ఈ నియోజకవర్గం చాలా కాస్ట్లీ గురూ

రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం చాలా కాస్ట్లీ నియోజకవర్గంగా పాపులరైంది. రాజధాని జిల్లా అయిన గుంటూరులోని మూడు నియోజకవర్గాల్లో ఇదొకటి. నియోజకవర్గానికున్న చరిత్రను గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గంలో జరుగనున్న ఎన్నికను ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. వ్యయం రీత్యానే కాకుండా శాంతి భద్రతల విషయంలో కూడా ఈ నియోజకవర్గం సెన్సిటివ్ గా ఈసి పరిగణిస్తోంది.

ఇక ప్రస్తుతానికి వస్తే అధికార తెలుగుదేశంపార్టీ తరపున ప్రముఖ కాంట్రాక్టర్, రాజకీయ నేత, సిట్టింగ్ ఎంపి రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం  వైసిపి తరపున విజ్ఞాన్ విద్యా సంస్ధల అధినేత లావు శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేస్తున్నారు. జనసేన తరపున నవాబ్ కమాల్ హిందుపుర్ రంగంలో ఉన్నారు. కాంగ్రెస్, బిజెపిల తరపున కూడా అభ్యర్ధులున్నా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

పై అభ్యర్ధుల్లో కూడా ప్రధాన పోటీ రాయపాటి, కృష్ణ దేవరాయల మధ్యే ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే, ఇద్దరు కూడా ఆర్ధిక, అంగ బలాల్లో ఎవరికీ ఎవరూ తీసిపోరు. కాకపోతే రాయపాటి చాలా సీనియర్ పొలిటీషియన్. ఇప్పటికే పలుమార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. వైసిపి అభ్యర్ధి మాత్రం మొదటిసారి పోటీ చేస్తున్నారు.

ప్రభుత్వంపై జనాల్లోని వ్యతిరేకత రాయపాటికి తీవ్ర ప్రతికూలంగా ఉండవచ్చని అంచనా. అదే సమయంలో  జగన్మోహన్ రెడ్డి పై జనాల్లో పెరుగుతున్న సానుకూలత శ్రీకృష్ణదేవరాయలుకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఈసి అంచనా వేస్తోంది. అందుకనే ఏడుగురు పరిశీలకులతో పాటు ఇద్దరేసి చొప్పు ఉప పరిశీలకులను కూడా నియమించింది. శాంతి భద్రతల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. మరి అభ్యర్ధులు ఏం చేస్తారో చూడాలి.