Charlie Kirk: ట్రంప్ సన్నిహితుడు చార్లీ దారుణ హత్య.. ఎవరతను..?

Charlie Kirk

Charlie Kirk: అగ్రరాజ్యం అమెరికాలో దారుణ హత్య జరిగింది. ఓ కార్యక్రమంలో అందరు చూస్తుండగానే ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగిందంటే.. అమెరికాలోని ఉటా వ్యాలీ యూనివర్సిటీలో మాస్ షూటింగ్స్‌పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చార్లీ అతిథిగా హాజరయ్యారు. అతడు ప్రసంగిస్తున్న సమయంలో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. భారీ శబ్దంతో ఓ బుల్లెట్ చార్లీ మెడకు తగిలింది. అంతే అతడు కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్న వారందరూ భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చార్లీని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ట్రంప్ తీవ్ర విచారం..

చార్లీ మృతి పట్ల అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గొప్ప వ్యక్తిని కోల్పోయానంటూ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. తన సన్నిహితుడు మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమెరికాలో చార్లీ కంటే బాగా యువత మనసులను బాగా అర్థం చేసుకున్న వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. ఈ దారుణ హత్యను అమెరికా చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. రాజకీయ హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మరోవైపు చార్లీ హత్యకు నిరసనగా ఆయన మద్దతుదారులు తీవ్ర సంఘీభావం కార్యక్రమాలు చేపట్టారు. Charlie Kirk

ఉద్దేశపూర్వకంగానే హత్య..

ఈ హత్యపై ఎఫ్‌బీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ పేర్కొన్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌పై నక్కిన హంతకుడు నుంచి బుల్లెట్ దూసుకొచ్చినట్లుగా తెలిపారు. ఉద్దేశపూర్వకంగా చార్లీని హత్య చేసినట్లు వెల్లడించారు. కాగా ఉటా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ వర్సిటీ అధికారులకు 1000 మంది సంతకాలతో కూడిన ఫిర్యాదును అందజేశారు. అయితే కార్యక్రమం రద్దుకు అధికారులు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా ఎఫ్‌బీఐ భావిస్తోంది.

Charlie Kirk

చార్లీ కిర్క్ ఎవరు..?

18 సంవత్సరాల వయసులోనే టర్నింగ్‌ పాయింట్‌ యూఎస్‌ఏ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. ట్రంప్‌కు సన్నిహితుడిగా మారారు. అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ చేపట్టిన రైట్ రిపబ్లికన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. మంచి వాక్చాతుర్యం కలిగిన చార్లీకి సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. 2020 ఎన్నికల్లో గోల్‌మాల్ జరగడంతో తాను ఓడిపోయినట్లు ట్రంప్ చేసిన విమర్శలకు చార్లీ సపోర్ట్‌గా నిలిచారు. ట్రంప్ లాగే వలసదారుల విషయంలో తన వైఖరిని స్పష్టం చెప్పేవారు. ముఖ్యంగా భారత్ నుంచి వెళ్లే వారిపై విమర్శలు చేసేవారు. భారతీయులకు ఎక్కువ వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే అమెరికా వలసదారులతో నిండిపోయిందన్నారు. అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఈ భావజాలంతోనే ట్రంప్‌కు కిర్క్ దగ్గయ్యారు. ఇదే సమయంలో శత్రువులకు కూడా టార్గెట్ అయ్యారు.

ట్రంప్ మద్దతుదారులే టార్గెట్‌గా..?

గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌పై కూడా కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే.పెన్సిల్వేనియాలో ప్రచారంలో భాగంగా ఓ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో భాగంగా ఓ బుల్లెట్ ట్రంప్ చెవికి తగులుకుంటూ తగిలింది. ఈ పరిణామం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇప్పుడు ట్రంప్ మద్దతుదారులు టార్గెట్‌గా కాల్పులు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోసారి అమెరికాలో గన్ కల్చర్‌పై చర్చ మొదలైంది. ప్రతి ఒక్కరి దగ్గర తుపాకీలు ఉండటంతో హత్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే గన్‌ కల్చర్‌పై ట్రంప్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి తాజా ఘటనతో అగ్రరాజ్యంలో గన్ కల్చర్‌ను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందనే అక్కడి మేధావులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.