మాకు నచ్చిన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురాకపోతే.. మాయొక్క చివరి ఓటు ఇదే..’ అంటూ మందుబాబులు మునిసిపల్ ఎన్నికల వేళ బ్యాలెట్ పేపర్‌తోపాటుగా స్లిప్పులు పోలింగ్ బాక్సుల్లో వేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. దీన్నొక హాస్యాస్పదమైన అంశంగా చాలామంది తీసుకుంటున్నారు.
విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ‘మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు..’ అంటూ కొన్ని స్లిప్పులు పోలింగ్ బాక్సుల్లో కనిపించాయి. విశాఖలో ‘ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా’ నినాదాలతో స్లిప్పులు లభ్యమయ్యాయి కౌంటింగ్ సందర్భంగా. చిత్రమేంటంటే విశాఖ ఉక్కు, అమరావతి స్లిప్పుల వ్యవహారాన్ని మీడియా కూడా లౌట్ తీసుకుంది. ఎందుకంటే, అవి పనికొచ్చే వ్యవహారాలు గనుక. పనికిమాలిన వ్యవహారం మద్యం బ్రాండ్లకు సంబంధించిన వార్తల్ని మీడియా హైలైట్ చేస్తోంది. రాష్ట్ర ప్రజలెవరూ ప్రత్యేక హోదా కోరుకోవడంలేదు.. ప్రత్యేక రైల్వేజోన్ కూడా అడగడంలేదు.. పోలవరం ప్రాజెక్టు సంగతీ మర్చిపోయారు..
కడప ఉక్కు, దుగరాజపట్నం పోర్టు వ్యవహారాన్ని కూడా పట్టించుకోలేదు. పెరుగుతున్న ధరలూ లెక్క లేదు. అసలు ఓటరు దేని గురించి ఆలోచిస్తున్నాడు.? ఎందుకు ఓటేస్తున్నాడు.? అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఓ మందుబాబుకి వున్న సోయ, సామాన్యుడికి.. అందునా మేధావి వర్గంగా చెప్పుకునేవారికి ఎందుకు లేదు.? విద్యవంతులెందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.? ఎవర్ని గెలిపించాలన్నది ఓటర్ల ఇష్టం. దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ, కీలకమైన అంశాలపై ప్రభుత్వాలకు తమ అభిప్రాయాల్ని తెలియజేసేందుకు అవకాశం దొరికితే, దాన్నెందుకు సద్వినియోగం చేసుకోలేదన్నదే ఇక్కడ ప్రశ్న. అందరికీ ఇలా స్లిప్పులు వేసే అవకాశం రాకపోవచ్చు.. వచ్చినా చాలామంది వినియోగించుకునేందుకు ఇష్టపడకపోయి వుండొచ్చు. ఇదిలా వుంటే, ‘నోటా’ వల్ల ఉపయోగమేంటి.? అన్న చర్చ ఇంకోసారి తెరపైకొచ్చింది. ‘నోటా’ వుండగా ఏకగ్రీవం.. అన్న మాటకు ఆస్కారమేది.? అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.