Murders in America: అమెరికాలో వరుస హత్యలు.. భారతీయులకు సురక్షితమేనా..?

Murders in America

అమెరికా ప్రపంచంలోనే అగ్రరాజ్యం. ప్రపంచవ్యాప్తంగా ఆ దేశపు కరెన్సీ డాలర్‌కు ఉన్న విలువ అంత ఇంత కాదు. సురక్షితమైన, అద్భుతమై ప్రాంతంగా కూడా భావిస్తారు. అందుకే అమెరికాలో చదువుకోవాలని..అక్కడ స్థిరపడాలని సగటు భారతీయుడు కలలు కంటూ ఉంటారు. ఒకప్పుడు ఊరికి ఒకరో ఇద్దరో అమెరికా వెళ్లేవారు. కానీ ప్రస్తుతం ప్రతి వీధిలో ఒకరు అమెరికా వెళ్లడం కామన్ అయిపోయింది. అంతలా మన భారతీయులకు అమెరికా పిచ్చి పట్టుకుంది. అక్కడి డాలర్ మన కరెన్సీ విలువ కంటే ఎక్కువ కావడంతో ఆస్తులు సంపాదించుకోవాలనే ఆశతో పుట్టిన దేశం వదిలివెళ్లి అగ్రరాజ్యంలో తిష్టవేస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా అమెరికాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమెరికా సురక్షితమైన ప్రాంతమేనా అన్న అనుమనాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గన్ కల్చర్ ఎక్కువ కావడంతో వరుస కాల్పులకు కారణమవుతోంది. అంతేకాకుండా ఇటీవలి కాలంలో భారత సంతతి వ్యక్తులపై దాడులు పెరుగుతున్నాయనే ఆందోళన నెలకొంది. జాతి, వర్ణ వివక్ష, నిరుద్యోగం, మానసిక అస్థిరతలు వంటి పలు కారణాల వల్ల అమెరికన్లు ఇతర దేశస్థులపై ముఖ్యంగా భారతీయులపై దాడులు చేస్తున్నారు. ఏకంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. చిన్న చిన్న గొడవలు కూడా కిరాకతంగా హత్యలు చేసేస్తున్నారు.

ఇటీవల అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ దేశం సురక్షితమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకోవం, భారత్‌పై సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా భారతీయులు ఇప్పటికే అమెరికాలో అనేకమంది ఉన్నారని వీరి వల్ల అమెరికన్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం లేదనే వాదనలు ఊపందుకున్నాయి. దీంతో భారతీయులపై కొంతమంది అమెరికన్లు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తమ దేశం వదిలివెళ్లిపోవాలంటూ నిరసనలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా చేస్తున్నారు.

తాజాగా డల్లాస్‌లో నాగమల్లయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. చిన్న గొడవ కారణంగా దుండగుడు ఏకంగా మల్లయ్య తల నరికి కిరాతకంగా ప్రవర్తించారు. డల్లాస్ డౌన్‌టౌన్‌లోని ఓ లాడ్జ్‌లో నాగమల్లయ్య పనిచేస్తున్నారు. మార్టినెజ్ అనే వ్యక్తి అక్కడే పనిచేస్తున్నాడు. అయితే వాషింగ్ మెషీన్ వినియోగం విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. అయితే నిగ్రహం కోల్పోయిన మార్టినెజ్ పదునైన ఆయుధంతో దాడి చేశాడు. భార్య, కుమారుడు వేడుకున్నా కరుణించలేదు. కత్తితో ఆయన తలను వేరు చేసి కాలుతో ఫుట్ బాల్ తన్నినట్లు సైకో లాగా ప్రవర్తించాడు.

అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికాకు శరణార్థిగా వచ్చిన ఉక్రెయిన మహిళ దారుణ హత్యకు గురైంది. ఉక్రెయిన్‌కు చెందిన ఇరినా అనే యువతి రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో వెనక సీటులో కూర్చున్న ఓ నల్లజాతీయుడు ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి అక్కడిక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు ఏం తెలియనట్లు వెళ్లిపోయాడు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఇక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కర్క్ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో మాస్ షూటింగ్స్‌పై చర్చా కార్యక్రమంలో ప్రసంగిస్తున్నప్పుడు ఓ దుండగుడు చార్లీపై తుపాకీతో కాల్పులు జరిపాడు. భారీ శబ్దంతో ఓ బుల్లెట్ చార్లీ మెడకు తగిలింది. అంతే అతడు కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్న వారందరూ భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

మరోవైపు ఆ దేశంలో తుపాకీ సంస్కృతి మరింత ఆందోళనకు గురిచేస్తోంది. లైసెన్స్ తుపాకులు ఉండటంతో ఎవరు ఎప్పుడు ఎక్కడ తుపాకీతో దాడి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పబ్బులు, రెస్టారెంట్లు, పబ్లిక్, ప్రైవేట్ ప్రాంతాల్లో కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో జనాలు మరణించారు. వరుస ఘటనలతో భారతీయులు భయంతో వణికిపోతున్నారు. దీంతో భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు అమెరికాకు అంటే ఎగేసుకుని వెళ్లే భారతీయులు.. ఇప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఘటనలు జరగకుండా అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.