ముద్రగడకు చివరకు మిగిలిందేమిటి?

(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)

కాపు రిజర్వేషన్ల పోరాటనాయుకుడు ముద్రగడ పద్మనాభం దారి ఎటో ఎవరికీ అంతుపట్టడం లేదు. పట్టు విడుపుల్లేకుండా కాపు రిజర్వేషన్ల మీద చాలా విపరీతమయిన స్టాండ్ తీసుకుని తన రాజకీయాల్లో తానే ఇరుక్కుపోయారు. రాజకీయాల్లో పట్టువిడుపులుండాలి. ఒకటే పట్టు పనికిరాదు. ఈ వ్యూహాల్లో  ఒక్కోసారి ఎదురు దెబ్బలు తగిలినా కోలుకునే స్కోపుండాలి. రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థులు ఇరుక్కుపోవాలి తప్ప, మనమే ఇరుక్కుపోయి, వూపిరాడని పరిస్థితి రాకూడదు. ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఇపుడలాగే ఉంది. ఆయన కాపురిజర్వేషన్లు కావాల్సిందే నంటున్నారు.కాపుజాతికి న్యాయం కావాల్సిందే అంటున్నారు. వూరికే అరిస్తే న్యాయం రాదు. కాపు రిజర్వేషన్లనేవి రాజకీయ డిమాండ్.దాన్ని రాజకీయంగా సాధించాలి తప్ప మూఢనమ్మకాలకు పోరాదు. ఇలా ఎవరూ పోయినా ముద్రగడ పద్మనాభం పరిస్థితి వస్తుంది. ఇపుడు ఆయన పరిస్థితి ఏమిటి? ఆయన తన డిమాండ్ ను ముందుకు తీసుకుపోలేరు, వదులుకోనూలేరు. ఇదేమి రాజకీయం?

చివరకు ఆయనే డిమాండే ఆయన కాళ్లకుచుట్టుకుంది. దీన్ని భుజానేసుకుని ఏ రాజకీయపార్టీలో చేరలేరు. ఆ డిమాండ్ తో వస్తే ఒక్క రాజకీయ పార్టీ కూడ ఆయన కోసం తలుపులు బార్లా తెరవదు. ఆ డిమాండ్ మీద ఒక్క నాయకుడు కూడా  హామీ ఇవ్వలేరు, అని ఆ డిమాండ్ ను కాదనలేరు. ఎందుకొచ్చిన గొడవ, ముద్రగడ పద్మనాభం లేకపోతే పార్టీ నడవదా? అనే ధోరణి అన్నిపార్టీల్లో ఉంది. ఆయనేదయినా పార్టీలో చేరాలంటే, ఢిమాండ్ ను వాయిదా వేసుకోవాలి.  ఇంతకంటే ఆత్మవంచనేముంటుంది. తను రెకెత్తించి, ఉద్యమస్థాయికి తీసుకువచ్చి, చావో రేవో అని గర్జించిన వ్యక్తి, ఎన్నికలకోసం డిమాండ్ ను కొద్ది ఇంట్లో పెట్టేసి వెళ్లడాన్ని కాపులు కూడా హర్షించరు.

 

అధికారంలోకి వస్తే కాపు రిజర్వేషన్లను అమలుచేస్తామని ఒక్క పార్టీ చేతనైనా ఆయన ఎన్నికల ప్రణాళికలో పెట్టించగలరా? అసాధ్యం. ముద్రగడ కోసం కొరివితో ఇపుడు ఏ పార్టీ తలగోక్కోదు. ఎందుకంటే, ఎన్నికలపుడు ఒక వ్యక్తి కోసం కాపులకు రిజర్వేషన్లిస్తామని బిసి వోటర్లను దూరం చేసుకోలేరు. అసలు ఈ బిసివోట్లను బావుకునేందుకు కాదూ, జగన్ తూర్పుగోదావరి జిల్లానుంచి ముద్రగడ డిమాండ్ ను బంగాళా ఖాతంలో విసిరేసింది.  జగన్ స్వయంగా ముద్రగడకు మద్దతునిచ్చారు.  జగన్ పార్టీ  వంద సార్లు ముద్రగడ డిమాండ్ కు మద్దతునిచ్చింది.

అంతెందుకు, ముద్రగడ దీక్షలకు వెనక ఉన్న శక్తి కూడా జగనేనంటారు. ముద్రగడకు జగన్ మనిషని చెడ్డపేరుకూడా వచ్చింది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి, ముద్రగడ లాంటి  నేతకు జగన్ వత్తాసు అవసరమా ? ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు ఆయన చూల్లేదు. అయినాసరే ఆయన జగన్ మనిషన్నముద్రవచ్చినా భరించారు. ఆ బాధను చాలాసార్లు ఆయన స్వయంగా వెల్లడించారు కూడా.  అలాంటి మనిషి చేస్తున్న డిమాండ్ ను జగన్ బాహాటంగా తృణీకరించారు. కాపు  రిజర్వేషన్లు అమలు కావడం కష్టం, ఇది సాధించేందుకు కాపులతో కలసి పోరాటంచేస్తానని ఒడుపుగా హామీ కూడాఇవ్వకుండా, చేతకాని పని చేయలేనని అన్నారు. కాపు రిజర్వేషన్లను, ముద్రగడ దీక్షలను బలపర్చినపుడు ఇది అలివికాని డిమాండ్ అని జగన్ కి ఆయన చుట్టూ ఉన్న మేధావులకి తెలియదా?

