విజయనగరం జిల్లాలో విషాదం జరిగింది. వారిద్దరు ప్రేమించుకున్నా వారి పెళ్లికి కులం అడ్డు వచ్చింది. దీంతో అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం చేశారు. రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలో ఏమైందో ఏమో ప్రేమికులిద్దరూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన పాలకొండ కృష్ణవేణి(18) ఇంటర్ వరకు చదువుకుంది. అదే గ్రామానికి చెందిన చింతల బెలగాం చంద్రశేఖర్ డిగ్రీ(20) సెకండియర్ చదువుతున్నాడు. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా ప్రేమాయణం నడుస్తుంది. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఒకరిది ఎస్సీ కులం కాగా మరొకరిది బిసి కులం. వీరు విషయాన్ని ఇంట్ల చెప్పే దైర్యం చేయలేకపోయారు.
ఇంతలోనే కృష్ణవేణికి కొత్తూరు గ్రామానికి చెందిన చిన్నారావు అనే యువకుడితో వివాహం నిశ్చయం చేశారు. చిన్నారావు ఆర్మీలో పని చేస్తున్నాడు. ప్రేమికులు ఇంట్లో చెప్పేందుకు సతమతమయ్యారు. జనవరి 23న పెళ్లి నిశ్చయించారు. చిన్నారావు కృష్ణవేణిని కలిసేందుకు వచ్చి వెళ్లేవాడు. అయినా కృష్ణవేణి మనస్సు చంద్రశేఖర్ మీదనే ఉంది. ఇక తమ ప్రేమ గెలవదనుకొని ఇద్దరు కలిసి చావాలని నిర్ణయించుకున్నారు.

జనవరి 19న కృష్ణవేణిని చూసేందుకు చంటి వచ్చాడు. కాబోయే భర్తతో అనుమానం రాకుండా చనువుగా ఉన్నట్టుగా నటించింది. స్నేహితురాలి పెళ్లికి తీసుకెళ్లమని కోరడంతో చంటి ఆనందంగా తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు కొమరాడ మండలం శివిని గ్రామ శివారులో టాయిలెట్ వెళ్తాను అని బైక్ ఆపించింది. అలా వెళ్లిన కృష్ణవేణి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన చంటి అంతటా వెతికిన ప్రయోజనం లేదు. దీంతో పార్వతీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
కృష్ణవేణి ఆచూకీ కోసం వేట ప్రారంభించిన పోలీసులకు శివుని గ్రామ శివారులో రైల్వే కట్ట పై కృష్ణవేణి, చంద్ర శేఖర్ మృతదేహాలు కనిపించాయి. దీంతో ఇరు కుటుంబాల్లో కూడా విషాద చాయలు అలుముకున్నాయి. రెండు రోజుల్లో పెళ్లి ఉండడంతో కార్డులు పంచి, అన్ని ఏర్పాట్లు చేసుకున్న చంటి కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
