చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో మరికొద్ది సేపటిలో తాడేపల్లిగూడెంలో ధర్మపోరాట సభ జరగబోతోంది. నిజానికి ఇది కేంద్రంపై నిరసన కార్యక్రమం అన్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగేళ్ళపాటు కేంద్రంతో అంటకాగిన చంద్రబాబు ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో అప్పటి నుండో కేంద్రంపై నిరసన తెలపటం మొదలుపెట్టారు. ఉండటానికి చంద్రబాబు ఎన్డీఏలోనే ఉన్నా నాలుగేళ్ళల్లో ఏపికి సాధించిందేమీ లేదు. అప్పట్లో సాధించింది లేదు, ఇపుడు కేంద్రం అడ్డుపడుతున్నదీ లేదు. కాకపోతే చంద్రబాబే రెండు కళ్ళ సిద్దాంతాన్ని ఫాలో అవుతున్నారంతే.
ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పటి వరకూ ఐదు ధర్మపోరాట సభలు జరిగాయి. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు తర్వాత ఈ రోజు తాడేపల్లిగూడెంలో జరగబోతోంది. ప్రత్యేకహోదా డిమాండ్ తో చంద్రబాబు చేస్తున్న ఈ ధర్మపోరాట సభల వల్ల ఏమిటి ఉపయోగమంటే చంద్రబాబే సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఇదో దండగమారి పోరాట సభ అన్న విషయం చంద్రబాబుతో సహా అందరికీ తెలుసు.
నాలుగేళ్లపాటు ప్రత్యేకహోదాకు ఇదే చంద్రబాబు మోకాలడ్డారు. హోదా పై కేంద్రం ఆడమన్నటల్లా ఆడారు. అసలు రాష్ట్రంలో హదా అన్న మాటే వినబడకుండా సకల ప్రయత్నాలు చేశారు. ప్రత్యేక హోదా కోసం వైసిపి అధ్యక్షుడు జగన్మొహన్ రెడ్డి చేసిన ఉద్యమాల్లో పాల్గొన్న వారిని అరెస్టులు కూడా చేయించారు. అటువంటి చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయగానే హోదా కోసం మొదటి నుండి పోరాటం చేస్తోంది తానే అన్నంతగా బిల్డప్ ఇస్తున్నారు.
చంద్రబాబు చేస్తున్న ఈ హడావుడంతా కేవలం వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే అన్న విషయం అందరికీ తెలుసు. నాలుగున్నరేళ్ళల్లో ఏపికి రాని ప్రత్యేకహోదా చివరి ఆరుమాసాల్లో వచ్చేస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. తెలిసినా మరెందుకు ధర్మపోరాట సభలు పెడుతున్నారంటే అదంతా డ్రామాలే. ప్రభుత్వ ఖర్చుతో కేంద్రాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోడిని తిట్టటం కోసం. మోడి పై చేసే ఆరోపణలు, విమర్శలు కూడా ఆవు వ్యాసం లాంటివే. అందుకే ధర్మపోరాట సభలు కాస్త చివరకు కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసే దండగమారి పోరాటమైపోయింది.