హెచ్‌-1బీకి లాటరీకి గుడ్‌బై.. ట్రంప్ కొత్త వీసా విధానం.. భారత యువ ప్రొఫెషనల్స్‌కు షాక్..!

అమెరికాలో ఉద్యోగం చేయాలనే కలలతో ఉన్న లక్షల మంది విదేశీ యువతకు కీలక మార్పు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న హెచ్‌-1బీ వర్క్ వీసా లాటరీ వ్యవస్థకు అమెరికా ప్రభుత్వం ముగింపు పలకాలని భావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అడ్మినిస్ట్రేషన్ కొత్త విధానానికి రూపకల్పన చేస్తుండటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఇకపై వీసాల కేటాయింపులో అదృష్టం కంటే నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా నిర్ణయించినట్లు సమాచారం. అధిక స్కిల్స్ కలిగి, ఎక్కువ వేతనం పొందే విదేశీ ఉద్యోగులకే హెచ్‌-1బీ వీసాల్లో ముందస్తు ప్రాధాన్యం కల్పించనున్నారు. దీని ప్రభావం ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్స్‌పై తీవ్రంగా పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, తక్కువ అనుభవం ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ఇప్పటివరకు లాటరీ విధానంలో అదృష్టం కలిసి వస్తే వీసా లభించేది. కానీ కొత్త విధానంలో వేతనం, ఉద్యోగ స్థాయి, నైపుణ్యాలే ప్రధాన ప్రమాణాలుగా మారనున్నాయి.

వీసా విధానంలో మార్పులపై ఇప్పటికే అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం వల్ల అమెరికా పౌరులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని కొంతమంది విశ్లేషకులు విమర్శిస్తున్నారు. మరోవైపు, ఇదే విధానం అమెరికాను ఆవిష్కరణల కేంద్రంగా మార్చిందని, స్టార్టప్‌లు, టెక్ రంగం అభివృద్ధికి విదేశీ టాలెంట్ కీలకమని మద్దతుదారులు వాదిస్తున్నారు.

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కొత్త హెచ్‌-1బీ విధానం 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. 2027 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఎంపిక ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. ఏడాదికి సుమారు 85 వేల హెచ్‌-1బీ వీసాలను కేటాయించనున్నారు. అమెరికాలో ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమై తదుపరి ఏడాది సెప్టెంబర్ 30తో ముగుస్తుంది.

ఈ మార్పులపై అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కూడా స్పష్టత ఇచ్చింది. సంస్థ ప్రతినిధి మాథ్యూ ట్రాజెసర్ మాట్లాడుతూ, ప్రస్తుత ర్యాండమ్ లాటరీ విధానాన్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని తెలిపారు. అమెరికా ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాల కంటే తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను తీసుకురావడం ద్వారా సంస్థలు లాభపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి, హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో రానున్న ఈ భారీ మార్పులు భారత యువతపై, ముఖ్యంగా అమెరికా కెరీర్ కలలతో ఉన్న ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్స్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై అమెరికా వెళ్లాలంటే అదృష్టం కంటే నైపుణ్యాలే కీలకం కానున్నాయి.