మూడు రాజధానుల విషయమై వైసీపీ గతంలో వెనక్కి తగ్గింది. కోర్టు కేసులు, ఇతరత్రా న్యాయపరమైన సమస్యల కారణంగా అప్పట్లో ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లుతో ముందుకు వెళ్ళలేని పరిస్థితిని వైసీపీ గుర్తించింది.. అందుకే, ఆ బిల్లుని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
‘మరింత మెరుగైన బిల్లుతో వస్తాం..’ అని అప్పట్లోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లుని పెట్టడానికి వైసీపీ సమాయత్తమవుతోంది. మూడు రాజధానులు మా విధానం.. అంటోంది వైసీపీ. చంద్రబాబు కూడా అసెంబ్లీకి వస్తే, టీడీపీకి వున్న సందేహాలపై సమాధానం చెబుతామని ప్రభుత్వ విప్ ప్రసాదరాజు చెబుతున్నారు.
అయితే, చంద్రబాబు అసెంబ్లీకి వెళితే వైసీపీ ఏం చేస్తుందో టీడీపీకి బాగా తెలుసు. వైసీపీ శాసన సభ్యులు, చంద్రబాబుని బూతులు తిడతారు. గతంలో అలా తిట్టి, చంద్రబాబుని అసెంబ్లీ నుంచి వెల్లగొట్టారు. చంద్రబాబు అసెంబ్లీకి వెళ్ళకపోతే వైసీపీ శాసనసభ్యులు బూతులు మానతారా.? అంటే, ఆయన సభలో లేకపోయినా.. తిట్టడం అయితే కామన్.!
సరే, ఆ బూతుల వ్యవహారాన్ని పక్కన పెట్టి, రాజధాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, గడచిన మూడేళ్ళలో రాజధాని అమరావతిని వైసీపీ సర్కారు అస్సలు పట్టించుకోలేదు. అలాంటప్పుడు, మూడు రాజధానుల బిల్లు పెట్టినా ప్రయోజనమేంటి.? ఒక్క రాజధానికే దిక్కు లేదుగానీ, మూడు రాజధానుల్ని ఉద్ధరిస్తారా.? అన్న ప్రశ్నకు వైసీపీ దగ్గర సమాధానం లేదు.
మూడు రాజధానులపై ముందుకే.. అని వైసీపీ అంటోంది. ఆ ‘ముందుకే’ అన్నదానిపై వైసీపీ స్పష్టత ఇవ్వలేకపోతోంది. ఎందుకంటే, అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాలు కొనసాగుతోంటే, మిగతా రెండు రాజధానుల్ని వైసీపీ ఉద్ధరిస్తుందేమోనన్న చిన్నపాటి నమ్మకం జనానికి కలుగుతుంది.
వున్నపళంగా రాజధానిని అమరాతి నుంచి విశాఖకు మార్చేయాలి గనుక, మూడు రాజధానుల వ్యవహారాన్ని వైసీపీ తెరపైకి తెచ్చింది. విశాఖకు రాజధాని మార్చడం వల్ల రాష్ట్రానికిగానీ, వైసీపీకిగానీ ఒరిగే అదనపు లాభం ఏంటట.?