Target India: సోషల్ మీడియాపై బ్యాన్ నేపాల్ దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ అల్లర్లు కారణంగా ఏకంగా ప్రభుత్వమే కుప్పకూలింది. అయితే ఈ ఆందోళనల వెనక బలమైన కారణాలు ఉన్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతకుముందు బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ దేశాలు అల్లర్లతో అట్టుడికిపోయాయి. సరిగ్గా గమనిస్తే ఇవన్నీ భారతదేశం సరిహద్దు దేశాల్లో కావడం గమనార్హం. అసలు భారత్ సరిహద్దు దేశాల్లోనే అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి..? ఆయా దేశాల్లో ఇటీవలే వరుసగా ఎందుకు ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి..? ఈ పరిణామాలు భారత్‌పై ప్రభావం చూపిస్తాయా..? భారత్‌లోనూ ఇలాంటి అల్లర్లు జరగనున్నాయా..? అసలు ఈ అల్లర్ల వెనక ఎవరున్నారు..? ఆసియా ఖండంపై ఆధిపత్యం చెలాయించేందుకు కుట్రలు జరుగుతున్నాయా..?
ఇండియా పొరుగు దేశాల్లో వరుసగా ఎందుకు రాజకీయ సంక్షోభాలు ఎదురవుతున్నాయి. అది కూడా ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లోనే అల్లర్లు జరుగుతున్నాయి. ఈ దేశాల్లో రాజకీయ అస్థితర వెనక బలమైన కుట్రలు దాగి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉద్రిక్తతల వెనక అమెరికా, చైనా దేశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆధిపత్య పోరు కోసం ముందుగా సరిహద్దు దేశాల్లో అల్లర్లు సృష్టించి భారత్‌లో కూడా రాజకీయ అనిశ్చితి సృష్టించాలని కుట్రలు చేస్తున్నట్లు వాదనలు వినపడుతున్నాయి. ఇందుకోసం పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అర్థమవుతోందని చెబుతున్నారు. ఇప్పటివరకు అల్లర్లు జరిగిన దేశాల్లో పరిస్థితులను పరిశీలిస్తే ఇది స్పష్టం అవుతుందని పేర్కొంటున్నారు.
ఆయా దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న ఓ నిర్ణయంతో అయినా లేదా ఏదైనా సమస్యలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలవుతాయి. ఈ అల్లర్లను అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వాలు బలప్రయోగాలు చేయడం.. సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం జరిగాయి. ఆ తర్వాత ఒక్కసారిగా ఆందోళనలు హింసాత్మకంగా మారి దేశవ్యాప్తంగా అలజడులు మొదలయ్యాయి. అంతటితో ఆగకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వాధినేతల నివాసాలు, పార్లమెంట్, న్యాయస్థానాలను నిప్పు పెట్టి ధ్వంసం చేశారు.అలాగే ఎక్కడ పడితే అక్కడ లూటీ చేయడం వంటి చేశారు. ఇదే సమయంలో ఓ కొత్త నేత పేరు తెరపైకి రావడం.. తాత్కాలిక ప్రధానిగా, దేశాధినేతగా పగ్గాలు చేపట్టడం జరిగిపోయాయి.
ఈ దేశాల్లో జరిగిన పరిణామాలన్ని ఒకే రీతిలో ఇలాగే ఉండటం చూస్తే అమెరికా, చైనా దేశాల బలమైన కుట్రలు ఉన్నాయని మేధావులు భావిస్తున్నారు. ఎందుకంటే దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం కొంతకాలంగా అమెరికా, చైనా దేశాలు పోటీపడటం ఉదహరిస్తున్నారు. దీంతో అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు దక్షిణాసియాలోని దేశాల్లో అలజడుతు సృష్టిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ముందుగా మయన్మార్‌లో నోబెల్ శాంతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అమెరికా మద్దతు ఇచ్చింది. ఇది నచ్చని చైనా 2021లో ఆ దేశ ఆర్మీని రంగంలోకి దించింది. సూకీతో పాటు ఇతర ముఖ్య నేతలను అరెస్ట్ చేయించింది. దీంతో ఆ దేశంలో చైనా మద్దతుతో ఆర్మీ పాలన కొనసాగుతుంది. అయినా కానీ ఆర్మీతో పోరాటం చేస్తున్న ప్రజాస్వామ్య వాదులకు అమెరికా ఆర్థికంగా సపోర్ట్ ఇస్తోంది.
