ఉదయపు చిన్న అలవాటు.. జీవితాంతం దంత ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది..!

ప్రతి రోజు ఉదయం మనం నిద్రలేచిన వెంటనే చేసే పని పళ్లు తోముకోవడం. కానీ ఆ అలవాటు నిజంగా దంతాలను రక్షిస్తున్నదా? లేక తెలియకుండానే నష్టాన్ని తెచ్చిపెడుతున్నదా? అనే ప్రశ్నకు చాలామంది దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. ఎందుకంటే సమస్య పేస్ట్‌లో కాదు.. బ్రష్‌లో ఉంది. చాలామంది టూత్ బ్రష్ కొనేటప్పుడు ధర లేదా బ్రాండ్‌కే ప్రాధాన్యం ఇస్తారు. కానీ నిపుణుల మాట ప్రకారం, బ్రష్ రూపం, బ్రిస్టల్స్ నిర్మాణం తప్పుగా ఉంటే రోజూ పళ్లు తోముకున్నా దంతాల మధ్య ఉండే వ్యర్థాలు పూర్తిగా తొలగవు. ఫలితంగా చిగుళ్ల వ్యాధులు, దంతాల పుచ్చు, రక్తస్రావం వంటి సమస్యలు నెమ్మదిగా మొదలవుతాయి.

గట్టిగా, ఒకే రకంగా ఉండే బ్రిస్టల్స్ ఉన్న బ్రష్ శుభ్రంగా తోముతున్న భావన కలిగించొచ్చు. కానీ వాస్తవంలో అవే పళ్లపై ఉన్న ఎనామిల్‌ను అరిగించేస్తాయి. చిగుళ్లను గాయపరుస్తాయి. వైద్యులు సూచించేది మాత్రం మృదువైన బ్రిస్టల్స్‌తో, జిగ్-జాగ్ లేదా ఉంగరాల ఆకారంలో ఉన్న బ్రష్‌లనే. అలాంటి బ్రిస్టల్స్ మాత్రమే పళ్ల మధ్య చిన్న సందుల్లోకి చొచ్చుకెళ్లి ఆహార కణాలను బయటకు తీస్తాయి.

అలాగే బ్రష్ తల ఆకారం కూడా చాలా కీలకం. పెద్దగా, వెడల్పుగా ఉండే తల ఉన్న బ్రష్ నోటి మూలల్లోకి సరిగ్గా చేరదు. వెనుక పళ్ల దగ్గర శుభ్రత లోపిస్తుంది. V-ఆకారంలో ఉండే తల భాగం నోటి అంతటా సులభంగా తిరుగుతూ ప్రతి పళ్లను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. హ్యాండిల్ విషయంలోనూ చిన్న తేడా పెద్ద ప్రయోజనం ఇస్తుంది. కొంచెం వంపు తిరిగిన హ్యాండిల్ వెనుక దవడ పళ్ల వరకు ఒత్తిడి లేకుండా చేరుతుంది.

ఇంకో పెద్ద పొరపాటు.. బ్రష్ మార్చే విషయంలోనే జరుగుతోంది. బ్రిస్టల్స్ పూర్తిగా పక్కకు వంగిపోయే వరకు చాలామంది అదే బ్రష్‌ను వాడుతుంటారు. కానీ వైద్య పరిశోధనలు చెబుతున్న నిజం వేరే. ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి టూత్ బ్రష్ తప్పకుండా మార్చాలి. అరిగిపోయిన బ్రష్ దంతాలను శుభ్రం చేయకపోగా, బ్యాక్టీరియా పేరుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. రోజూ కొన్ని నిమిషాల పాటు చేసే ఈ చిన్న పని, సరైన విధంగా ఉంటే జీవితాంతం దంత సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది. కేవలం బ్రష్ ఎంపికలో జాగ్రత్త పడితే చాలు.. చిరునవ్వు ఆరోగ్యంగా నిలుస్తుంది.