కాబట్టి బిసిల వోట్ల కోసం జగన్ ముద్రగడను వదలుకునేందుకు వెనకాడలేదు.అంటే  వైసిపితో, జగన్ తో ముద్రగడకు ఉన్నబంధం తెగిపోయింది. ఇక పవన్ సంగతి చూడండి. ముద్రగడ మీద, ముద్రగడ డిమాండ్ మీద పవన్ తెలివిగా మౌనంగా ఉంటున్నారు.కారణం, ఈ డిమాండ్ తో తాను బిసిలను వదులుకోవలసి వస్తుందని భయమే. కాబట్టి తాను అధికారంలోకి వస్తే, కాపు రిజర్వేషన్లు కల్పిస్తానని  పవన్ కూడా  మానిఫెస్టోలో పెట్టలేడు. ఆయనకు కాపు వోట్లకన్నా బిసిల వోట్లు చాలా అవసరం.

 

 కాపు రిజర్వేషన్ల  హామీతో ఆయన ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించ లేడు. ఆ డిమాండ్ ను వదలుకోమని ముద్రగడకు కాపునేత గా సలహా ఇచ్చే సాహసం చేయలేడు.  ఇక బిజెపి. ఈ పార్టీకి కాపు నాయకుడు కన్నాలక్ష్మినారాయణ అధ్యక్షుడు. ముద్రగడ లాంటి బలమయిన మరొక కాపునాయకుడిని ఆయన పార్టీలోకి రానీయడు. వచ్చినా,  కేంద్రాన్ని వప్పించి, కాపు రిజర్వేషన్లు తీసుకువస్తాననే  హమీని బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో  పెట్టించనూ లేడు. అందువల్ల బిజెపి నుంచి కూడా ముద్రగడకు ఆహ్వానం ఉండదు. ఒక వేళ ఉన్నా బేషరతుగా రమ్మంటారు. లేదా కాపు రిజర్వేషన్ల డిమాండ్ మీద ఎన్నికలయ్యేదాకా  మాట్లాడకుండా ఉండమంటారు. ఇది ముద్రగడకు సాధ్యమా.

ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఏమంటున్నది? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే ఫైలు మీద అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అదే నోటితో కాపు రిజర్వేషన్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి కాంగ్రెస్ అసెంబ్లీలో కాలు పెట్టేందుకు కాపుల వోట్లు చాలా అసవరం, ఒక హామీ పడేస్తే పబ్బం గడుస్తుంది. అయినా సరే,  కాపు రిజర్వేషన్ల మీద  హామీ ఇవ్వడానికి రాష్ట్రం అసెంబ్లీనుంచి మాయమయిన కాంగ్రెస్ కూడాసాహసం చేయడం  లేదు.

ఇలా అన్ని పార్టీలు ముద్రగడను ఇపుడు అంటరాని వాడిలాగా చూస్తున్నాయి. అయితే, ఆయనకు ఇపుడు దిక్కు తాను ఇంతవరకు టార్గెట్ చేస్తూ  వచ్చిన తెలుగుదేశంయే.  తెలుగు దేశం పార్టీ యే ధైర్యంగా 2014లో కాపుల రిజర్వేషన్లు ప్రకటించింది. బిసి వోటర్లు కోపగిస్తారని భయపడలేదు. అలాగే అపుడు బిసిలు కూడా ఈ డిమాండ్ ను వ్యతిరేకించలేదు. దీనికి 2014లో టిడిపి విజయమే సాక్ష్యం.

బిసిలను ఒప్పించి ఎప్పటికైనా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఇప్పటికి చెబుతున్న పార్టీ టిడిపియే. కాబట్టి, ముద్రగడ పద్మనాభం పంతానికి పోకుండా కాపు రిజర్వేషన్ల విషయంలో టిడిపితో కలసి సాగాలి.  కాపు రిజర్వేషన్ల మీద టిడిపికి మాత్రమే స్పష్టమయిన వైఖరి ఉంది. మెజారిటీ బిసిల మద్దతు ఉన్న పార్టీ కూడా టిడిపియే. అందువల్ల ఆలస్యంగా నైనా బిసిలను వప్పించే శక్తి  ఒక్క టిడిపికే ఉంది. ఇందులో జాప్యం జరగవచ్చు గాని,  టిడిపి ఇంతకు మించి వెనక్కు వెళ్ల లేదు. ఇంత స్పష్టంగా కాకపోయినా, ఆ మాట ముద్రగడ నోటి నుంచి కూడా వెలువడింది.

ఒక లక్ష్యం సాధించేందుకు ఒకడుగు వెనక్కేసినా నష్టం లేదు. తన డిమాండ్ ను వ్యవూహాత్మకంగా మార్పు చేసుకుని టిడిపిలో చేరడమే సరైన నిర్ణయం. ఈ పార్టీలో తప్ప మరొక పార్టీలో ఆయన చోటు లేదు.ఇపుడు ముద్రగడ ముందున్నపశ్న ఒక్కటే… టిడిపిలో చేరడమా లేక తన డిమాండ్ లో  బయటకు రాలనేంతగా  ఇరుక్కుపోవడమా?

లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీ లన్నీ ‘అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు ప్రకటిస్తాం’ అని  ఎన్నికల ప్రణాళికలో చేర్చేలా  ముద్రగడ కాపు ఉద్యమం తీవ్రతరం చేయాలి. అది సాధ్యమా?