చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఒకటే అన్నది జనాబాహుళ్యం మాట. అవే ఆరోపణలను వైసిపి పదే పదే చేస్తున్నారు. కాదని పై ఇద్దరిలో ఏ ఒక్కరు స్పష్టం చేయలేదు. పైగా వాళ్ళిద్దరూ ఒకటే అనటానికి చాలా ఉదాహరణలే కనబడుతున్నాయి. గాజువాకలో పవన్ నామినేషన్ వేసినపుడు జనసేన జెండాలతో పాటు టిడిపి జెండాలు కూడా పెద్ద ఎత్తున కనిపించాయి. పవన్ నామినేషన్ వేసేటపుడు జనసేన జెండాలు కనబడటంలో ఆశ్చర్యం ఏమీలేదు. మరి టిడిపి జెండాలు ఎందుకు కనిపించాయి ?
సరే ఆ విషయాన్ని పక్కనపెడితే జగన్మోహన్ రెడ్డిపై ఇన్ని రోజులుగా చంద్రబాబు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవే ఆరోపణలను పవన్ కూడా మొదలుపెట్టారు. తమ పార్టీలో చేరుదామని అనుకున్న నేతలు భయపడి వైసిపిలో చేరుతున్నారట. ఎందుకంటే, వారికి హైదరాబాద్ లో ఆస్తులున్నాయట. అంటే టిఆర్ఎస్ భయపెట్టి ఏపిలో అందరినీ వైసిపిలో చేరేట్లుగా చేస్తోందనే అర్ధం వచ్చేట్లుగా మాట్లాడారు. అది నిజం కాదని స్వయంగా టిడిపి ఎంపి మాగంటి మురళీమోహనే తేల్చేశారు.
జగన్ అధికారంలోకి వస్తే నేరాలు, ఘొరాలు జరుగుతాయన్న చంద్రబాబు ఆరోపణలనే పవన్ వల్లెవేశారు. మరి చంద్రబాబు హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని గతంలో ఇదే పవన్ చేసిన విమర్శలేమయ్యాయో ? ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, కోడికత్తి కేసంటూ చంద్రబాబు ఆరోపణలనే తాజాగా పవన్ కూడా చేశారు. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమైపోతుందో అని తనకు భయం వేస్తోందట. అప్పటికేదో చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో ఒక్క నేరం, ఒక్క ఘోరం, హత్య కూడా జరగనట్లు పవన్ మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోంది.