(వి. శంకరయ్య)
ఇంత వరకు సీమ ప్రజలు ఉపాధి కోసం వలస బాట పట్టేవారు. ఈ ఏడు వేసవిలో సాగు నీరు దేవుడెరుగు. కనీసం తాగునీటి కోసం వెతుకు లాడవలసి వుంటుందేమో. శ్రీ శైలం జలాశయ నీటి మట్టం రోజు రోజుకు పడి పోతోంది. నీటి మట్టం 833 అడుగులు లేక 254. 020 మీటర్లకు పడి పోతే హంద్రీనీవా ద్వారా నీటిని పంపింగ్ చేయడం కుదరదు. జనవరి 12 వ తేదీకి జలాశయ నీటి మట్టం 837.70 అడుగులకు చేరింది. డిసెంబర్ 31 వతేదీ నీటి మట్టం 840.30 అడుగులుగా వుంటే 12 రోజుల్లోనే మూడు అడుగులకు పడిపోయింది. ఇక మిగిలింది కేవలం నాలుగు . అడుగులు మాత్రమే. ఇది 833 అడుగులు చేరడానికి ఎక్కువ రోజులు పట్టవు. డిసెంబర్ 31 వతేదీ శ్రీ శైలంలో 62.30 టియంసిలు నీరు వుంటే జనవరి 12 వతేదీకి 58 టియంసిలు నీరు వుంది. ఇక మిగిలిన మార్గం ముచ్చు మరి మాత్రమే. ఇచ్చట నుండి. చాలా పరిమితంగా అయిదారు వందల క్యూసెక్కుల నీరు మాత్రమే పంపింగ్ చేయగలరు.డిసెంబరు 12 వతేది 490 క్యూసెక్కుల నీరు మాత్రమే కెసి కెనాల్ కు పంపింగ్ చేస్తున్నారు. జలాశయ నీటి మట్టం 800 అడుగులు పడిపోయే వరకు ఇదే మోతాదుకు మించి పంపింగ్ చేయలేరు. అంటే గుడ్డి కన్ను మూసినా ఒకటే. తెరచినా ఒకటే.ఒక వేళ శ్రీ శైల జలాశయ నీటి మట్టం 800 అడుగులకు పడిపోతే ఇక ఇంతే సంగతులు. శ్రీ శైలంలో మిగిలిన కొద్ది నీరు కూడా సీమకు తరలించే అవకాశం లేదు. కాకుంటే ఈ నెల ఆఖరుకు ఇది సంభవించ వచ్చు. తర్వాత పరిస్థితి ఏమిటి? నాలుగు జిల్లాల్లో కనీసం తాగునీటి కోసంఎదురు కానున్న ప్రమాదం గురించి ముఖ్యమంత్రి ఆలోచించడం లేదు. ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కే పథకాలు తామర తంపరగా ప్రకటించుతూ తిరిగి తనకు ముఖ్యమంత్రి పదవి కట్ట బెట్ట మని చెబుతూ ఒక వేళ తను అధికారంలోనికి రాక పోతే రాష్ట్రం కుక్కలు చంపిన విస్తరి అవుతుందని పైగా బెదిరింపులు చేస్తున్నారు.అదీ కాక పోతే పట్టి సీమ నుండి గోదావరి జలాలు తీసుకు వచ్చి సీమ పొలాలు పునీతం చేస్తున్నానని చెబుతున్నారు. ఫలితంగా కృష్ణ నది జలాలపై సీమకు ఏలాంటి హక్కు లేదని పరోక్షంగా చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఏడు పోతు రెడ్డి పాడు రెగులేటర్ నుండి కేవలం ఆవిరి పారుదల నష్టం పోగా ఇచ్చింది కేవలం 60 టియంసిలు కూడా లేవు. ఇందులో నికర జలాలు 19+10=29 టియంసిలు పోగా మిగిలినది కేవలం30 టియంసిలు కూడా లేవు. హంద్రీనీవా ద్వారా మరొక 30 టియంసిలు ఇచ్చి వుంటారు. మొత్తం కలిపి 60 టియంసిలు కూడా ఇవ్వ కుండా కృష్ణ నది నీటి పై హక్కులేనటు పట్టి సీమ నుండి గోదావరి జలాలు సీమకు ఇచ్చానని గొప్పలు చెబుతున్నారు. ఇందుకు కారణం లేక పోలేదు. ఈ నాలుగేళ్ల కాలం దృష్టి అంతా పట్టి సీమ పురుషోత్తమ పట్నం పోలవరంపై పెట్టి నందున సీమ ప్రజల ఆగ్రహం తగ్గించేందుకు ఈ నాటకం ఆడు తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో సీమ లో కొత్త ప్రాజెక్టులు చేపట్ట కున్నా నిర్మాణంలో వుండిన ప్రాజెక్టులు మచ్చుకు పోతిరెడ్డి పాడు రెగులేటర్ 44 వేల క్యూసెక్కుల విడుదల సామర్థ్యంకు పెంచి