కంపెనీల విస్తరణ పై వెలిమినేడులో పెరిగిన కసి

వెలిమినేడు గ్రామంలో కంపెనీల విస్తరణపై జరిగే ప్రజాభిప్రాయ సేకరణపై సమీకరణలు మొదలయ్యాయి. విపత్తు… మీద పడకముందే మేల్కోనేందుకు గ్రామం అంతా సిద్దమైంది. ఇప్పుడు ఇక “వెలిమినేడులో జెండాలను పక్కకు పెట్టి కంపెనీ విస్తరణ ఆపాలి అనే సింగిల్ ఎజెండానే లక్ష్యంగా” గ్రామ జనమంతా ఐక్యమత్యంతో ముందుకు కదులుతున్నారు. కంపు కొట్టె కంపెనీలు మాకొద్దు… కంపెనీల అంతు చూస్తామంటూ పిడికిలి బిగించి ముందుకు సాగుతున్నారు. చిన్నా, పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా గ్రామమంతా ఒక్క తాటిపై నిలిచి నినదిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకొని కంపెనీల విస్తరణను ఆపేందుకు ముందుకు కదులుతున్నారు.

వెలిమినేడు నేషనల్ హైవే 65 గ్రామం మీదుగానే పోతుంది. ఇదే ఇప్పుడు ఈ గ్రామానికి శాపంగా మారిందేమోనని పలువురు  గ్రామస్థులు అంటున్నారు. హైవేకి దగ్గరగా ఉండటంతో కంపెనీల కన్ను గ్రామంపై పడింది. పెట్టిన కంపెనీలు చాలవు అన్నట్టు విస్తరిస్తామని మరో మెలిక. దీంతో అయోమయంలో గ్రామ ప్రజలు పడ్డారు. ఏం చేయగలం అని చేతులు కట్టుకొని కూర్చోలే. పోరాడి మా దమ్మేంటో చూపిస్తామని సంకల్పించారు. జెండాలు పక్కకు పెట్టి సింగిల్ ఎజెండాతో ఒక్కటయ్యారు. ముందు గ్రామం బతకటం ముఖ్యమని తలిచారు.

అనుకున్న వెంటనే విద్యార్ధి, ఉపాధ్యాయ, యువజన, మహిళా , కార్మిక, కుల, రాజకీయ పార్టీల నేతలు, జెఏసీలు, పర్యావరణ పరిరక్షణ కమిటీలు అంతా కలిసి బుధవారం సమావేశమయ్యారు. వెలిమినేడు గ్రామంలో గత 10 ఏళ్ల నుంచి కాలుష్యం ముంచెత్తుతుంది. ఇప్పుడు మళ్లీ విస్తరిస్తే పరిస్థితి ఏందంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. పిట్టంపల్లి గ్రామంలో పడ్డ ఆశీర్వాద్ కంపెనీ బొగ్గు దెబ్బకు పిట్టంపల్లి ఊరు నాశనం అయ్యిందని ఇప్పుడు వెలిమినేడు నాశనం చేస్తారా అని సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు కలుషితమయ్యి తాగే నీరు లేక అల్లాడుతున్నారన్నారు. పంట పొలాలన్ని నాశనం అవ్వటంతో వ్యవసాయం చేయలేక పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనికి మాలిన కంపెనీలు దెయ్యాల్లా ఊరును వెంటాడుతున్నాయని వారు విమర్శించారు.

గ్రామంలో సమావేశమైన సభ్యులు 

గ్రామంలో కాలుష్యం పెరిగి ఊపిరి పీల్చుకోవడం కష్టమైతుందని, పిల్లలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఉన్నవారు రోగాల బారిన పడటమే కాకుండా పుట్టే పిల్లలు అవిటి వారిగా పుట్టే ప్రమాదముందని కమిటీ సభ్యులు అన్నారు. అసలే ఎంత కాలం బతుకుతామో చెప్పలేని పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో ఈ కంపెనీల కంపుతో 50 ఏళ్లైనా బతుకగలమా అని వారు ఆవేదన చెందారు. పిట్టంపల్లి, బొంగోని చెర్వు, కిష్టాపురం, పేరేపల్లి, గుండ్రాంపల్లి, ఏపూరు, సుంకెనపల్లి, చిన్నకాపర్తి, ఆరెగూడెం, మొర్సుగూడెం, పెద్ద కాపర్తి, సిరిపురం, వెల్లంకి గ్రామాలకు భవిష్యత్తులో  ఈ కాలుష్య ముప్పు పాకే అవకాశం ఉంది. అందుకే అన్ని గ్రామాల ప్రజలు ఆలోచించి ఈ ముప్పును ఆపేందుకు ముందుకు రావాలని కమిటి సభ్యులు కోరారు. వెలిమినేడు గ్రామంలో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే గ్రామ సభ పెట్టి  ఏకగ్రీవంగా కంపెనీల విస్తరణను అడ్డుకుంటామని తీర్మానించారు. గ్రామ కమిటి కొన్ని నినాదాలతో పోరాట వ్యూహాలను ప్రకటించింది. అవి

  1. ప్రాణాలే ముద్దు- కంపెనీలే వద్దు

  2. కాలుష్య మహమ్మారిని…. తరిమి కొడుదాం

  3. వెలిమినేడు గ్రామానికి కావాలి… స్వచ్చమైన పర్యావరణం

  4. కంపెనీల విస్తరణను ఆపుదాం… గ్రామాన్ని కాపాడుదాం

  5. యువకులారా మేల్కొండి… కాలుష్యాన్ని ఆపండి

  6. భూ మాతను కన్నీరు పెట్టించే కంపెనీలు…. వద్దు వద్దు

ప్రజాభిప్రాయ సేకరణకు భారీ జనసమీకరణ చేసే దిశగా సభ్యులు వ్యూహాలు వేస్తున్నారు. వెలిమినేడు గ్రామం వేదికగా జరిగే ఈ సమావేశంలో అన్ని గ్రామాల ప్రజలు పాల్గొనేలా కృషి చేస్తున్నారు. బొంగొని చెర్వు, పేరేపల్లి, కిష్టాపురం, పిట్టంపల్లి, ఏపూరు, గుండ్రాంపల్లి, సుంకెనపల్లి, చిన్నకాపర్తి, ఆరెగూడెం, మొర్సుగూడెం, సిరిపురం, వెల్లంకి గ్రామాలలో కూడా అవసరమైతే సభలు పెట్టి వారికి కూడా జరిగే నష్టాన్ని వివరించి ప్రజాభిప్రాయ సేకరణలో ఈ గ్రామాల ప్రజలు కూడా తమ బాధను చెప్పి గొంతు వినిపించేలా చేయాలని నేతలంతా సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామ సభ ఆమోదం లేకుండానే కంపెనీలకు అనుమతి ఇవ్వవచ్చనే నిబంధనను తీసుకురావడంతో ఈ సమస్య వచ్చిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ పెద్దలు పెద్ద మనసుతో మా గ్రామ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులంతా వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే, మంత్రులు కూడా దీనిపై స్పందించాలన్నారు. సెప్టెంబర్ 14 టెన్షన్ గ్రామంలో కొనసాగుతూనే ఉంది.