వెలిమినేడులో పంజా విసురుతున్న కాలుష్య భూతం

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు. నిన్న మొన్నటి వరకు ఊరు నిశ్శబ్దంగానే ఉంది. కానీ ఇప్పుడే అలజడి మొదలవుతుంది. ఏ కంపెనీలు పడితే ఉద్యోగాలు వచ్చి తమ బతుకులు బాగుపడతాయనుకున్నారో ఇప్పుడా కంపెనీలే గ్రామం కొంప ముంచేలా తయారయ్యాయి. కొందరి ఆశ, మరి కొందరి అత్యాశ అన్ని తోడై గ్రామంలో కాలుష్య రక్కసి పెరిగిపోతుంది. పచ్చని పొలాలతో ఆహ్లదకరమైన వాతావరణంలో ఉన్న ఊరు వల్లకాడు కాబోతుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అసలు వెలిమినేడు గ్రామస్థులు పడుతున్న బాధేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

వెలిమినేడు గ్రామంలో చిన్నా పెద్ద అంతా కలిసి 8000 వేల పైచిలుకు జనాభా నివాసముంటున్నారు. రాజధాని నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో పట్టణ వాతావరణం కనిపిస్తుంది. పల్లె, పట్టణ సౌందర్యం కలుపుకొని గ్రామంలో వాతావరణ పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ కు దగ్గర ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో 1990వ దశకంలోనే గ్రామంలో కంపెనీల ఏర్పాటు జరిగింది. అప్పుడు తెలిసీ తెలియని బతుకులు కాబట్టి కంపెనీలు పడితే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో గ్రామస్థులు కానీ పాలకవర్గాలు కానీ ఏమనలేదు. అప్పుడు ఏర్పాటు చేసిన కంపెనీల నుంచి కాలుష్య ముప్పు కూడా లేకుండటంతో అంతా సవ్యంగానే సాగింది.

గ్రామంలోని పాఠశాల 

2000 సంవత్సరం నాటికి పెను మార్పులు సంభవించడంతో కంపెనీల కన్ను వెలిమినేడుపై పడింది. రాజధాని నగరానికి 50  కిలోమీటర్ల దూరంలో కంపెనీలు ఏర్పాటు చేయాలనే నిబంధనతో వెలిమినేడును టార్గెట్ గా చేసుకొని కంపెనీలు ఏర్పాటు చేశారు. గ్రామానికి కూడా రెండు కిలోమీటర్ల దూరంలో జనావాసాలు లేని ప్రాంతంలో కంపెనీల నిర్మాణం చేప్టటాలనే నిబంధన ఉంది. వాటిని తుంగలోతొక్కి హైవేకు దగ్గర ఉంటదని ఆమడ దూరంలోనే కంపెనీలను ఏర్పాటు చేశారు.

స్థానికంగా కంపెనీ ఏర్పాటు చేస్తే అందులో 51 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ నిబంధన ఉంది. పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు 1991లో జరిగిన ఆర్థిక, పారిశ్రామిక సంస్కరణలలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చేర్చారని కానీ దాని అమలు వెలిమినేడు కంపెనీలలో కనిపించదని గ్రామ యువకులు తెలుపుతున్నారు. కంపెనీల ఏర్పాటు అంశంలో కొంతమంది నాయకులు లాలూచి పడి వారి స్వంత లాభం చూసుకొని మిగిలిన వారి ఉద్యోగ కల్పనలో విఫలమయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కొంత మందికి అవకాశాలు దొరికినా అవి చిన్న చిన్న ఉద్యోగాలేనని తెలిపారు. కుక్కకు బొక్క వేసినట్టు వేసి కోట్ల రూపాయలు కంపెనీలు దండుకుంటున్నాయన్నారు. ట్రాక్టర్లకు, జెసిబిలకు చిన్న పనులను చెప్పి బిల్లులకోసం నెలలకు నెలలు తిప్పించుకుంటారని వారు తెలిపారు.

ఏ రకంగా చూసినా వెలిమినేడులో ఉన్న కంపెనీలతో నష్టమే తప్ప లాభం లేదని వారు అన్నారు.  అలాగే గ్రామం చివరన గుట్టల దగ్గర కోళ్ల ఫారం ఏర్పాటు చేశారని దాని వల్ల దానికి సప్లయ్ అయ్యే మెటిరియల్ వాహనాలన్ని గ్రామం నుంచే వెళుతుండటంతో వాటి దుమ్ము అంతా ఇండ్లపై చేరి అవస్థలు పడాల్సి వస్తుందని వారు వాపోయారు. భవిష్యత్తులో కోళ్ల ఫాం విస్తరించే అవకాశం ఉండటంతో దోమలు, ఈగలు వచ్చి రోగాల బారిన పడే అవకాశముందని తెలిపారు. కోళ్ల ఫాంతో మరో ఎలికట్టెలా.. వెలిమినేడు తయారు అవుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్ల ఫాంకి వెళ్లే లారీల వల్ల వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్లే రోడ్లన్ని నాశనమయ్యాయని, రాత్రుల్లు వాహానాలు తిరుగుతుండటంతో నిద్రలేక జాగారాలు చేయాల్సి వస్తుందన్నారు. తక్షణమే వారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని గ్రామ యువకులు హెచ్చరించారు. డేరా బాబా భూ భాగోతంతో ఊరును ఆగం చేశాడని… పలు రకాలుగా వెలిమినేడును ఆగం చేస్తున్నారని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.

