ఇంటికో వెయ్యితో ఈ దొరల గడీ కొన్నరు : జగిత్యాల స్టోరీ

తెలంగాణ పల్లెల్లో చాలా గ్రామాల్లో ఇంకా దొరల గడీలు సజీవంగానే ఉన్నాయి. కొన్ని కూలిపోయి నేలమట్టమయ్యాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మూటపల్లి అనే గ్రామంలో దొరల గడీ ఇంకా సజీవంగా ఉంది. ఊరు ఊరంతా ఏకమై ఆ గడీని ఇంటికో వెయ్యి రూపాయలు జమ చేసి కొనుక్కున్నారు గ్రామస్తులు. నాటి దొరల గడి ఇప్పుడెట్లా ఉంది? అసలు ఆ గడీ ముచ్చట్లేందో చదవండి.

ఏనుగు పురుషోత్తమరావు అనే దొర 1953లో ఈ ఫొటోలో కనిపిస్తున్న గడీని నిర్మించారు. మూటపల్లి అనే గ్రామంలో ఈ గడీ 65 ఏళ్లుగా అలాగే ఉంది. అయితే కాల క్రమంలో ఆ గ్రామం నుంచి పురుషోత్తమరావు హైదరాబాద్ కు వలస వచ్చారు. ఆయన కొద్ది రోజుల క్రితం మరణించారు. అయితే పురుషోత్తమరావు కొడుకు దయానందరావు కుటుంబమంతా హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. జిగిత్యాల జిల్లోలని ఆ గ్రామంలో గడీ ఉన్నా అక్కడికి వెళ్లేవారు లేకపోవడంతో ఆ గడీ పాతబడ్డది. దీంతో అక్కడికి పోవడం కుదరడంలేదు కాబట్టి ఉన్న గడీని కూడా అమ్ముకుందామని నాలుగేళ్ల కిందట దయానందరావు అమ్మకానికి పెట్టారు. ఆ గడీ గ్రామ నడిబొడ్డున ఉంది. దీంతో దాన్ని కొనుగోలు చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఎగబడ్డారు. 30 లక్షలకు బేరం కూడా చేసుకున్నారు.

అయితే ఆ గ్రామ పెద్దలకు ఒక ఆలోచన వచ్చింది. ఇంతకాలం ఈ గడీ మనకు అన్ని విధాలుగా ఉపయోగించుకున్నాం కాబట్టి దాన్ని మనమే కొనుగోలు చేస్తే ఎలా ఉంటదని అనుకున్నారు. వెంటనే రంగంలోకి దిగారు. గ్రామంలో 14 కుల ఉన్న కుల సంఘాల నుంచి కులానికి ఇద్దరు చొప్పున 30 మంది గ్రామ పెద్దలు సర్పంచ్ జల రమేష్ నాయకత్వంలో హైదరాబాద్ తరలివచ్చారు. దయానందరావుతో మాట్లాడి ఆ గడీ తమకే ఇవ్వాలని కోరారు. అయితే ఆయన దాన్ని మీకిచ్చినా ఉపయోగపెట్టలేరు కదా ఇంకా ఖరాబై పోతది అని మాట్లాడారు. అయితే గ్రామ పెద్దలంతా దాన్ని బాగుచేసి కమ్యూనిటీహాల్ కోసం వినియోగిస్తాము. దాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు. అప్పటికే 30 లక్షలకు పక్క గ్రామాల వారు వచ్చి బేరం కుదుర్చుకున్నప్పటికీ వారిని పక్కనపెట్టి దయానందరావు మాత్రం సొంత గ్రామస్తులకే దాన్ని ఇచ్చేశారు. 30లక్షల విలువ చేసేది అయినప్పటికీ ముందుగా ఉచితంగానే ఇద్దామనకున్నాడు. కానీ ఉత్తగా ఇస్తే దాన్ని పట్టించుకోరని గ్రామస్థులు ఆయనకు వివరించారు. దీంతో నాలుగున్నర లక్షల రూపాయలు గుడ్ విల్ కింద తీసుకుని దాన్ని గ్రామపంచాయతీకి రాసిచ్చేశారు. దాన్ని కొనుగోలు చేయడం కోసం ఇంటికి వెయ్యి చొప్పున కలెక్ట్ చేసి దయానందరావుకు ఆ సొమ్మును అప్పగించారు గ్రామ పెద్దలు. తర్వాత ఆ గడీకి రిపేర్లు చేసి కొత్తగా మార్చేశారు.

