మా నాన్నేం గొప్ప?

(సలీం బాష)
 

అయన కూడా అందర్లాంటి నాన్నే.కాని కొంచెం స్ట్రిక్ట్ కొంచెం సీరియస్. ఏం చెయ్యాలో తెలియనివాడు ఏం చెయ్యకూడదో బాగా తెలిసినవాడు. మా నాన్న నవ్వడం తక్కువే.. 83 సంవత్సరాల కాలంలో అయన చూసిన సినిమాలు అన్నే ఉండివుంటాయి!

6 మంది పిల్లల్ని పెంచటంలో అయన చేసిందేవుంది అంటే పెద్దగా ఏం లేదనే  చెప్పాలి. అందర్లా లంచాలు తీసుకుని ఓ ఇల్లు కట్టాడా? పోనీ దర్జాగా బతికాడా అంటే అది లేదు.. సంసారాన్ని మోసాడంట. అందరూ

మోస్తారు.. కష్టపడతారు. ఏం గొప్ప? లేదే. మరేం గొప్ప చేప్పాలి అయన గురించి? 

కాకపోతే ఉన్న కాస్త స్థలం అమ్మేసి పెద్దాడ్ని చదువుకి పంపితే వాడు వెనక్కొచ్చాడు అంతే తప్ప ఏం చేశాడు వాడికి? రెండోవాడికి చదువబ్బక పోతే అప్పు చేసి ఓ షాపెట్టిస్తే వాడు దాన్నివదిలేశాడు. అంతకన్నా ఏం చేశాడు వాడికి?  

మా చిన్న చెల్లెలు ఓ పల్లేటూళ్ళో టీచరు గా పంచేయ్యలేక పోతుంటే కష్టపడి మునిసిపల్ స్కూల్లో కి తీసుకొచ్చాడు.  అంతకుముందు పెళ్ళి చేశాడు దానికి అయితే ఏంటీ గొప్ప? 

మా అక్కకీ చదువబ్బలా. దానిక్కూడా పెళ్ళి చేశాడు. ఇక మా చిన్నోడు..ఆడికయితే అస్సలేం చేయాలా? 

అమెరికా ఎళ్తానంటే కొంచెం అప్పు చేశాడు..తర్వాత తీర్చాడు వాడు.

నాకేం చేశాడు? మహా అయితే బీ.ఎడ్ చెయ్యటానికి డబ్బులిచ్చాడు. రోజూ బావుండు.. సెకండ్ షో సినిమాలకి

వెళ్ళి అరోగ్యం చెడగొట్టుకోవద్దు అని బుర్ర తినేవాడు. ఎప్పుడూ ఏం చేసినా మెచ్చుకునేవాడు కాదు. 

మా అమ్మకేం చేశాడు? షుగర్ వస్తే మందులిప్పించాడు. ఇల్లు మారమంటే మారాడు. ఏం చెపితే అది చేశాడు తప్ప ప్రత్యేకంగా ఏం చేశాడు?

 పోనీ అయనేమన్నా సాధించాడా అంటే  రిటైరయ్యాకా బీ.ఏ చేశాడు అంతే. ఆ తర్వాత బీ.ఎల్ చేశాడు.దాంతర్వాత కోర్టుకెళ్ళాడు, ప్రాక్టీస్ చేశాడు. అంతే!

తర్వాత అందర్లాగే పోయాడు. పోయేటప్పుడు నలుగురు కొడుకుల్లో ఒక్కడు కూడా పక్కన లేడు.. ఎందుకుండాలి? అయ నేం చేశాడు వాళ్ళకి? అందుకే ఎవ్వరు లేరు..ఓ కూతురు..మా అవిడా,అబ్బాయీ ఉన్నారు అంతే. ఎవరైనా ఎందుకుంటారు.. ఏమన్నా చేశాడా వాళ్ళకి.. ఈలాంటి తండ్రులు ఇలానే పోతారు మరి! 

అయన పేరు  “అజీజ్” అని మాత్రం గుర్తుపెట్టుకోక తప్పదు.. ఏం చేస్తాం? అది చెరిపేయలేని విషయం! 

(అయన పోయింది సెప్టెంబర్ 25న … ఆరేళ్ళ క్రితం.. ఏం గొప్ప వాడని అయన పోయిన్రోజు గుర్తెట్టుకోవటానికి?)

 

*సలీం బాష, కర్నులులో ఉంటాడు.ఒకపుడు జర్నలిస్టు, స్పోర్ట్స్ రైటర్, కథలు కాకరకాయలు రాస్తుంటాడు. ఈ మధ్య పర్సనాలిటి డెవెలప్ మెంటు, సోషల్ సైకాలజీ… ఇలా ఏమోమే చెబుతుంటాడు. బక్కపల్చటి మనిషి. నాలుక పదును. కోటి విద్యలు తెలిసినోడు… ముఫై ఎళ్లకిందట ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అదే చాలా మందికి నచ్చదు.