జగిత్యాల డిపో మేనేజర్ సాంబశివరావు సస్పెన్షన్

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 51 మంది చనిపోయారు. ఈ ప్రమాదం దేశ ఆర్టీసి చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదంగా అధికారులు తెలిపారు. జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 80 మంది ప్రయాణికులతో కొండగట్టు నుంచి ఘాట్ రోడ్డులో కిందికి బయల్దేరింది. బస్సు ప్రమాదంపై భిన్న రకాల కారణాలు వినిపిస్తున్నాయి.

జగిత్యాల డిపో మేనేజర్ ఈ రూట్ లో బస్సులు నడిపేందుకు అనుమతివ్వడంతో గత కొద్ది రోజులుగా ఇటు వైపు బస్సులు నడుస్తున్నాయని, ఆర్టీసీ కాసుల కక్కుర్తికి 51 మంది ప్రాణాలు బలయ్యాయని పలువురు వాపోయారు.

ఈ నేపథ్యంలో జగిత్యాల డిపో మేనేజర్ పై సస్పెన్షన్ వేటు పడింది. డిపో మేనేజర్ సాంబశివరావుని విధుల నుండి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 3 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.