అమెరికాలో కలవనున్న బిజెపి, టిడిపి నేతలు..ప్యాకేజీ చర్చలకేనా ?

ఆంధ్రప్రదేశ్ కు చెందిన టిడిపి, బిజెపి నేతలు అమెరికాలో కలవనున్నట్లు సమాచారం. అమెరికాలో ప్రతీ ఏడాది తానా సభలు జరుగుతాయన్న విషయం అందిరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఈసారి కూడా వాషింగ్టన్ లో మూడు రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. ఆ సమావేశాల్లో పాల్గొనేందుకు టిడిపి, బిజెపి నేతలు వెళుతున్నారట.

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అప్పటి నుండి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయేందుకు  నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే వలసలకు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు. అదే సమయంలో బిజెపియేమో తలుపులు బార్లా తెరిచేసింది.

ఇప్పటికే ధర్మవరం మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి బిజెపిలో చేరారు. అదే దారిలో చాలామంది మాజీ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు  ఉన్నట్లు సమాచారం. తమలో చాలామందితో బిజెపి టచ్ లో ఉందని మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి బాహటంగా చెప్పినప్పటి నుండి చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.

అదే సమయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొందరు ఎంఎల్ఏలు బిజెపిలోకి జంప్ చేయటం ఖాయమంటూ ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే బిజెపి తరపున రామ్ మాధవ్, ఈమధ్యనే బిజెపిలోకి ఫిరాయించిన టిడిపి రాజ్యసభ ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ కూడా హాజరవుతున్నారు.

టిడిపి నుండి గంటా శ్రీనివాస్ అండ్ కో కూడా వెళుతున్నారు. దాంతో అమెరికాలోనే ప్యాకేజీ చర్చలు జరుగుతాయనే ప్రచారం గుప్పుమంటోది. మరి చూడాలి ఏం జరుగుతుందో.