ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది కానీ… అంతకు మించిన సమరం ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో బలంగా నడుస్తుంది. కారణం ఏదైనా, కారకులు ఎవరైనా.. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నెత్తురు ఓడుతుంది! నేతలు కనిపిస్తే రాళ్లు రువ్వుతున్నారు.. ప్రత్యర్థులు కనిపిస్తే పల్లు పటపటా కొరుకుతూ విరుచుకుపడుతున్నారు. దీంతో… ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు గెలిచినా.. వారి ప్రత్యర్థుల పరిస్థితి ఏమిటి అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రారంభమైంది.
అవును… అత్యంత హోరాహోరీగా జరిగిన ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇందులో ఒకరు వైనాట్ 175 అంటే.. మరొకరు కూటమిదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో… ఒకరు విధ్వంస పాలన అని అంటే.. మరొకరు విష కూటమి అని నిందించారు. ఇక వీరిలో ప్రజలు ఎవరి పక్షాన నిలిచారనేది జూన్ 4న తేలనుంది. ఈ గ్యాప్ లో ఏపీలో చాలా చోట్ల ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్నాయి రౌడీ మూకలు!
ఈ విషయంలో ఎల్లో మీడియా రాస్తున్నట్లు దాడులు చేసేవారంతా వైసీపీ నేతలే కాదు.. మరోవర్గం మీడియా చెబుతున్నట్లుగా రక్తపాతం సృష్టిస్తున్నవారు టీడీపీ నేతలే కాదు! ఎవరి స్థాయిలో వారు విచక్షణ మరిచి బరితెగిస్తున్నారనే చెప్పుకోవాలి. ఇది ఎన్నికల కమిషన్ పూర్తి చేతకానితనం అంటూ వినిపిస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… నేతలు కాస్త శాంతిస్తే.. కార్యకర్తలు ఆటోమెటిక్ గా శాంతిస్తారనేది వాస్తవం!
సాధారణంగా… ప్రతి ఎన్నిక తర్వాతా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో గెలిచిన వారు ఓడిన వారి మీద దాడులు చేయడం, గ్రామాల్లో మారణ కాండలు సృష్టించడం ఈ రోజే కొత్త కాదు! అయితే… అది గెలుపు లేదా ఓటమి తెలిసిన తర్వాత అధికారంలోకి వచ్చాక, ఆ అండ చూసుకుని జరిగాయి. కానీ… అనూహ్యంగా ఈసారి మాత్రం ఎన్నికల పోలింగ్ రోజునే మొదలయ్యాయి.. పోలింగ్ పూరయిన తర్వాత రోజు కూడా కంటిన్యూ అయ్యాయి!
ఈ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ చూపించాల్సిన అవసరం ఎవరి కుంది అనేది ఇప్పుడు మరో ప్రశ్న! కాకపోతే దీనికి కచ్చితంగా ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాల్సిందే అనేది నిర్వివాదాంశం! చిన్న చిన్న ఉద్యోగుల నుంచి ఏకంగా డీజీపీనే మార్చి.. శాంతి భద్రతల కోసం అన్నట్లుగా చెప్పిన ఈసీ… గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే… వారి పనితీరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు!
ఆ సంగతి అలా ఉంటే… జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా పరిస్థితులు మాత్రం దారుణంగా వుండేలా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇందులో బ్భాగంగా… కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ జనాలపై గత అయిదేళ్లుగా పెంచుకున్న కసిని తీర్చుకునే పని మొదలుపెడుతుందని అంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీ అధికారం చేపడితే టీడీపీ పరిస్థితి అత్యంత దయణీయంగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు! జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే!