తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మధ్య ‘అవగాహన’ కొంత గందరగోళంగానే కుదిరిందన్నది ఓపెన్ సీక్రెట్. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడంతోపాటు, అత్యంత వ్యూహాత్మకంగా ప్రచారం చేయాల్సి వుంటుందన్నది జనసేన అధినేత ఆలోచన. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో జనసేన అధినేత బయటపెట్టారు, బీజేపీ అధిష్టానానికీ సూచించారు. ‘జనసేన పోటీ చేస్తే, తిరుపతి లోక్‌సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తాను..’ అని చెప్పిన జనసేనాని, జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే, బీజేపీ అధినాయకత్వం కూడా అంతే పట్టుదలతో ప్రచారం చేయాలని కోరారు. నిజానికి బీజేపీతో పోల్చితే తిరుపతిలో జనసేనకే బలం ఎక్కువ. కానీ, బీజేపీ.. అత్యంత వ్యూహాత్మకంగా మిత్రపక్షం జనసేనను ఒప్పించింది.. తామే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది.
దాంతో, జనసేనానికి వేరే దారి లేక, బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. అయితే, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు ఇంకా గందరగోళంగానే వున్నాయి బీజేపీ – జనసేన కూటమికి. ‘జనసేన అభ్యర్థి పోటీ చేస్తే సరే సరి. లేదంటే, నోటాకి ఓట్లేస్తాం..’ అని జనసేన మద్దతుదారులు చెబుతుండడం బీజేపీని సంకటంలో పడేస్తోంది. కొన్ని సామాజిక వర్గాలు ఈ విషయమై తీర్మానాలు కూడా చేసేస్తుండడంతో బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి, జనసేనానితో చర్చలకు సమాయత్తమవుతున్నారు. దాంతో, త్వరలో జనసేన అధినేత తిరుపతిలో జనసేన శ్రేణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది.
జనసేనాని తిరుపతి పర్యటన తర్వాత, స్థానికంగా పరిస్థితుల్ని అంచనా వేసి, అవసరమైతే అభ్యర్థి విషయమై పునరాలోచన కూడా చేయాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. కాగా, జనసేన నేతలు మాత్రం, తిరుపతిలో బీజేపీకి సంపూర్ణ మద్దతు వుంటుందని చెబుతున్నారు. అసలు జనసేన అవసరమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న బీజేపీ, పరిస్థితులు తల్లకిందులవడంతో మిత్రపక్షం పట్ల ప్రత్యేక బాధ్యత ప్రదర్శిస్తుండడం ఆసక్తికరమే.