T20 World Cup 2026: ఫిబ్రవరి 7న క్రికెట్ పండుగ.. భారత్–శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్‌కప్..!

ఫిబ్రవరి 7 ఉదయం నుంచే క్రికెట్ అభిమానులు పండగ చేసుకునే రోజులు మొదలవనున్నాయి. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 పూర్తి షెడ్యూల్ వెలుగులోకి రావడంతో అభిమానుల్లో ఉత్సాహం పీక్‌కు చేరింది. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు సాగనుంది. ఈ మెగా టోర్నీ మొత్తం 54 మ్యాచ్‌లతో నెలరోజుల పాటు క్రికెట్ మజాను అందించనుంది. 20 జట్లు, హై హిట్టింగ్, హై వోల్టేజ్ పోరులు.. అన్ని కలిపి ఇది కేవలం టోర్నీ కాదు, ఒక పండుగ.

ఈసారి వరల్డ్‌కప్‌లో అనూహ్యమైన ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. భద్రతా కారణాల రీత్యా బంగ్లాదేశ్ టోర్నీకి దూరమవ్వగా, వారి స్థానాన్ని స్కాట్లాండ్ దక్కించుకుంది. దీంతో టోర్నీకి కొత్త రంగు అద్దినట్లైంది. ఇటలీ వంటి కొత్త జట్లు కూడా బరిలోకి దిగడంతో గ్రూప్ దశ నుంచే ఫలితాలు ఊహించలేని స్థాయిలో పోటీ ఉండనుంది.

గ్రూప్ దశలో 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్ ఉన్న గ్రూప్‌లోనే పాకిస్థాన్ ఉండటంతో తొలి దశ నుంచే ఉత్కంఠ మామూలుగా ఉండదు. ఫిబ్రవరి 7 నుంచి 20 వరకు జరిగే గ్రూప్ దశలో ప్రతి గ్రూప్ నుంచి టాప్–2 జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. అక్కడి నుంచి సెమీఫైనల్స్‌కు దారి తీసే పోరాటం మరింత ఉత్కంఠను పెంచనుంది. మార్చి 4, 5 తేదీల్లో సెమీఫైనల్స్ జరగగా, మార్చి 8న కిరీటం ఎవరి తలపై మెరుస్తుందో తేలనుంది.

వేదికల పరంగా కూడా ఈ వరల్డ్‌కప్ స్పెషల్. భారత్‌లో అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి క్రికెట్ కోటలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుండగా, శ్రీలంకలో కొలంబో, క్యాండీ స్టేడియాలు అభిమానులను అలరించనున్నాయి. టోర్నీ తొలి రోజే మూడు మ్యాచ్‌లతో హోరాహోరీ ప్రారంభమవుతుంది. ముంబైలో భారత్–అమెరికా మ్యాచ్‌తో టీమ్ ఇండియా ప్రయాణం మొదలవుతుండగా, ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉంత్కంఠ నెలకొంది.

భారత్ సెమీఫైనల్‌కు చేరితే వాంఖడే స్టేడియంలో ఆ మ్యాచ్ జరగనుండటం మరో హైలైట్. పాకిస్థాన్ సెమీస్‌కు వస్తే కొలంబోలో పోరు ఖాయం. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లేదా కొలంబోలో జరగనుండగా, చివరి వరకు ఉత్కంఠ తప్పదన్నది మాత్రం ఖాయం. కొత్త జట్ల సవాళ్లు, పాత ప్రత్యర్థుల ప్రతిష్ఠ పోరు, కోట్లాది అభిమానుల ఆశలు.. ఈ అన్ని అంశాలు కలిసి టీ20 వరల్డ్‌కప్ 2026ను చరిత్రలో నిలిచే టోర్నీగా మార్చబోతున్నాయి.