బరువు తగ్గడం అనేది ఒక్క రోజు, ఒక్క వారం పని కాదు. జిమ్‌కు వెళ్లినా, యోగా చేసినా సరే.. ఆహారంలో మార్పులు లేకపోతే ఫలితం కనిపించదు. ఇదే విషయాన్ని తన అనుభవంతో నిరూపించాడు ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. కఠినమైన డైట్‌లకో, ఖరీదైన సప్లిమెంట్లకో వెళ్లకుండా, క్రమశిక్షణతో కూడిన దినచర్యతో 8 నెలల్లో ఏకంగా 30 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు. అంతేకాదు, వారానికి సుమారు 2 కిలోల వరకు బరువు తగ్గేందుకు తాను పాటించిన సులభమైన నియమాలను కూడా షేర్ చేశాడు.
ఈ వెయిట్ లాస్ జర్నీ ప్రకారం, ముందుగా ఆహారంలో కొన్ని వస్తువులకు పూర్తిగా గుడ్‌బై చెప్పాల్సిందే. చక్కెర, కూల్‌డ్రింక్స్, బేకరీ ఐటెమ్స్ వంటి వాటిని పూర్తిగా మానేయాలి. ఇవి శరీరంలో అనవసర కొవ్వును పెంచడమే కాకుండా, బరువు తగ్గే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయని ఆయన చెబుతున్నాడు. అలాగే ఉప్పు వినియోగాన్ని కూడా సాధ్యమైనంత వరకు తగ్గించాలి. రోజువారీ ఆహారంలో నూనె పరిమాణం కీలకం. రోజుకు రెండు టేబుల్ స్పూన్లకు మించి నూనె తీసుకోకూడదని సూచించాడు. దీనితో పాటు శారీరక చురుకుదనం తప్పనిసరి. రోజుకు కనీసం 8 వేల నుంచి 10 వేల అడుగులు నడవడం, ఆపై 30 నుంచి 40 నిమిషాలు వేగంగా నడక చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుందని వివరించాడు.
నిద్ర కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ చెబుతున్నాడు. రోజుకు 7 నుంచి 8 గంటలు ప్రశాంతమైన నిద్ర లేకపోతే హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, బరువు తగ్గడం కష్టమవుతుందంటాడు. కాబట్టి నిద్రను కూడా డైట్‌లో భాగంగానే భావించాలి. ఆహారం మానేయడం కాదు, మితంగా తినడమే అసలైన రహస్యం. ఉదయం అల్పాహారంగా రెండు గుడ్లు లేదా సుమారు 100 గ్రాముల పనీర్, దోసకాయ వంటి కూరగాయలు, పప్పులు, జీలకర్ర కలిపిన పెరుగు తీసుకోవచ్చని సూచించాడు. సాయంత్రం ఆకలి వేస్తే ఆపిల్, బొప్పాయి, బెర్రీస్ వంటి పండ్లు లేదా కాల్చిన శనగలు, వేరుశెనగలు తీసుకోవాలని చెప్పాడు.
రాత్రి భోజనం విషయంలో కూడా సింపుల్ రూల్ ఉంది. ఒక కప్పు పప్పు, తాజా సలాడ్లు, రెండు చపాతీలు లేదా ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకోవచ్చు. నాన్‌వెజ్ ఇష్టపడేవారు 120 నుంచి 150 గ్రాముల వరకు చికెన్ తీసుకోవచ్చని తెలిపాడు. భోజనం తర్వాత గ్రీన్ టీ లేదా నిమ్మకాయ టీ తాగడం జీర్ణక్రియకు సహాయపడుతుందని చెప్పాడు. ఈ విధమైన క్రమబద్ధమైన జీవనశైలి వల్లే తాను వారానికి సగటున 2 కిలోల వరకు బరువు తగ్గగలిగానని ఆయన చెబుతున్నాడు. అయితే ప్రతి ఒక్కరి శరీర స్వభావం వేరువేరుగా ఉంటుందని, కాబట్టి ఇలాంటి పద్ధతులు పాటించే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. (గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహా తప్పనిసరి.)
