శని అంటే చాలామందికి భయం. జాతకంలో శని దోషం ఉందంటే చాలు.. ఆరోగ్యం, డబ్బు, మానసిక ప్రశాంతత అన్నీ తారుమారవుతాయని భావిస్తారు. కానీ జ్యోతిష్య పండితులు చెబుతున్న ఓ విశేషం ఇప్పుడు భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాఘ మాసంలో వచ్చే శని త్రయోదశి రోజున శనిని పూజిస్తే, ఏళ్లుగా వెంటాడుతున్న శని పీడల నుంచి సులభంగా బయటపడవచ్చని అంటున్నారు. జనవరి 31న (శనివారం) త్రయోదశి కలిసి రావడం విశేషం. మాఘ మాసంలో వచ్చే ఈ శని త్రయోదశి సాధారణ రోజుల కంటే ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. శని స్వయంగా విష్ణు భక్తుడు కావడం, మాఘ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం కావడంతో… ఈ రోజున చేసే పూజలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయని విశ్వాసం.
పండితుల సూచనల ప్రకారం, శని పీడలు తొలగిపోవాలంటే ప్రాతఃకాలంలో నవగ్రహాల ఆలయానికి వెళ్లి శనేశ్వరుడిని దర్శించుకోవాలి. శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. డబ్బు పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కొబ్బరి నీటిని శని విగ్రహంపై పోయాలి. శత్రు బాధలు, దిష్టి సమస్యలు ఎక్కువగా ఉంటే ఆవాల నూనెతో అభిషేకం చేయడం శుభఫలితాలను ఇస్తుందని అంటున్నారు.
అభిషేకం అనంతరం శనికి ఇష్టమైన నీలం రంగు పూలను పాదాల వద్ద ఉంచాలి. లేదా పిడికెడు రాళ్ల ఉప్పు, నల్ల నువ్వులు, జమ్మి ఆకులు సమర్పించవచ్చు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ “ఓం శం శనైశ్చరాయ నమః” మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ఆ తర్వాత ఆలయంలో శివుడిని దర్శించుకుంటే శని ప్రభావం మరింత తగ్గుతుందని విశ్వాసం.
శని త్రయోదశి రోజున సాయంత్రం 5.15 నుంచి 5.45 వరకు ఉండే ప్రత్యేక కాలాన్ని శని త్రయోదశి పర్వంగా పరిగణిస్తారు. ఆ సమయంలో శివాభిషేకం చేస్తే శని దోషాల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. శివలింగానికి నల్ల నువ్వులు కలిపిన నీరు లేదా పాలతో అభిషేకం చేయాలి. ఆలయంలో శని దానంగా నల్ల నువ్వులు, ఇనుప మేకు, దూది, పెసరపప్పును నల్లని వస్త్రంలో కట్టి దానం చేయడం శుభప్రదమని చెబుతున్నారు. ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లోనే శని దీపం వెలిగించుకోవచ్చు. స్నానం అనంతరం హాల్‌లో పడమర దిక్కున పీట ఉంచి, మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో 8 ఒత్తులు కలిపి దీపం వెలిగించాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే శని పీడలు క్రమంగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
