(కోపల్లె ఫణికుమార్*)
తెలుగుదేశంపార్టీలో మేధావులే లేరా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అదే అనుమానం వస్తోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా ఆ అనుమానాలనే బలపరుస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఉండవల్లి అరుణ్ కుమార్ తో చంద్రబాబు భేటీ అయ్యారంటేనే పార్టీలోని డొల్లతనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. టిడిపిలో నిజంగానే మేధావులుంటే చంద్రబాబునాయుడు-ఉండవల్లి అరుణ్ కుమార్ మధ్య భేటీ అవసరమే లేదు. మేధావులు లేని లోపం పార్లమెంటు సమావేశాల్లో టిడిపిలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. చంద్రబాబు రాజకీయాల్లో ఆరితేరిపోయిన వ్యక్తనే విషయం కొత్తగా ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 24 గంటలూ చంద్రబాబు రాజకీయాలే చేస్తుంటారు.
మేధావిగా గుర్తింపున్న ఉండవల్లి
అదే సందర్భంలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మేధావిగా గుర్తింపు పొందిన వ్యక్తి. అవటానికి ఫక్తు రాజకీయ నేతే అయినా అందరు రాజకీయ నేతల్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడేసే వ్యక్తి కాదు. ఉండవల్లి ఏ విషయం మాట్లాడినా లాజికల్ గా ఉంటుందనటంలో సందేహం లేదు. ఏ అంశంపైన మాట్లాడాలన్నా ఉండవల్లి బాగా కసరత్తు చేస్తారనే పేరుంది. అందుకనే వేదిక ఏదైనా ఈ మాజీ ఎంపి సంధించే ప్రశ్నలకు, వినిపించే వాదనలకు ఎదుటి వారి నుండి సమాధానాలు చెప్పటం కష్టం. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా.
ఉండవల్లితో భేటీ చంద్రబాబుకే అవసరం
సరే, ఇక ప్రస్తుత విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నేపధ్యం ఉన్న ఉండవల్లితో చంద్రబాబు భేటీ అవ్వటమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ భేటీలో ఉండవల్లి అవసరంకన్నా చంద్రబాబు అవసరమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎలాగంటే, ఉండవల్లికి చంద్రబాబుకు పెద్దగా పడదన్న విషయం అందరికీ తెలిసిందే. పలు వేదికలపై చంద్రబాబును మాజీ ఎంపి ఉతికి ఆరేసిన సంఘటనలు కోకొల్లలు. అందులో ఏ విషయంలోనూ ఉండవల్లి ప్రశ్నలకు, లాజిక్కులకు చంద్రబాబు నుండి సమాధానాలు లేవు.
పలు సూచనలు చేసిన ఉండవల్లి
అదే సందర్భంలో జగన్ లేదా పవన్ కు మద్దతుగా ఉండవల్లి మాట్లాడుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి జగన్ లేదా పవన్ కు మద్దతుగా మాట్లాడుతున్న ఉండవల్లితో చంద్రబాబు భేటీ అవ్వాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. అమరావతి వర్గాల సమాచారం ప్రకారం ప్రత్యేకహోదా పై లోక్ సభలో అనుసరించాల్సిన విధానంపై చంద్రబాబు ఉండవల్లిని సలహాలు అడిగారట. న్యాయవాది కూడా అయిన ఈ మాజీ ఎంపి మూడు పాయింట్లను చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం.
అవిశ్వాసం వల్ల ఉపయోగం లేదన్నారా ?
ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఇరుకునపెట్టాలంటే మూడు సందర్భాల్లో రాష్ట్ర విభజన, యూపిఏ ఇచ్చిన హామీలు, ప్రత్యేకహోదా అంశాలను లోక్ సభలో ఏ విధంగా లేవనెత్తాలి అనే వివరాలను క్షుణ్ణంగా వివరించినట్లు సమాచారం. ఇంతకీ ఆ సందర్భాలేమిటంటే మొదటిది జీరో అవర్. రెండో సందర్భం పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఇక మూడోది షార్ట్ డిస్కషన్. పై మూడు రూపాల్లో గనుక టిడిపి ఎంపిలు రాష్ట్ర విభజన, ప్రత్యకహోదా తదితర అంశాలను లేవనెత్తగలిగితే కేంద్రాన్ని ఇరుకునపెట్టవచ్చని ఉండవల్లి సూచించారట. అవిశ్వాస తీర్మానం వల్ల ఉపయోగం కూడా ఏమీ ఉండదని స్పష్టంగా చెప్పారట.
మేధావులు లేని లోటు కనిపిస్తోందా ?
ఉండవల్లి సూచనలతో చంద్రబాబు కూడా పూర్తిగా ఏకీభవించినట్లు సమాచారం. కాకపోతే ఆచరణలోకి తేవటమే కష్టమని చంద్రబాబు అనుకున్నారట. ఎందుకంటే, ప్రస్తుతం టిడిపి తరపున లోక్ సభ, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపిల్లో అత్యధికులు వ్యాపారవేత్తలే. వారెవరికీ విషయం పరిజ్ఞానం దాదాపు లేదనే చెప్పవచ్చు. ఏదో మీడియా ముందు నోటికొచ్చింది మాట్లాడగిలిన వారే ఉభయ సభల్లో మాట్లాడాలంటే విషయం ఉండాలి. గడచిన నాలుగేళ్ళల్లో ఎంపిల్లో అత్యధికులు ఉభయ సభల్లో ఏ సమస్యపైన కూడా అనర్ఘళంగా మాట్లాడిన దాఖలాల్లేవు. ఏదో ఉత్సవ విగ్రహాల్లాగ పార్లమెంటుకు వెళ్ళి వస్తున్నారే తప్ప సమస్యలపై స్పందించింది లేదు కేంద్రాన్ని నిలదీసిందీ లేదు. అందుకనే ఉండవల్లి చేసిన సూచనలపై ఎంపిలకు ఆదేశాలివ్వటంలో చంద్రబాబు తెల్లమొహం వేశారట. అందుకనే ఉండవల్లి చెప్పినట్లు కాకుండా ముందుగా తాను అనుకున్నట్లే ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయింకున్నారట.
(*కోపల్లె ఫణికుమార్ , సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)