సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై రూపొందిన లేటెస్ట్ సినిమా దేవగుడి. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ దేవగుడి మూవీ తాజాగా జనవరి 30న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే మరి తాజాగా విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏమిటి? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది అన్న వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కథ:
దేవగుడికి చెందిన దేవగుడి వీరారెడ్డి (రఘు కుంచె) ఒక ఫ్యాక్షన్ లీడర్. అయితే ప్రజలందరినీ బాగా చూసుకునే వీరా రెడ్డి తన అనుచరులలో ఒకరి కొడుకు అయిన ధర్మ (అభినవ్ శౌర్య),తన కుమారుడితో (నరసింహ) సమానంగా ఉండడాన్ని సహించే వాడు కాదు. అయితే కుమార్తె శ్వేత (అనుశ్రీ) ధర్మతో ప్రేమలో ఉందనే విషయం తెలిసి ధర్మను ఊరు నుంచి గెంటిస్తాడు. అయితే వీరారెడ్డి అనారోగ్యం పాలవ్వగా ఇద్దరు అనుచరులు హత్యకు గురవుతారు. మరోపక్క శ్వేత మిస్ అవుతుంది. మిస్సయిన శ్వేత ఏమైంది? ధర్మ తన స్నేహితుడి చెల్లెలితో నిజంగానే ప్రేమలో పడ్డాడా? అసలు వీరిద్దరి ప్రేమ ఎక్కడ మొదలైంది? వీరిద్దరూ ఒకటయ్యారా లేదా? ఇద్దరు అనుచరులను చంపింది ఎవరు? వీరారెడ్డి చివరికి ఏం చేశాడు? చివరికి ఏమయింది అన్న విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ ఈ సినిమా కథ మొదలవుతుంది. తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించడం నచ్చని హీరోయిన్ తండ్రి, అతన్ని బయటకు గెంటిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం మీద సినిమా రాసుకున్నారు. అయితే
ఈ సినిమా చూస్తున్నంత సేపు మీకు కచ్చితంగా కొన్ని పాత సినిమాల కథలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి కథలు ఉన్న సినిమాలు గతంలో చూసాము అన్న బావన కలుగుతుంది. కానీ ఇందులో రాయలసీమలోని దేవగుడి అనే ఒక గ్రామం నేపథ్యంలో కథ అంతా సాగుతుంది. రాయలసీమ టచ్‌తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలానే సాగుతుంది.
నటీనటుల పనితీరు:
ఇకపోతే నటీనటుల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరోగా నటించిన అభినవ్ శౌర్యతో పాటు హీరోయిన్ గా నటించిన అనుశ్రీ, అలాగే ఆమె సోదరుడి పాత్రలో నటించిన నరసింహ ముగ్గురు బాగానే ఆకట్టుకున్నారు. వీరందరూ కొత్త వారు అయినా కూడా బాగా నటించారు. ఇక రఘు కుంచె దేవగుడి వీరారెడ్డి అనే పాత్రలో జీవించారు. మిగిలిన నటినటులు ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
సాంకేతికత:
మదిన్ అందించిన సంగీతం బాగుంది. మూవీలో కొన్ని పాటలు కూడా వినడానికి బాగానే ఉన్నాయి. అలాగే నేపథ్య సంగీతం సినిమాకి తగ్గట్టుగానే ఉంది. నిర్మాణ విలువలు అయితే అత్యద్భుతంగా ఉన్నాయి. అయితే కథ ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉన్నా క్లైమాక్స్ మాత్రం షాకింగ్ గా అనిపిస్తుంది.
రేటింగ్: 3/5
