Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం వద్ద పెను ప్రమాదం తప్పింది కొండచరియలు విరిగిపడ్డాయి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. శ్రీశైలం-హైదరాబాద్‌ రహదారిలోని ఏపీ పవర్‌ హౌస్‌ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. బండరాళ్లు విరిగిపడిన సమయంలో వాహనాలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఈ కారణంగా వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.

స్థానికుల ప్రకారం, వర్షాకాలంలో ఇలా కొండచరియలు విరిగిపడడం తరచుగా జరుగుతోంది, ఇది ప్రమాదాలకు కారణమవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 2,87,391 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,20,902 క్యూసెక్కులుగా ఉంది. జూరాల, సుంకేసుల నుంచి 1,61,414 క్యూసెక్కుల వరద వస్తోంది.

జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.50 అడుగులకు చేరింది. అధికారులు 10 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద ప్రవాహం మరింత పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వర్షాలు: అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Public Reaction On CM Chandrababu Comments On Ys Jagan || Ap Public Talk || Pawan Kalyan || TR