ఇక శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభం వెనక అమెరికా ఉందనే వాదన కూడా ఉంది. కరోనా రాక ముందు శ్రీలంక చైనాకి దగ్గర కావడం చేసింది. ఈ క్రమంలో హంబన్‌టోట పోర్టును చైనాకు 99ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఇది మింగుడుపడని అమెరికా శ్రీలంకలోని ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టిందంటున్నారు. ఇదే సమయంలో కరోనా దెబ్బకు టూరిజం పడిపోవడంతో శ్రీలంక ఆర్థికంగా దివాళా తీయడం మొదలుపెట్టింది. మరోవైపు దేశంలో ఆహారం, విద్యుత్, ఇంధన కొరతతో ప్రజలు రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆందోళనలు చేపట్టారు. దీంతో ఆ దేశం అల్లర్లతో అట్టుడికిపోయింది. ఇక చేసేదేమీ లేక రాజపక్స్ దేశం వదిలి పారిపోవడంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించడానికే అమెరికా ఈ ఆందోళనలను వెనక్కుండి నడిపించిందని అనాలిస్ట్స్ చెబుతున్నారు.
ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో ఓ దీవి కోసం అమెరికా ప్రయత్నించింది. అయితే ఇందుకు షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో అక్కడి అల్లర్లు ప్రారంభమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2024లో జరిగిన నిరసనల వెనక అమెరికా హస్తం ఉందని షేక్ హసీనా బహిరంగంగానే ఆరోపించారు. సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా మిలిటరీ బేస్‌కు అనుమతి ఇవ్వకపోవడంతోనే తనను అమెరికా టార్గెట్ చేసిందని ఆమె సంచలన ఆరోపణలు చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి బంగ్గాదేశ్ చైనాకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంతోనే అమెరికా మిలటరీ స్థావరం ఏర్పాటుచేయడానికి నిరాకరించింది అంటున్నారు. దీంతో బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి జరిగింది.
నేపాల్‌లోనూ అల్లర్లు వెనక అమెరికా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా అమెరికా ఆ దేశంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అయితే అధికారంలో ఉన్న కేపీ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం చైనాకు అనుకూలంగా పనిచేస్తుంది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా యాప్‌లపై ప్రభుత్వం నిషేధం విధించింది. దాంతో అమెరికాకు ఆర్థికంగా నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా అనుకూలా శక్తులు నేపాల్‌లో అల్లర్లకు తెరలేపాయని నేపాల్ మీడియా కోడైకూస్తోంది.
ఇవన్నీ చూస్తుంటే భారత్ టార్గెట్‌గా సరిహద్దు దేశాల్లో అమెరికా, చైనా అనుకూల శక్తులు కుట్రలు పన్నాయని అర్థమవుతోందంటున్నారు. పొరుగు దేశాల్లో ఇరు దేశాల అనుకూల ప్రభుత్వాలు ఉండటం ఇండియాకు ప్రమాదం పొంచి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలోనూ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు విశ్లేషకులు కొన్ని ఉదాహరణలు ప్రస్తావిస్తున్నారు. 2021లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, యూపీలో షహీన్ బాగ్ అల్లర్లు, మణిపూర్ అల్లర్లను ఉదహరిస్తున్నారు. అయితే ఈ అల్లర్లను భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోవడంతో ఆ ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. కానీ ఈ ప్రయత్నాలు ఇంతటితో ఆగవని.. మరిన్ని ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇందుకోసం అమెరికాకు చెందిన మెజార్టీ సోషల్ మీడియా యాప్‌లు ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నాయని భావిస్తున్నారు. అయితే దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజకీయ నాయకుల అవినీతి, ఈఎంఐల ట్యాపింగ్, దేశ సంపద కొంతమంది చేతుల్లోనే ఉండటం వంటి సమస్యలు యువతలో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఈ అసంతృప్తి పెరిగితే మాత్రం భారత్‌లోనూ రాజకీయ సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ కోట్లాది మంది ప్రజలు, భిన్నత్వంలో ఏకత్వం వల్ల ఇండియాలో అంత త్వరగా ఇలాంటి సమస్యలు రావడం అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పొరుగు దేశాల్లో సంక్షోభం వల్ల సరిహద్దులో చొరబాటులు, నక్సలిజం తిరిగి పెరగడం, మాదక ద్రవ్యాలు, దొంగ నోట్ల వినియోగం పెరగడం, భద్రత పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు, మేధావులు సూచిస్తున్నారు.