వున్నా అదే సమయంలో హంద్రీనీవా పధకం మల్యాల నుండి జీడి పల్లి జలాశయం వరకు గల ప్రథాన కాలువ 216 కిలోమీటర్ల విస్తరణ పనులు పూర్తి చేసి నాలుగు వేల క్యూసెక్కులు ప్రవహించే విధంగా చేసి వున్నా సీమకు ఈ సీజన్ లో శ్రీ శైలం నుండి ఎక్కువ నీరు తరలించి వుండ వచ్చు. కాని గత ఏడాది ఆగస్టు నుండి కూడా కేవలం 2363 క్యూసెక్కులు మాత్రమే హంద్రీనీవా ద్వారా పంపింగ్ చేశారు. ప్రస్తుతం డిసెంబర్ 12 వతేదీ 1680 క్యూసెక్కుల మాత్రమే పంపింగ్ చేస్తున్నారు. కెసి కెనాల్ కు ముచ్చు మరి నుండి 490 క్యూసెక్కుల ఇస్తున్నారు. అదీ అడపా దడపా పంపింగ్ చేస్తున్నారు. ఇది ఇలా వుండగా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి కాకూడదని చెప్పు కొచ్చే ముఖ్యమంత్రి పుణ్యమా అని రాయలసీమలో ఈ పాటికే వేర్పాటు వాదం క్రమేణా బల పడుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగితే తప్ప సీమకు న్యాయం జరగదనే భావన విస్తరించు తోంది. ఇందుకు ముఖ్యమంత్రి అనుసరిస్తున్న కేంద్రీకృత విధానాలే జవం జీవం సమకూర్చు తున్నాయి.
కనీసం అయిదు నెలల పాటు వర్షాలు పడే అవకాశం లేదు. ప్రస్తుతం సీమ ప్రాంతంలోని జలాశయాలలో చాలా పరిమితంగా నీరు వుంది. ఈ నీటితో పంటలు సాగు ఆలోచన పక్కన బెడితే తాగు నీటికి కటకట లాడి పోవలసి వుంటుందేమో.
హంద్రీనీవా పథకం ద్వారా ఆరేళ్ల నుండి కర్నూలు అనంతపురం జిల్లాలకు కృష్ణ జలాలు సరఫరా చేస్తున్నారు. గత సంవత్సరం కూడా 25 టియంసిలు అనంతపురం జిల్లాకే సరఫరా చేశారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడి నందున మరొక 10 టియంసిలు అనంతపురం జిల్లాకు కర్నూలు జిల్లా కలుపుకొంటే దాదాపు 40 టియంసిలు పంపింగ్ జరుగుతుందని భావించినా ఇప్పటికి 30 టియంసిలు కూడా పంపింగ్ జరగలేదు. అతి కష్టం మీద మరొక రెండు మూడు టియంసిలకు మించి పంపింగ్ చేయలేరు. ఈ లోపు చిత్తూరు జిల్లాలో కుప్పంకు నీరు ఈ నెలలోనే తరలించే కార్య క్రమం పెట్టుకున్నారు. ఈ కార్య క్రమం రెండేళ్లుగా వాయిదా పడుతోంది. . చిత్తూరు జిల్లాకు అనంతపురం జిల్లాలో గల చెర్లో పల్లి జలాశయం నుండినీరు తీసుకు రావాలి. దాని నీటి నిల్వ సామర్థ్యం కేవలం 1.425 టియంసిలు మాత్రమే. పైగ పూర్తిగా నింపలేరు. ఈ జలాశయం పైభాగంలో గల గొల్లపల్లి జలాశయం నీటి సామర్థ్యం కూడా 1.614 టియంసిలు మాత్రమే. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోనే నీటి కోసం పోట్లాడు తున్నారు. ఈ స్థితిలో చిత్తూరు జిల్లాకు ఏ మేరకు నీరు ఇస్తారో ఎవరూ చెప్పలేరు. కాకుంటే నీరు పారించామని చూపించ వచ్చు. ఈ ఏడాది చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య జటిలం కానున్నది. హంద్రీనీవా ద్వారా సాగు నీరు ఇవ్వ లేకున్నా కనీసం తాగు నీరు హంద్రీనీవా ద్వారా ఇచ్చి వుండ వచ్చు. ఆ పరిస్థితి చేయి దాటి పోయింది. కనీసం తన సొంత నియోజకవర్గం దృష్టిలో పెట్టుకుని అయినా యుద్ధ ప్రాతిపదికన జీడిపల్లి వరకు కాలువ విస్తరణ చేయించి మరిన్ని పంపులు పని చేయించి వుంటే నేడు ఇంత అవాంతర పరిస్థితి దాపురించేది కాదు.
