అప్పట్లో దోశ పావలానే అనుకుంటా. ఆ దోశకి భలే డిమాండ్ ఉండేది. బీ.ఎడ్ కాలేజ్ స్టూడెంట్స్, బీ.క్యాంప్ స్కూల్ టిచర్లు, కొంత డబ్బులున్న బీ.క్యాంపు వాసులకి అదంటే చాలా ఇష్టం. ఆ హోటల్లో సిమెంట్ చప్టా పైన పెద్దాళ్ళ సరసన కూచుని వేడివేడి దోశ తినాలన్న కోరిక ఉన్నా తిన లేకపోయాను. ప్రతీ సారి మా టీచర్ శర్మగాడినే దోశ తేవటానికి పురమాయించటంలో ఆశ్చర్యం ఎమీ లేదు. వాడు క్లాస్ లీడర్ మరి. దోశ కోసం వెళ్ళేప్పుడు వాడితో పాటు ఎవర్నైనా తోడు తీసుకెళ్ళే ఒక సౌకర్యం ఉండేది వాడికి. నాకు మాత్రం భలే టెన్షన్ గా ఉండేది..నన్ను తీసుకెళ్తాడో లేదోనని. కాని చిత్రంగా వాడు ప్రతిసారీ నన్నే ఎంచుకునేవాడు.
ఇక అడ్వంచర్ మొదలు. మా స్కూలుకీ, స్వామి హోటల్ కి మధ్య మహా అయితే ఓ ఫర్లాంగ్ ఉండేదేమో. ఏడెనిమిదేళ్ళ వయసులో అప్పట్లో అది పెద్ద జర్నీనే! ముళ్ళ కంపల మధ్య దారిలోనుండి ఇప్పుడున్న గర్ల్స్ స్కూల్ గ్రౌండ్ దాటి స్వామి హోటల్ చేరటం భలే బావుండేది. నాకు అక్కడి వాతావరణం, పెద్దవాళ్ళూ భయాన్ని కలిగిస్తే, మా శర్మగాడు మాత్రం కేర్ లెస్ గా, పైలా పచ్చీసుగా ఉండేవాడు. నేరుగా కౌంటర్ దగ్గరకెళ్ళి, ” స్వామీ, మా టిచర్ కి ఒక దోశ పార్సిల్” అంటూ పావలా బిళ్ళ టేబుల్ పై పెట్టటం నాకు ఇంకా గుర్తుంది. అందుకే నాకు వాడ్ని చూస్తే ఫ్యాసినేటింగా ఉండేది.
ఇక కథ మొదలు. మా ప్రభాకర్ (స్వామి హోటల్లో అతనే సర్వర్, క్లీనర్, మేనేజర్) “ఒక్క దోసెయ్” అని మళయాళీ యాసలో అరవటం, పెనం మీద ‘సుయ్” అన్నా శబ్దం, ఆనక వచ్చే ఆలూ కూర, కొబ్బరి చేట్నీ వాసన ఇప్పటికి నానుంచి పోలేదు. అయిటే మా వాడు మాత్రం నిశితంగా హోటల్ని, మనుషులనీ అబ్జర్వ్ చేసేవాడు.
ఇక ఓ పేపర్ పైన విస్తరాకు పరిచి, దానిపై దోశను పెట్టి, అలవోకగా మడిచి, రెండు చివర్లు లోపలికి నొక్కి పార్సిల్ తయరు చేయటం ప్రభాకర్ తప్ప వేరెవరూ చెయ్యలేరని నాకు అనిపించేది. ఆ స్పీడూ, ఆ స్కిల్లూ భలే థ్రిల్లింగా ఉండేది. కానీ, ప్రభాకర్ దోశను పార్సిల్ చెయ్యటం కన్నా మా వాడు మధ్య దారిలో పార్సిల్ విప్పీ, కొంచె కూరా, చెట్నీ తినేసి, మళ్ళీ యాజ్ ఇటీజ్ గా పార్సిల్ చేయ్యగలిగే టాలెంటే గొప్పదని నా అభిప్రాయం.
