ప్రస్తుతం ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు అనే అంశం ఎన్నికలు సమీపిస్తున్న వేళ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు దొంగనోట్లను తొలగించామని.. కుప్పంలో వాటి సంఖ్య అధికంగా ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోపక్క ఈ విషయంలో జగన్ సర్కార్ అక్రమాలకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో ఏపీ మాజీ ఈసీ నిమ్మగడ్డ ఎంటరయ్యారు!
ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలకు మీరంటే మీరు కారణం అంటూ అధికార ప్రతిపక్షాలు కారణం అంటూ చెప్పుకుంటున్న తరుణంలో… అక్రమాలు మాత్రం కచ్చితంగా జరుగుతున్నాయంటూ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇందులో భాగంగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఈ క్రమంలో సిటిజన్స్ ఫర్ డెమక్రసీ అనే సంస్థను నిమ్మగడ్డ నెలకొల్పారు. ఈ సంస్థ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతుందని ఆయన ప్రకటించారు. ఈ సంస్థలో పలువురు విశ్రాంత ఉన్నతాధికారులు వివిధ హోదాల్లో ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓటర్ల జాబితాలో అక్రమాలపై పోరాటం అంటూ సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ లో ప్రధానంగా… వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేతుల మీదుగా ఏపీలో ఓటర్ల జాబితాలు తయారవుతున్నాయని పేర్కొన్నారు. వీరంతా వైసీపీ కార్యకర్తలే అని నిమ్మగడ్డ ఆరోపించారు. ఇదే క్రమంలో… ఏపీలో భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించారని.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని.. ఐప్యాక్ టీంతో దొంగ ఓట్లు భారీగా నమోదు చేయిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు నిమ్మగడ్డ.
అంతేకాదు… ఇలా దొంగ ఓట్లు నమోదు చేయించేందుకు సుమారు రూ.68 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పలు వివరాలు ఈ పిటిషన్ కు జతపరిచారని చెబుతున్నారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణ ఎప్పుడు జరగబోతుందనేది వేచి చూడాలి!
కాగా… కొవిడ్ సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేయడంతో సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో… చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడం వల్లే తమకు కనీస సమాచారం ఇవ్వకుండా వాయిదా వేశారని జగన్ ఆరోపించారు. అనంతరం నిమ్మగడ్డను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది!
దీంతో నిమ్మగడ్డ కోర్టును ఆశ్రయించారు. దీంతో… రాజ్యాంగ పదవి అయిన ఎన్నికల అధికారిని తొలగించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ న్యాయస్థానం చివాట్లు పెట్టింది. అనంతరం… నిమ్మగడ్డను తిరిగి ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించింది. ఈ సమయంలో… సాక్ష్యాత్తు ఒక ఎన్నికల కమిషనర్ కే సొంత వూళ్లో ఓటు హక్కు లేకుండా పోయింది. దీంతో సరైన సమయం చూసి జగన్ పై నిమ్మగడ్డ రివేంజ్ తీర్చుకొవడానికి ప్లాన్ చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.