కొన్ని లక్షల మంది సాయుధ సిబ్బందికి అధిపతిగా ఉన్న అధికారికి సైతం అవమానాలు తప్పట్లేదు .“చేత కాకపోతే దిగిపోండి….డిజిపి అసమర్ధుడు…” ఈ తరహా వ్యాఖ‌్యలు సహజంగా ఎవరినైనా కుంగదీస్తాయి. నిజానికి డిజిపి నియామకాలు సైతం రాజకీయ నియామకాలే. తమకు అనుకూలంగా ఉండే వారిని పదవిలో కూర్చోబెట్టడానికి పాలక పక్షాలు ప్రయత్నిస్తుంటాయి. ఈ ధోరణికి యూపీఎస్సీ నిబంధనలు కొంత వరకు అడ్డుకట్ట వేసినా, ప్రాధాన్యత దక్కడం, దక్కకపోవడం అనేది కులం మీదే ఆధారపడి ఉంటుంది. అప్పట్లో ఇంకెవర్నో డిజిపి చేయాలనుకుని చివరి నిమిషంలో బలమైన ఒత్తిళ్లతో వేరే వారికి ఆ పదవి కట్టబెట్టాల్సి వచ్చిందో మరి , ఇప్పుడు మరి వారి అసమర్ధత తెలిసి వచ్చిందో లేక ఇంకేమన్నా ఉందో అంతుచిక్కట్లేదు . కొన్నేళ్ల క్రితం ఓ అధికారిని డిజిపి హోదాలో చాలాకాలం పనిచేయించినా చివరి వరకు ఇన్‌ఛార్జి స్థానంలోనే ఉంచి పదవీ విరమణకు ముందు పొడిగింపు కోసం ప్రయత్నించినా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోనే కాదనిపించి సాగనంపేయడం కూడా ఇలాంటి రాజకీయంలో ఓక భాగమే.
అధికారంలో ఉన్నపుడు కనిపించిన సమర్ధత, ప్రతిపక్షంలోకి రాగానే మాయమైపోవడానికి పెద్దగా లాజిక్కులు అవసరం లేదు. ఎవరి ప్రయోజనం వారిది. అదే సమయంలో వారిని కించపరచడానికి., పత్రికల్లో పతాక శీర్షికల్లో వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యాఖ్యలు చేయడానికి మాత్రం కులమే ప్రధాన కారణం. డిజిపి దామోదర్ గౌతమ్ సవాంగ్ మీద కొద్ది నెలలుగా అదృశ్య దాడి జరుగుతోంది. రాజకీయ విమర్శలకు టార్గెట్ అయ్యారు. ప్రతిపక్షాల విమర్శలతో పాటు సొంత పక్షం నుంచి ఆయనకు మద్దతు కొరవడినట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఐపీఎస్ అధికారుల సంఘాలు గతంలో ఇలాంటి సందర్భాలలో క్రియాశీలకంగా ఉండేవి. డిజిపి ఈ విషయంలో ఒంటరైపోయినట్లు కనిపిస్తుంది. పదేపదే ఆయన మీద విమర్శలు., వ్యక్తిగత దాడి జరుగుతున్నా సహచరుల నుంచి మద్దతు మాత్రం కనిపించడం లేదు. నిజానికి డిజిపి పదవిలో మరొకరు ఎవరున్నా దానిపై పెద్ద ఎత్తున ఖండనలు వచ్చేవి. పాలక కులాలకు సంబంధించిన వారికి గతంలో ఈ తరహా అవమానాలు,ఇన్నిసార్లు ఎదురైన దాఖలాలు కూడా లేవు.
డిజిపిని పదేపదే టార్గెట్ చేయడం ద్వారా ఆశించిన ప్రయోజనాన్ని నెరవేర్చుకునే లక్ష్యంలో అన్ని పక్షాలు ఉండొచ్చు. గౌతమ్ సవాంగ్ వివాదాలకు దూరంగా ఉండే రకం. మీడియా ప్రచారాలు కూడా పెద్దగా పట్టవు. అదే సమయంలో సహచరుల నుంచి ఆశించిన మద్దతు కూడా ఆయనకు దక్కడం లేదనేది బహిరంగ రహస్యం. అందుకే డిజిపి సాఫ్ట్ టార్గెట్‌గా మారి అందరికి అసమర్ధుడిగా ముద్ర వేయడం మొదలైంది. అదే ఆయన ఏ అగ్రకులానికి చెందిన వ్యక్తి అయ్యుంటే ఈ పాటికి ఆయన సమర్ధత మీద పుంఖానుపుంకాలుగా పతాక శీర్షికల్లో కథనాలు వెల్లువెత్తేవి. కులమే సమర్ధతకు గీటురాయిగా భావించే వ్యవస్థను చూసి జాలిపడటం తప్ప ఏమి చేయలేం.