హంద్రీనీవా పథకంలో భాగ మైన జీడిపల్లి పత్తికొండ కృష్ణ గిరి మూడు జలాశయాలు కలిపి మూడు టియంసిలు కూడా నిల్వ చేయలేరు. ఆ తర్వాత గొల్లపల్లి మారాల చెర్లో పల్లి మూడు కలపి మూడు టిఎంసిలకు మించి నింపలేరు. అయితే ప్రస్తుతం ఆ మేరకు నీరు నిల్వ లేదు. వచ్చిన నీరు చెరువులకు నింపారు. చిత్తూరు జిల్లా కుప్పం కోసం గొల్లపల్లి చెర్లో పిల్ల జలాశయాల నుండి నీరు తరలించు తున్నారు..
పైగా సీమ లో గల ఇతర జలాశయాలలో అతి తక్కువ నీరు వుంది. శ్రీ శైలం కుడి కాలువలో భాగమైన గోర కళ్లు లో ప్రస్తుతం 1.90 టియంసిలు అవుకులో1. 44 టియంసిలు మాత్రమే వున్నాయి. గోర కళ్లు లో ఈ ఏడు పది టియంసిలు నింపమని రైతులు డిమాండ్ చేశారు. కాని ఆరు టీఎంసీల నింపారు. ఎందుకంటే దీని నిర్మాణం నాశి రకంగా వుంది. ఆరు టియంసిలు నింప గానే ఇటీవల జలాశయం నుండి ఊట ప్రారంభమెంది. ఈ పుణ్యం కూడా కాంట్రాక్టర్ అయిన ఒక టిడిపి నేత కట్టు కున్నారు. పైగా అచ్చట నుండి గండి కోటకు ఇతర సాగుకు నీరు తరలించడంతో ప్రస్తుతం రెండు టియంసిలు కూడా లేవు.
తెలుగు గంగలో భాగమైన వెలు గోడు లో4. 45 టియంసిలు సుంకేసుల లో ప్రస్తుతం 1.19 టియంసిలు వున్నా ఈ పథకాల కింద సాగులో వున్న పంటలకు పోను వచ్చే అయిదారు నెలల కాలం సీమ జిల్లాల్లో తాగు నీటి సరఫరా ఏలా ఇస్తారో దేవునికే ఎరుక.
ప్రస్తుతం సీమ సమస్య సాగు నీరు కన్నా వచ్చే అయిదారు నెలలు తాగునీటి సరఫరా జటిలం కానున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో సీమలో కొత్త జలాశయాలు నిర్మాణం చేయ కున్నా వున్న జలాశయాలను పూర్తి సామర్థ్యంతో నింపే విధంగా చర్యలు చేపట్టి వుంటే నేడు ఈ దుస్థితి సంభవించేది కాదు..పైగా అర కొర నీటి సరఫరా తో జిల్లాల మధ్య తగాదాలకు ప్రభుత్వం ఆజ్యం పోసింది
ముఖ్యమంత్రి కి ఎంత సేపు అత్యంత దుబారాతో నిర్మాణం చేసిన పట్టి సీమ పథకం గురించి చెప్పుకోవడం దాని ద్వారా సీమను సస్యశ్యామలం చేస్తానని గొప్పలకు పోవడంతో సీమ ప్రాజెక్టుల నిర్మాణం మూలకు నెట్ట బడి తుదకు ఈ ఏడు తాగునీటి కోసం సీమ ప్రజలు వలస బాట పట్ట వలసి వస్తోంది.
(వి. శంకరయ్య, రాజకీయ వ్యాఖ్యాత, ఫోన్ నెం. 9848394013)