మార్గదర్శి కేసు: రామోజీరావుకి సుప్రీం నోటీసులు.! ఉండవల్లి ఫుల్ ఖుషీ.!

Ramoji Rao

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే, రామోజీరావుపై గత కొంతకాలంగా ఆరోపణలు గుప్పిస్తోన్న ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీపి కబురు అందింది మరి. ఇది చాలా ఏళ్ళ క్రితం నాటి రాజకీయ వైరం.!

రాజమండ్రి ఎంపీగా గతంలో ఉండవల్లి గెలిచినప్పుడు, ఆయన్ని ఎలాగైనా ఓడించాలని అప్పట్లో రామోజీరావు కంకణం కట్టుకున్నారట. అలాగని ఉండవల్లి పలు సందర్భాల్లో ఆరోపించారు. అందుకే, రామోజీరావుని ఇరకాటంలో పెట్టేందుకు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను ఎంచుకున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి సంస్థ డిపాజిట్లను సేకరిస్తోందని ఉండవల్లి గుర్తించారు. ఈ క్రమంలో న్యాయపోరాటానికి దిగారు.

అయితే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక చాలామంది ఈ కేసు గురించి మర్చిపోయారు. రాజకీయాల్లో ఉండవల్లి యాక్టివ్‌గా లేకపోవడమూ ఇందుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు, ఇన్నేళ్ళకు ఈ కేసులో మళ్ళీ కొత్త కదలిక మొదలైంది. గతంలో హైకోర్టులో రామోజీరావుకి ఈ కేసు నుంచి వెసులుబాటు దొరకగా, దాన్ని ఉండవల్లి సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ ఈ విషయమై ఉండవల్లి వాదనను సమర్థించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈపాటికే రంగంలోకి దిగాల్సి వుంది.

అన్ని వైపుల నుంచీ పక్కాగా బలాన్ని పుంజుకున్నాక ఉండవల్లి, తనదైన రీతిలో చక్రం తిప్పారు. ఫలితంగా సుప్రీంకోర్టు, రామోజీరావుకి నోటీసులు పంపిందనే ప్రచారమైతే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ‘అబ్బే, ఇందులో నా అత్యుత్సాహమేమీ లేదు.. ప్రజలకు నిజాలు తెలియాలి..’ అని మాత్రమే ఉండవల్లి చెబుతున్నారిప్పుడు.

కాగా, ఈ కేసుకి సంబంధించి రామోజీరావు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారట. ఆ విషయాన్ని ఉండవల్లి ప్రకటించడం గమనార్హం. తన రాజకీయ జీవితంలో ఇలాంటి వింత ఎప్పుడూ చూడలేదన్నది ఉండవల్లి ఉవాచ.