ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్ధల ఎన్నికల విషయంలో తీవ్ర సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వానికి, ఎన్నికల అధికారికి వివాదం నెలకొంది. పరస్పరం సహరించుకోవాల్సిన వారు యుద్దానికి దిగారు. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అంటున్న ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు అనుగుణమైన కారణాలు చెబుతున్నారు. కరోనా ఉధృతి తగ్గింది కాబట్టి జాగ్రత్తల నడుమ ఎన్నికలు పెట్టుకోవచ్చని ఆయన అంటున్నారు. ప్రభుత్వం తనకు సహరించడంలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అయితే కరోనా సెకండ్ వేవ్ రానుంది కాబట్టి ఎన్నికలు పెట్టి ప్రజలు ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేమని తమకు ప్రజలే ముఖ్యమని అంటున్నారు.
పది లోపు కేసులున్నప్పుడే ఎన్నికల ప్రక్రియను నిలిపివేసిన ఎన్నికల కమీషన్ ఇప్పుడు రోజులు 3000 కేసులు వస్తుంటే ఎన్నికలు పెట్టాలని ఎలా అనుటుకుంటున్నారు అంటూ వాదిస్తున్నారు. కేసు కోర్టులో ఉన్నందున కోర్టు ఏది చెబితే అదే ఫైనల్ డెసిషన్ అనుకోవచ్చు. ఈలోపు ఇంకొన్ని పర్యాయాలు వాదనలు నడిచే అవకాశం ఉంది. అయితే ఈ నెల 2వ తేదీ నుండి ప్రభుత్వం పాఠశాలను రీఓపెన్ చేసింది. కరోనా పూర్తిగా తగ్గేవరకూ ఆగొచ్చు కదా అని ఎంతమంది చెబుతున్నా వినకుండా ఇప్పటికే దాదాపు సగం విద్యాసంవత్సరం పోయిందనే కారణం చూపి పాఠశాలలు ఓపెన్ చేసింది.
ఇప్పుడు దీన్నే నిమ్మగడ్డ అస్త్రంగా వాడుకోనున్నారని అంటున్నారు. పాఠశాలలు తెరవడానికి అడ్డురాని కరోనా ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు అడ్డమవుతోంది అనే లాజిక్కును ఆయన కోర్టు ముందు ఉంచబోతున్నారట. నిమ్మగడ్డ అలా గనుక చేస్తే జగన్ తరపున వాదనలు కాస్త నీరుగారి ప్రమాదం ఉంది. ఈ ప్రశ్నలో నిజంగానే లాజిక్ ఉంది. పిల్లలు చదువుకునే పాఠశాలలోనే జాగ్రత్తలు పాటిస్తే కరోనా భయం ఉండదని పాఠశాలలు ఓపెన్ చేసింది ప్రభుత్వం. అలాంటిది అన్నీ తెలిసిన పెద్దలు ఓట్లు వేసే చోట తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ముప్పు నుండి తప్పించుకోగలమని ఎందుకు అనుకోలేకపోతోందో వారికే తెలియాలి. ఈ ప్రశ్న ఒక్క నిమగడ్డలోనే కాదు సామాన్య జనం చాలామందికి వచ్చింది.