కొత్త సమస్య… పవన్ భార్యకు పోలింగ్ బూత్ లో ఏమి పని?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా వెబ్ క్యాస్టింగ్ కి సంబంధించిన వీడియోలు టీడీపీ నేతల సోషల్ మీడియా పేజీల్లో ప్రత్యక్షమవ్వడం.. వీటిని ప్రాతిపదికగా తీసుకున్నట్లుగా ఈసీ తదుపరి చర్యలకు పూనుకుంటుందంటూ వైసీపీ నేతలు ఆరోపించడం వంటి అంశాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం వైరల్ గా మారింది. ఈ సమయంలో ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థలో కొంతమంది అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. వారు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర పక్షపాత దోరణిలో ఉందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామిస్తున్న ఫిర్యాదులపై ఈసీ స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

తప్పు ఎవరు చేసినా తప్పే… అది చిన్నదా పెద్దదా అనేది తర్వాత సంగతి.. కానీ ఎవరు తప్పు చేసినా ఈసీ మాత్రం సమానంగా రియాక్ట్ అవ్వాలి కదా అనేది వైసీపీ నేతల మాట. అదే ధర్మం అనేది పరిశీలకుల వ్యాఖ్యగా ఉంది. ఈ సమయంలో పోలింగ్ రోజు టీడీపీ నేతలు అతిక్రమించిన విషయాల్లో కొన్నింటిని తాజాగా వైసీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు.

ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణల వ్యవహారాన్ని గుర్తుచేస్తున్నారు! ఇందులో భాగంగా… టీడీపీ, జనసేన అగ్రనేతలు యథేచ్ఛగా వ్యవహరించినా చోద్యం చూసిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ రోజు బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లు వ్యవహరించిన తీరును ప్రస్థావిస్తున్నారు.

నిబంధనల ప్రకారం… ఓటర్లు, పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్లను మాత్రమే పోలింగ్‌ బూత్‌ లోకి అనుమతిస్తారు. ఓటు హక్కులేని వారు పోలింగ్‌ బూత్‌ లోకి వెళ్లకూడదు. ఈ నిబంధన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సతీమణికి వర్తించదని ఈసీ భావించినట్టుందని అంటున్నారు పరిశీలకులు.

మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నంబరు 197లో పవన్‌ కళ్యాణ్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే.. ఆ సమయంలో ఓటు హక్కులేని తన భార్య అన్నా లెజినోవాతో సహా ఆయన పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. ఇది నిబంధనలకు వ్యతిరేకం అని వైసీపీ తీవ్రం ఆరోపిస్తుంది. .దీనిపై ఈసీ కనీసం స్పందించకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తుంది.

ఇదే క్రమంలో… పోలింగ్‌ కేంద్రాల వద్ద పార్టీ జెండాలు, కండువాలు, కరపత్రాలు ప్రదర్శించకూడదనేది నిబంధన. అయితే… హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి నందమూరి బాలకృష్ణ మాత్రం మెడలో పార్టీ కండువా ధరించి వెళ్లి మరీ ఓటు వేశారు. ఆ ఫొటోలు, వీడియోలు మీడియాలో వచ్చినా ఈసీ స్పందించలేదనేది మరో ఆరోపణ!

మరి ఈసీ తన సచ్చీలతను నిరూపించుకోవాలంటే… వీటిపై కూడా స్పందిస్తే మంచిదని.. అలా కానిపక్షంలో ఈసీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలని ప్రజలు నమ్మే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.