వెలిమినేడులోని హైవే పక్కన ఏర్పాటు చేసిన హిందిస్ ల్యాబ్ ప్రస్తుత ఉత్పత్తి సామర్ధ్యం 5.25 టన్నులు దానిని 150 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యానికి పెంచాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. దశమి కంపెనీ 15 టన్నుల నుంచి 421 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యానికి పెంచాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే కాలుష్యపు కంపుల చస్తున్నామంటే వీటికి తోడు మరో కొత్త కంపెనీ యాక్టరో 165 టన్నుల కెపాసిటీతో ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. వీటన్నింటికి ప్రజాభిప్రాయ సేకరణ సెప్టెంబర్ 14న చేపట్టనున్నారు.దశమి, హిందీస్ హెటిరో సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. కంపెనీల కెపాసిటీని విస్తరిస్తే గ్రామం కాలుష్యంలో చిక్కుకుని నాశనమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఊళ్ళో కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారని మరింత విస్తరణకు అవకాశం ఇస్తే ఊరు వల్లకాడవుతుందని వారు భయాందోళన చెందుతున్నారు. కంపెనీల ప్రభావంతో పిట్టంపల్లి, బొంగోని చెర్వు, పేరేపల్లి, కిష్టాపురం, గుండ్రాంపల్లి, ఏపూరు గ్రామాల ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెలిమినేడు వేదికగా అన్ని గ్రామాల ప్రజలు కలిసి రావాలని యువకులు కోరుతున్నారు.

గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం

దివీస్ కంపెనీని కూడా అలాగే విస్తరించి గ్రామస్థులు వ్యతిరేకిస్తే మీ ఊరు అమ్మండి కొంటానని దివీస్ యాజమాన్యం గతంలో చేసిన వ్యాఖ్యలను గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులో వెలిమినేడును కూడా అమ్మండి కొంటాం అని యాజమాన్యాలు అనవా అని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో అనేక మంది పీజీలు, ఉన్నత చదువులు చదువుకొని ఉంటేనే ఉద్యోగాలు ఇవ్వలేదు. విస్తరించిన తర్వాత ఇస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు తమ స్వంత లాభం కోసం ఊరిని ఆగం చేయవద్దని గ్రామస్తులు కోరుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా గ్రామస్థులకు సహకరించి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. పటాన్ చెరువు, మేడ్చల్. చౌటుప్పల్ కంపెనీల కాలుష్యంతో నాశనమయ్యాయని ఇప్పుడు వాటి కన్ను వెలిమినేడుపై పడిందా అని వారు ఆందోళన చెందుతున్నారు. వెలిమినేడు గ్రామాన్ని ఎట్టి పరిస్తితిలో కాలుష్య పరం కానివ్వమని సై అంటే సై అనేలా పోరాడుతామని ప్రజాభిప్రాయ  సేకరణను అడ్డుకొని తీరుతామని వారు హెచ్చరిస్తున్నారు.

సెప్టెంబర్ 14… గ్రామంలో మూడు కంపెనీలపై ప్రజాభిప్రాయ సేకరణ. గతంలో కంటే భిన్నంగా ఈ సారీ ప్రజాభిప్రాయ సేకరణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్రామస్థులు ముఖ్యంగా గ్రామ యువకులు కంపెనీలను తరిమి కొట్టెందుకు కంకణం కట్టుకుని కూర్చున్నట్టుగా తెలుస్తోంది. 14 తారీఖు నాడు గ్రామంలో ఏం జరగబోతుందో అన్నటువంటి టెన్షన్ ఏర్పడింది. ఇప్పటికే గ్రామంలో రాజకీయ జేఏసీలు, పర్యావరణ పరిరక్షణ కమీటీలు ఏర్పడినట్టుగా గ్రామ యువకులు తెలిపారు. పార్టీలకతీతంగా అంతా జేఏసీగా ఏర్పడి  గ్రామమంతా ఏకతాటిపైన నిలిచి కంపెనీ విస్తరణను ఆపాల్సిందే అని డిమాండ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. కొందరు స్థానిక నేతలు డబ్బులు తీసుకొని కంపెనీలతో కుమ్మకవుతున్నారని గ్రామాన్ని ఆగం చేస్తున్న నాయకులను తరిమికొడుతామని యువకులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటి వరకు ఒక ఎత్తు… ఇక ఇప్పటి నుంచి ఒక ఎత్తు అని గ్రామ యువకులు నినదిస్తున్నారు. కంపెనీ వారు కూడా భారీ పోలీసు బలగాలతో ప్రజాభిప్రాయ సేకరణకు రానున్నట్టుగా తెలుస్తోంది. దీంతో గ్రామంలో ఉద్రిక్తతంగానే ప్రజాభిప్రాయ సేకరణ జరిగే అవకాశాలు ఉన్నాయని గ్రామస్థులు అంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు ఇంకా 24 రోజులున్నా పరిస్థితి ఇప్పటి నుంచే ఉద్రిక్తంగా తయారైంది. అవసరమైతే ఈ లోపు హైకోర్టులో పిటిషన్ వేసి  స్టే తెస్తామని గ్రామస్తులు చెప్పారు. గ్రామ జెఏసీ ఏర్పాటుకు ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. మొత్తానికి వెలిమినేడులో టెన్షన్ వాతావరణం నెలకొంది.