పొద్దుపొద్దున లేవగానే కడుపులో టిఫిన్ పడితేనే రోజు మొదలైనట్టు చాలామందికి అనిపిస్తుంది. రుచిగా ఉంటే చాలు.. ఆరోగ్యంపై అంతగా ఆలోచించకుండా అదే టిఫిన్‌ను రోజూ తింటుంటారు. కానీ నోటికి బాగానే అనిపించే కొన్ని బ్రేక్‌ఫాస్ట్‌లు అసలు మీ శరీరానికి ఏమాత్రం మేలు చేయవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పుడప్పుడూ తినడం వేరు.. అదే డెయిలీ రొటీన్‌గా మారితే మాత్రం ఆరోగ్యానికి పెద్ద ముప్పేనని చెబుతున్నారు.
ముఖ్యంగా మైదాతో తయారయ్యే టిఫిన్స్‌లో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్లు దాదాపుగా లేవు… కానీ కార్బోహైడ్రేట్స్ మాత్రం విపరీతంగా ఉంటాయి. దీంతో షుగర్ లెవెల్స్ వేగంగా పెరగడం, బరువు ఎక్కువ కావడం వంటి సమస్యలు మొదలవుతాయి. మైదా సేమియా, సెట్ దోసె లాంటి టిఫిన్స్‌ను రోజూ తినడం డయాబెటిక్ రోగులకు మాత్రమే కాదు… ఆరోగ్యంగా ఉన్నవారికీ ప్రమాదకరమే.
స్వీట్ పొంగలి కూడా చాలామంది ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్. కానీ ఇందులో వేయించే నెయ్యి, చక్కెర లేదా బెల్లం మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునేవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు అయితే స్వీట్ పొంగలికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక త్వరగా తయారవుతుందన్న కారణంతో తెల్ల రవ్వ ఉప్మా చాలామంది ఇళ్లలో రెగ్యులర్‌గా చేస్తుంటారు. అయితే ఇందులో ఫైబర్, ప్రోటీన్ లాంటివి చాలా తక్కువగా ఉండటంతో ఇది కడుపు నింపే ఆహారం తప్ప ఆరోగ్యాన్ని పెంచే టిఫిన్ కాదని చెబుతున్నారు. అదే గోధుమ రవ్వ, జొన్న, రాగి వంటి మిల్లెట్స్‌తో చేసిన ఉప్మా అయితే శరీరానికి మేలు చేస్తుంది.
నూనెలో పూర్తిగా వేయించిన పూరీలు ఇంకో పెద్ద సమస్య. అధిక కేలరీలు, కొవ్వు ఉండటంతో ఇవి బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. ఆలూ కర్రీతో పూరీ కాంబినేషన్ రుచిగా ఉన్నా… ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పూరీ తినాలనిపిస్తే గోధుమపిండితో చేసి, తక్కువ నూనె వాడి, ఎక్కువ కూరగాయలు లేదా సలాడ్స్‌తో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మొత్తానికి పొద్దుపొద్దునే ఆరోగ్యాన్ని పాడుచేసుకునేలా టిఫిన్ ప్లేట్ ఉండకూడదు. చిన్న మార్పులు చేస్తేనే బ్రేక్‌ఫాస్ట్‌ను ఆరోగ్యంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