ఇదంతా నాకు తెలిసినా నేను ఎవ్వరికీ చెప్పలేకపోయే వాడ్ని. కారణం వాడు నాను ఇంకోసారి తీసుకెళ్ళడని.అంతే! ఈ అడ్వెంచర్ ని మిస్ కావటం నాకు ఇష్టం లేదు. పైగా టీచర్ కి దోశ తీసుకు రావటం మనకు ఒక ప్రివిలేజ్ చిన్నప్పుడు. అందుకే వాడి చేట్నీ చౌర్యం బైట పడలేదు. దానికి తోడు శర్మగాడు నాకు ఇచ్చిన వార్నింగ్! ఇంతా చేసి ఆ చౌర్యంలో నాకు భాగాం లేకపోవటం వల్ల కొంత ఉక్రోషంగాను, వాడి మీద కొంత కోపంగానూ ఉండేది. దాంతో వాడ్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం లేకుండా పోయింది. చౌర్యం బయట పడ్డా వాడు మేనేజ్ చెయ్యగలిగే వడని నా నమ్మకం.
వాడు చాలా స్వార్థపరుడు. ఎవ్వరికీ ఏమీ ఇచ్హే వాడు కాదు. నాకు మాత్రం బుడ్డల గట్టాలు, నిమ్మప్పులు కాకి ఎంగిలి చేసి కొంత ఇచ్చేవాడు. ఉప్పు శనగలు, బఠాణీలు, సీమ చింత కాయలు, చిటి మిటి పండ్లు వాడే తినే వాడు.
అలా ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వని శర్మ గాడు ఓ రోజు స్కూలు మొత్తానికి ఇచ్చాడు, సెలవు..
ఆరోజు నాకు బాగా గుర్తుంది మేమంతా ఆనందంగా కేకలు పెట్టుకుంటూ ఆనందంగా పరిగెత్తుకుంటూ ఇళ్లకు వెళ్ళిపోయాము.
ఆరోజు నాకు బాగా గుర్తుంది. మా అహ్మద్ సారు ” ఒరేయ్! ఈరోజు స్కూల్ లేదు. అందరూ వెళ్లిపోండి.” అన్నారు. అందరము ఆనందంగా వెళ్లిపోయాం. ఎందుకు సెలవు అని అడిగే వయసు కాదు. పెద్దవాళ్లు అనుకుంటుంటే తెలిసింది శర్మ గాడు చనిపోయాడని. ఒకరు చచ్చిపోతే స్కూల్ కి సెలవిస్తారు అప్పుడు తెలిసింది. 2 రోజుల క్రితం ఎర్ర తేలు కుట్టిందట. సోమవారం ఉదయాన్నే వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఏడవలేదు. బాధపడలేదు. కానీ ఇప్పుడు తలచుకుంటే ఎక్కడో కలుక్కుమంటుంది .వాడు బతికుంటే కచ్చితంగా ఏ డాక్టర్ సైంటిస్టో అయి ఉండేవాడని నా నమ్మకం. వాడి పొగరు,ధైర్యం, టాలెంటు, రోజు నుదుటి మీద పెట్టుకునే బొట్టు నేను మర్చిపోలేదు!
స్కూలు (బాగా మారిపోయింది) ఇంకా ఉంది. ఇంకా రెండు “సీ” టైపు ఇళ్ళూ ఉన్నాయి.వాటి వెనక ఉచ్చ వాసన లేదు. ఎదురుగా కానుగ చెట్టు లేదు.. స్వమి హోటల్ లేదు.. స్వామీ లేడు. ముళ్ళ దారీ లేదు. బీ.టీ కాలేజ్ ఉంది.. గర్ల్స్ స్కూల్ ఉంది.. గ్రౌండూ ఉంది..
శర్మగాడే లేడు. ఆ పక్క వెళ్ళినపుడు గుర్తొస్తాడు.. అంతే.
ఎప్పుడు ఎవ్వరికీ ఏమీ ఎవ్వని వాడు అందరికీ సెలవిచ్చి సెలవు తీసుకున్నాడు.
***