ఇక 65 ఏండ్లుగా గ్రామ చిరునామాగా నిలిచిన ఆ గడీని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో  రిపేర్లు చేయించి కొత్త బిల్డింగ్ మాదిరిగా తీర్చి దిద్దారు. మంగళవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆ గ్రామానికి వచ్చి ఆ భవనాన్ని రీ ఓపెన్ చేశారు. ఊరు ఊరంతా కదిలి వచ్చి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తమ సొమ్ముతో పాత గడీని తిరిగి బాగు చేసుకున్నందున గ్రామస్థులందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.  ఈ గడీని కమ్యూనిటీ సెంటర్ గా వాడుకుంటున్నట్లు గ్రామ సర్పంచ్ మండ జల రమేష్ తెలుగురాజ్యం కు చెప్పారు. కమ్యూనిటీ భవనంలో ఇకనుంచి విఆర్ఓ కు ఒక గదిని, సాక్షర భారత్ వర్కర్స్ కోసం ఇంకో గదిని, మహిళా సమాఖ్య వాళ్ల కోసం ఇంకో గదిని కేటాయించినట్లు కేటాయించినట్లు సర్పంచ్ తెలిపారు. ప్రారంభోత్సవం పండుగ  వాతావరణంలో సాగిందని చెప్పారు గ్రామానికి చెందిన ఏలేటి రాజేందర్ రెడ్డి.

తెలంగాణలో దొరల గడీలు అంటే తెలుసా ?
తెలంగాణలో భూస్వాములను దొరలు అని పిలిచే వాళ్లు. దొరలుండే చోట దొరయే ప్రభుత్వం, దొర ఏది చెబితే అదే చట్టం. దొరమాటే వేదం, దొర ఆటే ఆట. దొరను కాదని బతకడం కష్టం. దొర ఏమి చేసినా చెల్లుబాటవుతుంది. దొరకు ఎదురుండదు. ఇలాంటి దొరలుండేఇల్లే గడి. గడి ఒక కోటలాగే సామాన్యులకు దుర్బేద్యమయింది. అయితే, దొరతనం మారువేషం వేసుకుని సర్వత్రా కనిపించినా, గడిలు మాత్రమే పోయాయి. కొన్ని కూలిపోయాయి. కొన్ని పాడపడ్డాయి. ఎక్కడైనా ఒకటి అరా మిగిలిఉంటే అలాంటి వాటిలో ఇదొకటి. దీన్ని గ్రామస్థులంతా ఏకమై కొనుగోలు చేసి కొత్త సేవల కోసం వినియోగంలోకి తీసుకొచ్చారు.

 

పురుషోత్తమరావు మంచి దొరే : సర్పంచ్ జల రమేష్

దొరల గడీ కొనుగోలు విషయమై గ్రామ సర్పంచ్ మండ జల రమేష్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పురుషోత్తమరావు కానీ, ఆయన కుమారుడు దయానందరావు కానీ చాలా మంచివాళ్లే అని తెలిపారు. వారు గ్రామంలో ఉన్నంతకాలం ఊరి మంచి చెడులు పట్టించుకునేవారని అన్నారు. గత కొంతకాలంగా ఆ గడీ వాడుకలో లేకపోయినా గ్రామంలో పెళ్ళిళ్లు, ఫంక్షన్లు ఈ గడీ లోనే జరిగేవని చెప్పారు. గ్రామంలో ఈ గడీ అందరికీ రచ్చబండ లాంటి అడ్డా అని వివరించారు. పురుషోత్తమరావు ఫ్యామిలీ హైదరాబాద్ షిప్ట్ అయిన తర్వాత కూడా చాలాకాలం పాటు వచ్చేవారని, ఇప్పుడు ఆయన మరణానంతరం ఆయన కుటుంబీకులు ఎవరూ ఇక్కడికి రావడంలేదన్నారు. ప్రస్తుతం దయానందరావు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. కమ్యూనిటీ భవన్ ప్రారంభోత్సవంలో చాలామంది వక్తలు పురుషోత్తమరావు, దయానందరావు లు చేసిన మంచి పనుల గురించి గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. గడీని కమ్యూనిటీ భవన్ గా మార్చిన నేపథ్యంలో ప్రారంభోత్సవానికి దయానందరావు కుటుంబసభ్యులకు ఆహ్వానం పంపినా ఎవరూ రాలేకపోయారన్నారు.

గ్రామంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరుపుకునేందుకు తమకు ఎలాంటి ఫంక్షన్ హాల్ లేదని చెప్పారు. ఈ గడీనే ఫంక్షన్ హాల్ గా వాడుకున్నామని తెలిపారు. దీన్ని అమ్మకానికి పెట్టారని తెలిసి మనమే కొందామని హైదరాబాద్ వెళ్లి అడగగానే ఇచ్చారని వివరించారు. గ్రామంలో 405 ఇండ్లు ఉంటే అందరినీ వెయ్యి చొప్పున వసూలు చేసి దాన్ని కొన్నట్లు చెప్పారు. గ్రామ జనాభా 1900 కాగా ఓటర్లు 1300 వరకు ఉన్నట్లు సర్పంచ్ చెప్పారు.

మూటపల్లి గడీ పాత, కొత్త ఫొటోలు, ప్రారంభోత్సవ ఫొటోల గ్యాలరీ కింద ఉంది చూడండి.