అమెరికాలో దుండగుడి చేతిలో కాల్పులకు గురైన బాధితుడు సాయికృష్ణ కుటుంబ సభ్యులు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను కలిశారు. సాయికృష్ణ వైద్యానికి అయ్యే ఖర్చు భరించడంతో పాటు కుటుంబ సభ్యులు అమెరికాకు వెళ్లేందుకు అయ్యే ఖర్చు అంతా కూడా భరిస్తామని కేటిఆర్ వారికి హమీనిచ్చారు. వారిని అడిగి వివరాలు తెలుసుకొని అమెరికా ఎంబసీ అధికారులతో మరియు ప్రభుత్వ అధికారులతో కేటిఆర్ మాట్లాడారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని వారికి భరోసానిచ్చారు.
మహబూబాబా పట్టణానికి చెందిన పూస ఎల్లయ్య, శైలజల కుమారుడు సాయి కృష్ణ. మిచ్ గాన్ రాష్ట్రంలోని లారెన్స్ టెక్ యూనివర్సిటిలో ఎంఎస్సీ చదువుతున్నాడు. జనవరి 3న రెస్టారెంట్ కు వెళ్లి పార్సిల్ తీసుకొచ్చుకుంటుండగా గుర్తు తెలియని దుండగులు అతనిని అనుసరించి అతని పై కాల్పులు జరిపారు. అతని వద్ద ఉన్న నగదు, ఉంగారాలు, ఫోన్ లతో పాటు అతని కారును కూడా తీసుకొని పారిపోయారు. గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కేటిఆర్ ను సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసి పరిస్థితి వివరించారు.
మంత్రి కేటిఆర్ వారితో మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి
సాయికృష్ణ తండ్రి పూస ఎల్లయ్య కేటిఆర్ ను కలిశాక మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
“జనవరి 3వ తేదీ నాడు నా కుమారుడి పై కాల్పులు జరిపారు. నా కొడుకు అక్కడే చికిత్స పొందుతున్నాడు. అక్కడికి వెళ్లాలి అంటే మాకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. సహాయం కోసం మేం కేటిఆర్ సారుని కలిశాం. అయితే మా కంటే ముందే కేటీఆర్ మా కొడుకు దగ్గరకు వెళ్లేందుకు మాకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతోపాటు ఆర్ధిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మాకు అమెరికా వెళ్లేందుకు వీసా, ఫ్లయిట్ ఖర్చులు ఇస్తాం అని చెప్పిన కేటీఆర్ కు కృతజ్ఞతలు. మాకు వీసాలు ఉన్నాయి. మాతో పాటు మా ఇద్దరు పిల్లలకు వీసా లు, ఫ్లయిట్ చార్జీలు ,అక్కడ వైద్యానికి అయ్యే ఖర్చులు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.” అని ఆయన అన్నారు.
సాయికృష్ణ అన్న శివానంద్ ఏమన్నారంటే
“మా కంటే ముందే మా తమ్ముడు సాయి కృష్ణ గురించి పెద్ద మనసుతో కేటిఆర్ సారు ఆలోచించారు. మాకు అక్కడకు పోయేందుకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం నుండి చేస్తాం అని చెప్పారు. ఆర్ధిక సహాయంతో పాటు మాకు అన్ని ఏర్పాట్లు చేసిన కేటీఆర్ కు ధన్యవాదాలు.” అని ఆయన అన్నారు.