Election commission: ఈవీఎంలపై ఈసీ సంచలన నిర్ణయం.. ఇక నుంచి కొత్త రూల్

Election commission

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ కొంతకాలంగా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే ఈవీఎంలతో పాటు నకిలీ ఓట్లపైనా విపక్షాలు గళమెత్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ పక్ష నేత దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లోలక్షలాది ఓట్లను ఈసీ తొలగించిందని ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. బీజేపీకి ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరిస్తోందని అందుకే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయని వాదిస్తున్నారు. ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతపై అనుమానాలు నెలకొన్నాయి.

అయితే రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్షాల ఆరోపణలను సీఈసీ జ్ఙానేశ్ కుమార్ ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. ఓట్ల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతోందని విపక్షాల ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. ఓటు చోరీపై ఏడు రోజుల్లో రాహుల్ సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని లేని పక్షంలో దేశప్రజలకు తక్షణం క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఓటు జాబితా సమగ్ర సవరణ అత్యంత పారదర్శకంగా సాగుతోందని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఓట్ చోరీపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్ధి కలర్‌ ఫోటోలను ముద్రించనుంది. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనతో ఈవీఎం బ్యాలెట్ పేపర్లు మరింత సులువుగా చదివేందుకు వీలు పడుతుందని పేర్కొంది.

ఇప్పటివరకు అభ్యర్థులవి కేవలం నలుపు-తెలుపు లేదా చిన్న సైజు ఫొటోలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అభ్యర్థుల ఫొటోలను రంగుల్లో ముద్రించనున్నారు. దీంతో ఓటర్లు పార్టీ గుర్తు గుర్తించడంతో అయోమయం చెందినా.. అభ్యర్థుల ఫొటో చూసి ఓటు వేస్తారని ఈసీ భావిస్తోంది. దీని వల్ల మరింత పారదర్శకత లభిస్తుందని వెల్లడించింది. ఈ మార్పులతో ఓటర్లకు పోలింగ్ బూత్‌లో గందరగోళం లేకుండా తాము ఎంచుకున్న అభ్యర్థికి సులభంగా ఓటు వేయడం సాధ్యమవుతుందని పేర్కొంది. కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని 49బి నిబంధన ప్రకారం ప్రస్తుత నిబంధనలను సవరించింది.